Saturday, November 16, 2024

ఉమ్మడి నల్లగొండలో టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులు ఎవరు?

- Advertisement -
- Advertisement -

Who is Nalgonda TRS Party President

హైదరాబాద్: నల్లగొండ ఉమ్మడి జిల్లాలో అధికార టిఆర్ఎస్ పార్టీలో అధ్యక్షుల పదవుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. గులాబీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జిల్లా పీఠాలపై  ఎవరిని కూర్చోబెట్టాలో ఇప్పటికే హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చిందని పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగరి జిల్లాలను ఒక్కో సామాజిక వర్గానికి కేటాయించాలని పార్టీ ఒక  ఆలోచనకు వచ్చిందని చెబుతున్నారు. వాస్తవానికి గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఏ జిల్లాకు సంస్థాగతంగా అధ్యక్షులు లేకుండాపోయారు. పార్టీ నిబంధనలకు చేసిన సవరణలతో జిల్లాల్లో పార్టీపై అజమాయిషీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే కట్టబెట్టారు.

ఎమ్మెల్యేల పెత్తనం…!

వివిధ కోణాల్లో ఆలోచించినప్పుడు కొన్నిచోట్ల ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం అయిందన్న అభిప్రాయం బలపడింది. చివరకు సభ్యత్వ నమోదులోనూ కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. తమకు పోటీగా ఉంటారు అనుకున్న నాయకుల అనుచరగణాన్ని దూరం పెట్టారు. వాళ్లకు కనీసం సాధారణ సభ్యత్వం కూడా ఇవ్వలేదు. ఇద్దరు నాయకులు ఉన్న చోట ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపించింది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న పార్టీ రాష్ట్ర నాయకత్వం తిరిగి పాత పద్దతికే మొగ్గు చూపి జిల్లాల వారీగా అధ్యక్ష పదవులను భర్తీ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది.

రెండు జిల్లాలకు ఖరారు..!

ఉమ్మడి జిల్లాలోని మూడు జిల్లాలకు కొత్తగా అధ్యక్షులను నియమించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వేట మొదలు పెట్టింది అధిష్టానం.  ఇప్పటికిప్పుడు అందుతున్న సమాచారం మేరకు నల్లగొండ జిల్లాలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిషన్ రెడ్డికే   అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి టిఆర్ఎస్ లో ఉన్న ఆయన సంస్థాగతంగా వివిధ పదవులను నిర్వహించారు. ఒక దశలో ఎమ్మెల్సీ పోటీలోనూ ఉన్నారు. కానీ కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సమీకరణాల నేపథ్యంలో ముందైతే పార్టీ సారథ్య బాధ్యతలను అప్పజెప్పాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

భువనగిరికి బూడిద బిక్షమయ్య గౌడ్

అందరిలో ఉత్కంఠ రేపిన యాదాద్రి భువనగిరి జిల్లాకు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ పేరు దాదాపుగా ఖరారైందని, ఆయనను అధ్యక్షునిగా ప్రకటించడమే మిగిలి ఉందని అంటున్నారు టిఆర్ఎస్ పార్టీ నేతలు.  కాంగ్రెస్ పార్టీ నుంచి ఆలేరు ఎమ్మెల్యేగా పని చేసిన బూడిద బిక్షమయ్య గౌడ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసి అధ్యక్షునిగా కూడా పని చేశారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలోనే ఆయన టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి ఏదైనా ముఖ్యమై కార్పొరేషన్ పదవిని ఆశించారు. ఈలోగా సంస్థాగత ఎన్నికలు రావడంతో ఆయనకు ముందుగా పార్టీ బాధ్యతలు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ వార్తలను  బలపరుస్తూ బూడిద భిక్షమయ్యగౌడ్ నిన్న రాత్రి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటిఆర్ తో భేటీ అయి మంతనాలు జరిపారు.

సూర్యాపేటకు ఎవరు?

జిల్లాల వారీగా అధ్యక్షులను ఖరారు చేయడంలో ఎమ్మెల్యేలను సమన్వయపరుస్తూ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కీలకపాత్ర పోషించారని చెబుతున్నారు.  కాగా, మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట జిల్లాకు ఎవరిని అధ్యక్షునిగా నియమిస్తారనే విషయంలో కొంత  సస్పెన్స్ కొనసాగుతోంది. నల్లగొండను ఒసిలకు, యాదాద్రి భువనగిరిని బిసిలకు కేటాయిస్తున్నందున సూర్యాపేట జిల్లాను ఎస్ సిలను అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News