గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ
డబ్లుహెచ్‌ఒ ప్రకటన
టీకా రాని వ్యాధి జోరు
జెనీవా : పలు దేశాలను కలవరపరుస్తోన్న మంకీపాక్స్ తీవ్రతను గుర్తించి దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ పరిణామంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) ప్రకటించింది. ఇప్పటికే ఈ అంటువ్యాధి 70కి పైగా దేశాలలో తలెత్తింది. వేగంగా వ్యాపిస్తోన్న అనారోగ్యకర పరిణామం అయినందున దీనిని ప్రపంచ స్థాయి అత్యయిక స్థితిగా నిర్థారించుకుని ఈ మేరకు ప్రకటన వెలువరిస్తున్నట్లు డబ్లుహెచ్‌ఒ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ గెబ్రెయెసస్ తమ సంస్థ నిర్ణయాన్ని వెల్లడించారు. మంకీపాక్స్‌పై ఆరోగ్య సంస్థకు చెందిన ఎమర్జెన్సీ కమిటీ శనివారం సమావేశం అయింది. ఇందులో పలు దేశాల నుంచి పూర్తిస్థాయి ఏకాభిప్రాయం కుదరకపోయినా ప్రపంచ ఆరోగ్య సంస్థ సొంతంగా నిర్ణయం తీసుకుని దీనిని గ్లోబల్ ఎమర్జెన్సీ జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించింది. ఈ విధంగా సొంత నిర్ణయం తీసుకోవడం తొలిసారి అయింది.
గతంలో అరుదైన అసాధారణ వ్యాధిగా ఉండి అంతరించిన మంకీపాక్స్ తిరిగి పలు దేశాలలో విస్తరించుకుని పోవడంతో ఆందోళన వ్యక్తం అయింది. అయితే ఇప్పటికీ సంబంధిత వ్యాధికి సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఓ వైపు కొవిడ్‌కు వ్యాక్సిన్ల కొరతతో తల్లడిల్లుతున్న ప్రపంచదేశాలకు ఇప్పుడు అనివార్యంగా మంకీపాక్స్ వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తెచ్చుకోవల్సిన పరిస్థితి ఇప్పటి గ్లోబల్ ఎమర్జెన్సీ విధింపుతో ఏర్పడుతోంది. అర్థం కాని పలు విధానాలలో మంకీపాక్స్ విస్తరించుకుని పోతోందని, దీనిని కట్టడి చేసేందుకు ఎమర్జెన్సీ ప్రకటన తప్ప మరో గత్యంతరం లేదని టెడ్రోస్ స్పష్టం చేశారు. భారత్‌లో కూడా మంకీపాక్స్ కలవరం కల్గించింది. కేరళలోనే మూడు కేసులు నిర్థారణ అయ్యాయి. ఇది వ్యాప్తి చెందే పద్ధతి ఏమిటనేది తెలియకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా దీనిపై కలవరం అధికం అయింది.