జెనెవా : ఈ ఏడాది మిగిలిన సమయంలో బూస్టర్ షాట్‌లను వెంటనే నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) పిలుపు నిచ్చింది. సంపన్న దేశాలు తమతమ దేశాలలో అదనపు మోతాదుల కోవిడ్ టీకాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిలిపివేయడం మంచిది. దీనికి బదులుగా టీకాలను పెద్ద ఎత్తున పేదదేశాలకు పంపిణీ చేయడం మంచిదని ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నమ్ గెబ్రెయెసస్ కోరారు. పలు సార్లు ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపును సంపన్న దేశాలు బేఖాతరు చేస్తున్నాయి. బూస్టర్ డోస్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ దశలో తమ విజ్ఞప్తిని టెడ్రోస్ పునరావృతంచేశారు. ప్రపంచ ఔషధ ఉత్పత్తి దార్ల సంఘం చేసిన ప్రకటన పట్ల డైరెక్టర్ జనరల్ ఆవేదన వ్యక్తం చేశారు. బూస్టర్ డోసులకు , ప్రపంచవ్యాప్త దేశాల అవసరాలకు కూడా సరిపడా టీకాలు ఉన్నాయని సంఘం చెప్పడం దారుణం అని తెలిపారు. వ్యాక్సిన్ల పంపిణీపై ఆధిపత్యం చలాయించే కంపెనీలు, దేశాలూ పేద దేశాలు అందిన టీకాలతో సంతృప్తి చెందాలనే ధోరణితో ఉండటం బాధాకరం అన్నారు.