విద్వేష ప్రసంగాలను నివారించడంలో ఎలాంటి జాప్యం పనికి రాదని, ఈ విషయంలో వైఫల్యం జరిగితే న్యాయస్థాన ధిక్కారంగా పరిగణించవలసి వస్తుందని మూడేళ్ల క్రితమే సుప్రీం కోర్టు రాష్ట్రాలకు, పోలీస్ విభాగాలకు హెచ్చరించింది. ఏ మతం వారైనా విద్వేష ప్రసంగాలు చేస్తే తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినాసరే ఇవి ఆగడం లేదు. దేశంలో ప్రాంతాలకు, భాషలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసిమెలసి బతుకుతున్న ప్రశాంతమైన వాతావరణాన్ని భగ్నం చేయడం క్షమించరానిది. దేశంలోని పాలక వర్గాలవారే విద్వేష ప్రసంగాలు చేయడం, అన్యమతస్థులను ద్వేషించడం, అంతః కలహాలకు అవకాశం కల్పించడం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ ఇలా ఎన్నో రాష్ట్రాల్లో ఓట్ల రాజకీయానికి మతోన్మాదానికి ముడిపెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కొంతమంది రాజకీయ నేతలకు ఒక జాడ్యంలా పెరుగుతోంది. బుధవారం పశ్చిమబెంగాల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ విపక్ష నాయకుడు, బిజెపి నేత సువేందు అధికారి మరో పది నెలల్లో రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌లోని ముస్లిం ఎమ్‌ఎల్‌ఎలను బయటకు వెళ్లగొడతామని, హిందువులంతా కలిసి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించుతారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ బిమన్ బెనర్జీని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తాము ఓడిస్తామని శపథం చేశారు. ఆయన తీరుకు స్పీకర్ ఆగ్రహం చెంది మార్చి 14 వరకు ఆయనను సస్పెండ్ చేశారు. దీనికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించి ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో వివిధ మతాలు, తెగలు, కులాల వైవిధ్యంతో సామరస్యంగా ప్రజలంతా ఉన్నప్పుడు హిందుత్వం పేరు చెప్పి మరో మతాన్ని, వర్గాన్ని కించపర్చి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు? అని నిలదీశారు. పశ్చిమబెంగాల్ జనాభాలో 23 శాతం షెడ్యూల్డ్ కులాలు, తెగలు, 33 శాతం ముస్లింలు ఉన్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంచనాగా ఉదహరించారు. మతం, భాష, కులం, ప్రాంతం తదితర ప్రాతిపదికగా విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారికి భారత శిక్షాస్మృతి 153ఎ, 153బి, 295ఎ, 298, 505(1), 505(2) సెక్షన్ల కింద శిక్షలు విధించే అవకాశాన్ని చట్టం కల్పిస్తోంది. కానీ ఆ సెక్షన్లు ప్రకారం బాధ్యులపై గట్టి చర్యలు తీసుకుంటున్న సందర్భాలు మచ్చుకి కూడా కనిపించవు. ఈ విద్వేషాల ప్రసంగాల కేసుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది తప్ప శిక్షలు పడడం లేదు. ఈ నెల 14వ తేదీ శుక్రవారం హోలీ పండగ కాబట్టి ముస్లింలంతా నమాజ్ చేసుకోడానికి బయటకువస్తే ఎవరైనా రంగులు జల్లితే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని, అందుకే ముస్లింలంతా ఇళ్లల్లోనే ఉండాలని ఉత్తరప్రదేశ్‌లోని సాక్షాత్తు సంభాల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనూజ్‌కుమార్ చౌదరి హుకుం జారీ చేయడం విచిత్రం. దీనికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గట్టిగా ఆ పోలీస్ అధికారిని మందలించడానికి బదులు సమర్థించారు. పైగా తలపాగా ధరించి ముస్లింలంతా నమాజ్‌కు ఎళ్లాలట. ఆ రోజున శాంతిభద్రతలను పరిరక్షించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదా? ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఓ కులం, మతం లేదని బిజెపి నాయకుడే ఒకరు వ్యక్తిగతంగా నిందించడం తీవ్ర చర్చనీయాంశం అయింది. బిజెపి, దాని అనుబంధ సంస్థలకు చెందిన ముఖ్యులు తరచుగా విద్వేష ప్రసంగాలకు పాల్పడుతుండడం పరిపాటి అయింది. గతంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పత్రికల ఇంటర్యూల్లో ముస్లింలు తమ పరిధుల్లో తాము ఉండాలని, ఒకప్పుడు దేశాన్ని పాలించారు గనుక మళ్లీ పాలించాలని వారు కోరుకోకూడదని సెలవిచ్చారు. ఇందులో ఎంత విద్వేషం దాగి ఉందో తెలుస్తుంది. అలాగే ఎవరో వ్యక్తులు చేసే నేరాలను వారి మతస్థులందరికీ ఆపాదించి వారి దుకాణాలను, రెస్టారెంట్లను బహిష్కరించడం లేదా దాడి చేసి ధ్వంసం చేయడం అమానుషం. ఇలాంటి సంఘటన మహారాష్ట్రలో ఇటీవల జరిగింది. మహారాష్ట్ర సింధుర్గ్ జిల్లాలో మాల్వాన్ అనే చిన్న పట్టణంలో పదిహేనేళ్ల ముస్లిం బాలుడు భారత్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశాడని అరెస్ట్ చేశారు. ఆ కుటుంబం నడుపుకుంటున్న చిన్న షాపును ఫిబ్రవరి 25న ధ్వంసం చేశారు. మతం పేరుతో అనేక కేసులు బనాయించి అతని తల్లిదండ్రులను జైలుకు పంపించారు. ఆ బాలుడ్ని పరిశీలన గృహంలో చేర్చారు. అంతేకాదు తరువాత ఈ కుటుంబాన్ని అక్కడ నుంచి తరిమేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన సాగించారు. సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఆ కుటుంబం షాపును బుల్డోజర్లతో ధ్వంసం చేయడంతో ఆ కుటుంబం దిక్కూమొక్కూలేక రోడ్డునపడింది. ఇదే విధంగా ముస్లిం వ్యాపారులను బహిష్కరించాలని మహారాష్ట్రలోని మాధీ గ్రామ రాజ్యసభ రాజ్యాంగ విరుద్ధ్దంగా తీర్మానించడం గమనార్హం. విద్వేషం సమాజంలోని భిన్నవర్గాల మధ్య సఖ్యతను బలి తీసుకుంటుంది. మెజారిటీ, మైనారిటీ అనే తేడా లేకుండా ప్రజలంతా శాంతియుత సహజీవనం సాగించినప్పుడే దేశం భద్రం గా ఉంటుంది. మైనార్టీలను రెచ్చగొట్టే కొద్దీ ఉగ్రవాద శక్తులకు బీజాలు పడే ప్రమాదం ఉంటుంది. రెచ్చగొట్టి కఠినంగా వ్యవహరించడం వల్ల కీడే గాని మేలు జరగదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ద్వారా భావప్రకటన స్వేచ్ఛనిచ్చింది. అదే సమయంలో దానిపై పరిమితులను కూడా విధించింది. దీనిని గమనించి వ్యవహరించడం ప్రతి భారత పౌరుని బాధ్యత.
ద్వేష ప్రసంగాలతో ఎవరికి మేలు?
- Advertisement -
- Advertisement -
- Advertisement -