Wednesday, January 22, 2025

Amritpal singh: ఎవరీ అమృత్‌పాల్ సింగ్?

- Advertisement -
- Advertisement -

దుబాయ్‌లో ఉన్నంత కాలం గడ్డం పెంచని, తలపాగా ధరించని అమృత్‌పాల్ పూర్తి సిక్కు సాంప్రదాయిక వేషధారణతో 29 సెప్టెంబర్ 2022 నాడు పంజాబ్‌కు వచ్చి, రావడంతోనే బింద్రేన్ వాలే గ్రామాన్ని సందర్శించాడు. ఆ రోజు అక్కడ వేల మంది అనుయాయుల సమక్షంలో ఆయన దస్తర్ బందీ అనే తలపాగా స్వీకరణ తంతు ఘనంగా జరిగింది. భారీ సిక్కు సమూహాల తోడుగా ఆయన సిక్కు మందిరాలను దర్శించాడు. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో తొలిసారిగా ఆయన నేతృత్వంలో ఖల్సా పంథాలో భాగమవుతున్నట్లు వందల మందితో అమృత్ పర్చార్ అనే పవిత్ర జల స్వీకరణ కార్యక్రమం జరిగింది. వారిస్ పంజాబ్ దే తరపున నవంబర్‌లో ఖల్సా వెహిర్ అనే సభ నిర్వహించారు. అందులో ఆయన డ్రగ్స్‌కు దూరముండాలని సిక్కు యువతను ఉద్దేశించి అన్నాడు.

Punjab Police search continue for Amritpal Singh

ఆరు నెలల కాలంలోనే వందలాది సిక్కులను అనుయాయులుగా మార్చుకొని, ఖలిస్థాన్ ఉద్యమానికి తిరిగి ప్రాణం పోస్తున్నట్లుగా మాటలు వల్లిస్తూ వచ్చిన అమృత్‌పాల్ సింగ్ నేడు పంజాబు పోలీసులకు సవాలుగా నిలిచాడు. ఇటీవల ఆ రాష్ట్రంలో పలు అల్లర్లకు సూత్రధారిగా నిలిచిన అమృత్ పాల్ వేటలో ఇప్పుడు పంజాబ్ సాయుధ బలగాలు నిమగ్నమై ఉన్నారు. ఆయన్ని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారని, బూటకపు ఎన్ కౌంటర్‌లో చంపేసే అవకాశం ఉందని అమృత్ తరఫున ఒక అడ్వొకేట్ కోర్టును కూడా ఆశ్రయించాడు. ఒక్కసారిగా తెరపైకి వచ్చి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ 30 ఏళ్ల సిక్కు యువకుడు ఎవరు అనే ఆసక్తి దేశ వ్యాప్తంగా పెరిగింది.

