న్యూయార్క్: భారత్ బయోటెక్ తయారీ అయిన కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితా(ఇయుఎల్)లో చేర్చే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. దీనికి సంబంధించి కీలక నిర్ణయాన్ని వచ్చే 4, 6 వారాలలో తీసుకుంటారని డబ్లుహెచ్‌ఒ చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ తెలిపారు. కొత్త వ్యాక్సిన్ల వాడకానికి ఇయుఎల్‌లో చేరడం అవసరం. ఆ తరువాతనే అంతర్జాతీయ స్థాయిలో టీకాల వాడకానికి అనుమతి దక్కుతుంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వరాన్‌మెంట్ (సిఎస్‌ఇ) ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన వెబ్‌నార్‌లో సౌమ్య స్వామినాథన్ మాట్లాడారు. టీకా సంబంధిత పూర్తి సమాచారాన్ని భారత్ బయోటెక్ ఇప్పటికే డబ్లుహెచ్‌ఒ పోర్టల్‌లో పొందుపర్చిందని, దీనిని విశ్లేషించుకుంటున్నామని తెలిపారు. ఇయూఎల్‌లో వ్యాక్సిన్‌ను చేర్చేందుకు ఓ ప్రక్రియ నిర్ధేశితంగా ఉంటుంది. తయారీ సంస్థలు టీకాల మూడు దశల ప్రయోగాలను పూర్తి చేయాలని, వాటి ఫలితాల సమాచారాన్నితమ సంస్థకు చెందిన నియంత్రణ విభాగానికి పంపించాల్సి ఉంటుందని సౌమ్య తెలిపారు. తరువాత నిపుణుల కమిటీ ఈ సమాచారాన్ని తగు విధంగా పరిశీలిస్తుంది. డేటా తమకు అందినందున, నిపుణుల కమిటీ పరిశీలన తరువాతనే వాడకపు అనుమతిపై నిర్ణయం వెలువడుతుందని స్పష్టం చేశారు. మొత్తం మీద ఆరు వారాలలో దీనిపై నిర్ణయం ఉంటుందన్నారు. కరోనా అత్యవసర ఆరోగ్య పరిస్థితిని తీసకువచ్చింది.
ఈ దశలో దీనిని నియంత్రించేందుకు పలు దేశాలలో ప్రముఖ కంపెనీలు వివిధ స్థాయిల ట్రయల్స్ తరువాత టీకాలు ఉత్పత్తి చేస్తున్నారు. అయితే అత్యంత కీలకమైన ఇటువంటి వ్యాక్సిన్లను క్రమపద్థతిలో వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా ఇయూఎల్ నిబంధనలను రూపొందించింది. వీటికి అనుగుణంగా ఉంటేనే సంబంధిత వ్యాక్సిన్లకు అనుమతి దక్కుతుంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 5 సంస్థలకు చెందిన కరోనా టీకాలను ఇయూఎల్‌లో చేర్చారు. వీటికి అత్యవసర వినియోగపు అనుమతి దక్కింది. ఈ విధంగా అనుమతి పొందిన వాటిలో బయోఎన్‌టెక్‌కు చెందిన ఫైజర్, ఎస్‌కె బయో/ సీరం ఇనిస్టూట్ ఆఫ్ ఇండియాకు చెందిన అస్ట్రాజెనెకా, జాన్‌స్సీన్, మాడెర్నా, సినోఫార్మ్‌లకు జాబితాలో చోటు దక్కింది. వీటిని పలు దేశాలలో వ్యాక్సినేషన్లలో విరివిగా వాడుతున్నారు. టీకాల భద్రత, వాటి సమర్థత, ప్రతికూలతలు లేని స్థితి ప్రత్యేకించి ఉత్పత్తి ప్రామాణికతలు, ప్రామాణికతలకు సంబంధించి సంబంధిత సంస్థలు వివరాలను తెలియచేయాల్సి ఉంటుంది. భారత్ బయోటెక్ పూర్తిస్థాయిలో వీటికి సంబంధించి పూర్తి డాటాను అందించిందని, ఇక నిర్ణయం బాధ్యత తమపై ఉందని సౌమ్య స్వామినాథన్ తెలిపారు.
WHO to take decision on Covaxin approval