న్యూయార్క్ : భారత్‌లో కరోనా కల్లోలం ఇంకా ఆందోళనకరంగానే ఉందని, కొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) చీఫ్ టెడ్రోస్ అథనామ్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. కరోనా తొలి ఏడాది కంటే రెండో ఏడాది చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే వేలాది ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు, మొబైల్‌ఆస్పత్రులు, మాస్కులు, ఇతర వైద్య పరికరాల సరఫరాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున భారత్‌కు అందచేశామని, చెప్పారు. భారత్‌కు సాయం చేయడానికి ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్ లోనే కాకుండా నేపాల్, శ్రీలంక, వియత్నాం, కాంబోడియా, థాయ్‌లాండ్, ఈజిప్టు దేశాల్లోను కేసులు, మరణాలు ఇంకా ఆందోళనకరంగా ఉన్నాయని, గతవారంలో ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 40 శాతం అమెరికా దేశాల్లోనివేనని పేర్కొన్నారు. ఆఫ్రికా దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని, కరోనా నివారణకు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఎప్పటికప్పుడు సాయం అందిస్తుందని చెప్పారు. వ్యాక్సిన్‌తోపాటు వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా కట్టడి సాధ్యమౌతుందని సూచించారు.