బిసిసిఐ కార్యదర్శి పదవిపై సర్వత్రా ఆసక్తి
ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరున్న భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)లో కార్యదర్శి పదవి అత్యంత కీలకమైంది. బిసిసిఐ అధ్యక్షుడి కంటే కార్యదర్శికే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఇప్పటి వరకు బిసిసిఐ కార్యదర్శిగా పదవి బాధ్యతలు నిర్వర్తించిన జైషా ఐసిసి చైర్మన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇటీవలే జైషా ఐసిసి చైర్మన్ బాధ్యతలను చేపట్టారు. దీంతో బిసిసిఐ కార్యదర్శి పదవి ఖాళీ అయ్యింది.
ఈ నేపథ్యంలో జైషా వారసుడిగా ఎవరినీ ఎంపిక చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బిసిసిఐలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ పదవిపై చాలా మంది కన్నేశారు. ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఈ పదవి చేపడు తారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ కథనాలను రోహన్ జైట్లీ కొట్టిపారేశారు. ప్రస్తుతం కార్యదర్శి పదవి రేసులో గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్, బిసిసిఐ సంయుక్త కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా పేర్లు వినిపిస్తున్నాయి.