అమృత్ సర్ జిల్లాలోని జల్లుపూర్‌లో జన్మించిన అమృత్ పాల్ 19 ఏటనే దుబాయ్ వెళ్లి అక్కడ తమ కుటుంబం నడిపే రవాణా వ్యాపారంలో చేరిపోయాడు. కపుర్తలాలో పాలిటెక్నిక్ చదువును మధ్యలోనే వదిలేసి దుబాయ్ వెళ్లిన ఆయన అక్కడ ఆపరేషన్స్ మేనేజర్‌గా జీవితం గడుపుతున్నాడు. అక్కడ ఆయ న గడ్డం, తలపాగా లేని సాధారణ యువకుడే. 2020లో ఢిల్లీలో జరిగిన పంజాబు రైతుల ఆందోళన పట్ల సానుభూతితో వారికి మద్దతుగా ఆ సమయంలో ఇక్కడికి వచ్చిపోయేవాడట. పంజాబీ నటుడు దీప్ సిద్దు ఢిల్లీ రైతుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలిపి స్వయంగా అందులో పాల్గొన్నాడు. సిక్కు యువత పెద్ద సంఖ్యలో ఉద్యమంలో భాగస్వాములు అయ్యేలా ఆయన కృషి చేశాడు. అయితే 2021 రిపబ్లిక్ డే రోజున పెరేడ్ మైదానం వద్ద జరిగిన నిబంధనల ఉల్లంఘన, ఎర్రకోటపై సిక్కు సాంప్రదాయిక జెండాను ఎగరవేత లాంటి చర్యల్లో నిందితుడిగా ఢిల్లీ పోలీసులు దీప్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఆయనకు ఎలాంటి గత నేర చరిత్ర లేనందు వల్ల రెండు నెలల జైలు జీవితం తరువాత కోర్టు ఏప్రిల్ 2021లో బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దీప్ ‘వారిస్ పంజాబ్ దే’ అనే రాజకీయ సంస్థను స్థాపించాడు. కేంద్ర ప్రభుత్వం నుండి పంజాబ్ రాష్ట్ర హక్కుల సాధనకు, పంజాబీల ఆత్మ గౌరవ రక్షణ కోసం తన సంస్థ పని చేస్తుందని చెప్పాడు. స్వయంగా దీప్ సిద్దు సినిమా నటుడు, గాయకుడు, సామాజిక ఉద్యమకర్త కావడంతో సిక్కు యువత ఆయనకు లక్ష్యాలకు తోడుగా నిలిచింది. అయితే అనుకోకుండా దీప్ 15 ఫిబ్రవరి 2022 నాడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన మరణంతో సిక్కు సమాజం తీవ్ర వేదనకు గురైంది. దీప్ స్మారకంగా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ఆయన నెలకొల్పిన వారిస్ పంజాబ్ దే పంజాబీల గుండెల్లో ఒక తీపి గురుతుగా మిగిలిపోయింది. అదే అదునుగా అమృత్‌పాల్ రంగప్రవేశం చేసి తనను వారిస్ పంజాబ్ దే నేతగా ప్రకటించుకున్నాడు.

దుబాయ్‌లో ఉంటూనే ఆ సంస్థ స్థాపనలో తాను దీప్‌కు తోడుగా ఉన్నానని పత్రికల వారితో చెప్పాడు. తమ సంస్థకు అమృత్‌పాల్ సింగ్ నాయకుడు అని వారిస్ పంజాబ్ దే పేరిట 4 మార్చి 2022 నాడు ఓ వార్త వెలువడింది. జనంలో ఆ సంస్థకు ఉన్న ఆదరాభిమానాలను వాడుకొని పంజాబీలకు ఒక నాయకుడిగా ఎదగాలని అమృత్ దేశంలో అడుగుపెట్టి ఉంటాడు.
దుబాయ్‌లో ఉన్నంత కాలం గడ్డం పెంచని, తలపాగా ధరించని అమృత్‌పాల్ పూర్తి సిక్కు సాంప్రదాయిక వేషధారణతో 29 సెప్టెంబర్ 2022 నాడు పంజాబ్‌కు వచ్చి, రావడంతోనే బింద్రేన్ వాలే గ్రామాన్ని సందర్శించాడు. ఆ రోజు అక్కడ వేల మంది అనుయాయుల సమక్షంలో ఆయన దస్తర్ బందీ అనే తలపాగా స్వీకరణ తంతు ఘనంగా జరిగింది. భారీ సిక్కు సమూహాల తోడుగా ఆయన సిక్కు మందిరాలను దర్శించాడు. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో తొలిసారిగా ఆయన నేతృత్వంలో ఖల్సా పంథాలో భాగమవుతున్నట్లు వందల మందితో అమృత్ పర్చార్ అనే పవిత్ర జల స్వీకరణ కార్యక్రమం జరిగింది. వారిస్ పంజాబ్ దే తరపున నవంబర్‌లో ఖల్సా వెహిర్ అనే సభ నిర్వహించారు. అందులో ఆయన డ్రగ్స్‌కు దూరముండాలని సిక్కు యువతను ఉద్దేశించి అన్నాడు. అయితే వారిస్ పంజాబ్ దే పై అమృత్‌పాల్‌కు ఎలాంటి అధికారం లేదని, అసలు దీప్‌ను ఆయన కలువనేలేదని దీప్ కుటుంబ సభ్యులు అంటున్నారు. బింద్రేన్ వాలే తమ నాయకుడు అని, ఖలిస్థాన్ డిమాండ్‌లో తప్పేమీ లేదని అమృత్ ప్రసంగించడం వారిస్ పంజాబ్ దే లక్ష్యాలకు విరుద్ధమని వారు అంటున్నారు.

