న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతతో ఆందోళన చెందుతున్నాయి. రోజురోజుకూ కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఆక్సిజన్ అవసరం అదేస్థాయిలో పెరుగుతోంది. దాంతో, ఆరోగ్య సదుపాయాల కల్పనలో వైఫల్యాలను ప్రశ్నిస్తూ పలువురు హైకోర్టులను ఆశ్రయిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా డాక్టర్లు కూడా ఆక్సిజన్ కొరత వల్ల తలెత్తుతున్న సమస్యలను గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి జరిగే ఆక్సిజన్ పంపిణీలో సమానత్వం పాటించాలని రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
ఓ మనిషికి ఆక్సిజన్ అవసరం ఎంత..?
మనిషి ఊపిరితిత్తులు నిమిషానికి 56 మిల్లీలీటర్ల ఆక్సిజన్‌ను పీల్చుకుంటాయి. మొత్తం శరీరం నిమిషానికి 250 మిల్లీలీటర్ల ఆక్సిజన్‌ను వినియోగించుకుంటుంది. వ్యాధిగ్రస్థమైన ఊపిరితిత్తులకు నాలుగు రెట్లు అధికంగా ఆక్సిజన్ అవసరమవుతుంది.
కొవిడ్19 బాధితుల్లో ఆక్సిజన్ తగ్గడానికి కారణాలు
గాలి పీల్చుకున్నపుడు ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను గ్రహించి, కార్బన్‌డై ఆక్సైడ్‌ను బయటకు వదుల్తాయి. కొవిడ్ వల్ల ఊపిరితిత్తుల్లో వాపు ఏర్పడుతుంది. దాంతో, ఆక్సిజన్‌ను గ్రహించడం, కార్బన్‌డై ఆక్సైడ్‌ను వదలడంలో ఇబ్బంది కలుగుతుంది. ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే మార్గం మూసుకుపోతుంది. శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుంది. అది న్యుమోనియాకు దారితీస్తుంది. ఈ దశలో ఆక్సిజన్ సపోర్ట్ అవసరమవుతుంది.
ఆక్సిజన్ సపోర్ట్ ఎవరికి ఇవ్వాలి..?
ఆక్సిజన్ లెవల్స్ 90 శాతంకన్నా తగ్గినవారికి సపోర్ట్ అవసరం. ఊపిరితిత్తుల వ్యాధులున్నవారికి ప్రారంభదశలోనే ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వాలి. ఆక్సిజన్ సపోర్ట్ తగిన సమయంలో ఇవ్వకపోతే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.
ఊపిరితిత్తులు దెబ్బతిన్న కేసుల్లో శ్వాస ఎలా..?
స్వల్పంగా లేదా ఓ మోస్తరుగా దెబ్బతిన్న కేసుల్లో ఫేస్‌మాస్క్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయాలి. తీవ్రంగా దెబ్బతిన్న కేసుల్లో ముక్కు ద్వారా అధికమొత్తంలో ఆక్సిజన్ అందించాలి. అతితీవ్రంగా దెబ్బతిన్న కేసుల్లో వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వాలి.
కరోనా మొదటి, రెండో వేవ్‌ల్లో ఆక్సిజన్ అవసరం..?
మొదటి వేవ్‌లో 41.5 శాతం పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం కాగా, రెండోవేవ్‌లో 54.5 శాతంమందికి అవసరమవుతోందని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డా॥ బల్‌రామ్ భార్గవ తెలిపారు.