Sunday, December 22, 2024

శాసనసభాపక్షం నేత ఎవరు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర బిజెపిలో శాసనసభ పక్ష నేత ఎంపిక పార్టీ సీనియర్లకు తలనొప్పిగా మారింది. గత వారం రోజులుగా కుస్తీ పడుతున్న కొలిక్కి రావడంలేదు. ఈపదవికి ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ పడుతుండటంతో ఎవరికి అప్పగించాల్లో అర్దంకాక హైకమాండ్ తర్జనభర్జనలు పడుతుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వరం తనకు అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. ఈసారి ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేగా విజయం సాధించగా అందులో ఆరుగురు మొదటిసారి ఎన్నికయ్యారు. రాజాసింగ్ గోషామహల్ నుంచి మూడుసార్లు, మహేశ్వర్‌రెడ్డి రెండోసారి గెలుపొందారు. ఇద్దరు బిజెపి ఎల్పీనేతపై పట్టువీడటం లేదు.

ఈనెల 9వ తేదీన అసెంబ్లీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం రోజు పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తే మరోసారి శాసనసభ పక్షనేతగా తనకే బాధ్యతలు అప్పగించాలని రాజాసింగ్ పార్టీ సీనియర్లను కోరడంతో వారు ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు చెప్పడంతో ఆయన ఆలకబూని వెంటనే పార్టీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. అదే రోజు గవర్నర్ వద్దకు వెళ్లి ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఎంపికను రద్దు చేయాలని ఫిర్యాదు చేసేందుకు ఆపార్టీ ఎమ్మెల్యేలంతా వెళ్లినా రాజాసింగ్ వారి వెంట వెళ్లలేదు. తనకు ఎల్పీనేత పదవి అప్పగిస్తామని ప్రకటన చేసేవరకు పార్టీవైపు కన్నేత్తిచూడనని పార్టీ నేతలతో చెప్పారు. అయినా హైకమాండ్ ఆయన పేరు ఖరారు చేసేందుకు వెనకడుగు వేస్తుంది.

రాజాసింగ్ అసెంబ్లీ పక్షనేతగా ఉంటే ప్రజా సమస్యలు వివరించలేడని, తెలుగు భాషలో పూర్తిగా మాట్లాడలేడని, హిందీ మాట్లాడితే అధికారులకు అర్థం కాక చాలా సార్లు ఇబ్బందులు పడ్డాల్సిన పరిస్థ్దితి వచ్చిందని పార్టీ సీనియర్లు పేర్కొన్నారు. అదే విధంగా త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్, జహీరాబాద్ స్దానాల్లో నిలబెడితే విజయం సాధించే అవకాశముందని కూడా పరీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి 6 నుంచి 8 పార్లమెంటు స్థ్ధానాల్లో అభ్యర్థుల గెలుపుకోసం ఆయన సేవలు వినియోగించుకోవాలనే ఆలోచన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అదే విధంగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి గతంలో పిఆర్పీ నుంచి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రస్తావించిన సందర్భాలున్నాయని, బాషమీద మంచి పట్టు ఉండటంతో పాటు సమస్యలు సభల్లో వినిపిస్తారని, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ సభ్యులతో స్నేహపూర్వకంగా వ్యవరిస్తారని భావిస్తూ  ఆయనను పార్టీ పక్షనేతగా ఎంపిక చేస్తే అన్ని విధాలుగా బాగుంటుందని పార్టీ సీనియర్లు ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నాలుగు సీట్లు గెలుపొందామని ఈ విజయంలో ఆయన కృషి ఎంతో ఉందని, మరోసారి ఆదిలాబాద్ పార్లమెంటు గెలిస్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. శాసనసభ పక్షనేతతో రాష్ట్రంలో పార్టీ బలోపేతమైతుందని ,అందుకోసం అన్నివిధాలుగా సమర్థ్దులైన వారినే ఎంపిక చేస్తామని ఆపార్టీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. హస్తిన పెద్దలు కూడా పక్షనేత ఎంపికను రెండు మూడు రోజుల్లో తేల్చుతామని రాష్ట్ర నేతలకు చెప్పినట్లు సమాచారం. రాజాసింగ్ అనుచరులు మాత్రం పార్టీ అధ్యక్ష పదవి, శాసనసభ పక్షనేత పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియరైన రాజాసింగ్‌కే కట్టబెట్టాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News