కెటిఆర్ ట్వీట్‌కు థరూర్ స్పందన
హైదరాబాద్/ ఢిల్లీ : అసలే కరోనాతో జనం కష్టాల ఘాట, దీనికి తోడు కరోనా మందుల పేర్లు మరీ గొట్టు ఏమిటిదంతా ? అని తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లో సందేహం వ్యక్తం చేశారు. పలకడానికి కఠినంగా ఉండే పేర్లను ఎందుకు పెడుతున్నారో తెలియడం లేదని అన్నారు. బహు గందరగోళపు పేర్లు వివరాలు ఎందుకు పెడుతున్నారో మీకైనా తెలుసునా? అని కాంగ్రెస్ నేత పద పరిజ్ఞాని శశిథరూర్‌కు సవాలు విసిరారు. పొసాకోనాజోల్, క్రెసెంబా, టోసిల్‌జుమాబ్, రెమ్‌డెసివిర్, బరిసిటినిబ్ ఈ విధంగా అన్ని పలకలేని విధంగాఉన్నాయని వీటి అర్థాలు, మాట్లాడే తీరు చెపుతారా? థరూర్‌జీ అని అడగగా, దీనికి తిరువనంతపురం ఎంపి తనదైన రీతిలో జవాబు ఇస్తూ అర్థం కాని పదాలతో ఎందుకు తలనొప్పి కెటిఆర్ బ్రదర్.
వీటి పేర్లు పెట్టమంటే తానైతే కరోనిల్, కరోజీరక్ష, గోకరోనా గో అంటూ సంతోషంగా పిలుచుకుంటానని అన్నారు. చివరిలో ఈట్వీట్‌లో థరూర్ 29 అక్షరాలతో కూడిన ఇంగ్లిషు పదాన్ని వాడారు. floccknaucinnihilipilification అని వ్యాఖ్యానించారు. ఈ భారీ పదానికి అర్థం అవసరం లేని పని అని ఇంతకు ముందు శశిథరూర్ చెప్పి ఉన్నారు. ఈ పదాన్ని తిరిగి ఇప్పుడు కెటిఆర్‌పై ప్రయోగించారు. పదాల గారడీతో అందరిని ఆకట్టుకుంటూ థరూర్ విస్మయపర్చడం ఆనవాయితీ. కరోనా మందులపై కెటిఆర్‌కు తనదైన రీతిలో జవాబిచ్చారు. పలకలేని పదాలు వాడుతున్న కంపెనీల పట్ల కెటిఆర్ స్పందనతో ఏకీభవించారు.