అమృత్‌పాల్ సంధు యువతను వ్యసనాలకు దూరంగా ఉండాలని పైకి చెబుతూనే ఖలిస్థాన్ సెంటిమెంట్ పంజాబీల గుండెల్లో శాశ్వతంగా ఉంటుందని, దాన్ని ఎవరూ చెరిపేయలేరని వేర్పాటువాదాన్ని కూడా ప్రస్తావించేవాడు. 18వ శతాబ్దంలో ఏర్పడ్డ తమ దేశాన్ని తిరిగి అడుగుతున్నాం తప్ప ఢిల్లీ గద్దెను అడగడం లేదని అనేవాడు. అలా హద్దు మీరుతున్న ఆయన చర్యలను పంజాబ్ ప్రభుత్వం మతపర సున్నిత అంశంగా మాత్రమే చూసింది. అయితే అమృత్‌పాల్ చాప కింద నీరులా విస్తరించిన విషయం ఒకే ఒక్క సంఘటనతో బయటపడింది. ఫిబ్రవరిలో అమృత్‌పాల్ అనుచరులు తనను కిడ్నాప్ చేసి హింసించారని అజ్నాలా పోలీస్ స్టేషన్‌కు ఒక ఫిర్యాదు అందింది.

పోలీసులు కదిలి ఆరుగురిని అదుపులోకి తీసికున్నారు. వారిలో లవ్ ప్రీత్ సింగ్ అనే అమృత్‌కి దగ్గరివాడు కూడా ఉన్నాడు. దాంతో ఉగ్రుడైన అమృత్ కేసు కొట్టివేయమని పోలీసులను హెచ్చరించాడు. ఆ తరువాత ఆయన అనుచరులు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేసి పోలీసు సిబ్బందిని గాయపరిచారు. అప్పుడుగాని రాష్ట్ర పోలీసు బలగాలకు అమృత్ ఎంత శక్తిమంతుడో అర్థం కాలేదు. ఈ నెల 18న వారిస్ పంజాబ్ దే అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు చర్యలను గమనించిన అమృత్‌పాల్ తన కాన్వాయ్‌లోని వాహనాల్లో మారుతూ పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడు పంజాబ్ పోలీసు వ్యవస్థ మొత్తం ఆయన వెదుకులాటలో ఉంది.

ఇదంతా చూస్తుంటే అమృత్ సింగ్ కదలికలపై సరియైన నిఘా కరువైనట్లుగా అనిపిస్తుంది. పంజాబ్ విడి దేశంగా ఉండాలని కోరే ఖలిస్థాన్ ఉద్యమాన్ని తిరిగి రాజేసే చర్యలను ఆరు నెలలుగా, అదీ ఒక వ్యక్తి అమృత్‌పాల్ అనుచరులు తనను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు అందే దాకా గమనించకపోవడం విడ్డూరంగా ఉంది. అసలు దుబాయ్‌లో సామాన్య జీవితం గడిపే అమృత్‌కు ఖరీదైన కార్లు ఎలా వచ్చాయి, ఆయన అనుచరుల చేతుల్లోకి ఆధునిక ఆయుధాలు ఎలా చేరాయో తెలుసుకోవలసిన బాధ్యత దేశ భద్రతా వర్గాలకు ఉంటుంది. అమృత్ సింగ్ కోసం పోలీసుల వేట, ఆయన అనుచరుల అరెస్టులకు నిరసనగా అమెరికా, బ్రిటన్ దేశాల భారత దౌత్య కార్యాలయాలపై అక్కడి సిక్కు పౌరులు దాడికి దిగడం ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఖలిస్థాన్ వాదుల కన్నా అమృత్ రాక వెనుక ఖచ్చితంగా పాకిస్తాన్ హస్తం ఉందనే కోణంలో అడుగులు ముందుకు పడాలి. 1984 కాలపు చరిత్ర పునరావృతం కాకుండా, మరో ‘బింద్రేన్ వాలా’ పుట్టుకు రాకుండా తక్షణం తగు చర్యలు చేపట్టవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News