డబ్లుహెచ్‌ఒపై కేంద్రం విమర్శ
న్యూఢిల్లీ : భారతదేశంలో అత్యధికంగానే ఇప్పటికీ కొవిడ్ మరణాలు ఉన్నాయని, ప్రభుత్వం తప్పుడు లెక్కలతో తక్కువగా చూపుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) చేసిన వాదనను ప్రభుత్వం ఖండించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు తప్పులతడకగా ఉన్నాయని, లెక్కింపులో వారు ఎంచుకున్న పద్ధతి సరిగ్గా లేదని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వారి లెక్కలు ఎక్కువగా ఉన్నాయని, దీనితో కరోనా వైరస్‌పై వారి వాదనలో తప్పు ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. తప్పుల తడకల కొలమానాలతో లెక్కలు కడితే ఇటువంటి వైఖరి తలెత్తుతుందని ప్రభుత్వం తెలిపింది. అధికారికంగా తమ వద్ద దేశంలో కొవిడ్ మరణాల లెక్కల జాబితా ఉందని, దీనిని కాదంటూ డబ్లుహెచ్‌ఒ ఎలా ప్రకటన వెలువరిస్తుందని ప్రశ్నించింది. భారత్‌లో కొవిడ్ మరణాల సంఖ్యలతో కూడిన జాబితాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు గ్రాఫ్ రూపంలో వెలువరించింది. దీని మేరకు ఇండియాలో అత్యధికంగా మరణాలు ఉన్నాయి. తరువాత రష్యాలో ఈ వరసలో క్రమంగా ఇండోనేషియా, అమెరికా, బ్రెజిల్ , మెక్సికో, పెరూ , టర్కీ వంటి దేశాలు ఉన్నాయి.
ఢిల్లీలో 25,600 మరణాలు
ఢిల్లీ పరిధిలో తాము ఇచ్చిన కొవిడ్ మరణాల సంఖ్య అధికారికం, అంతకు మించి విశ్వసనీయం అని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక నేపథ్యంలో ప్రకటన వెలువరించారు. లెక్కలను ఢిల్లీ ప్రభుత్వం తప్పుగా చూపిందనే వాదనను ఆయన ఖండించారు. తారుమారు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. తాము వెలువరించిన సంఖ్య నిజమేని, ఇక్కడ కొవిడ్‌తో దాదాపు 25600 మంది మృతి చెందారని తెలిపారు.