Wednesday, January 8, 2025

అవిశ్వాస పరీక్షలో ఎవరిది పైచేయి?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిబంధనల ప్రకారం అవసరమైన 50 మందికిపైగా ఎంపీల సంతకాలతో కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ అందచేసిన అవిశ్వాసన తీర్మానం నోటీసును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం ఆమోదించారు. మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభలో మాట్లాడాల్సిన పరిస్థితిని కల్పించేందుకే తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని 26 ప్రతిపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమి నిర్ణయించుకున్నట్లు కూటమికి చెందిన సీనియర్ నాయకులు తెలిపారు.

ప్రతిపక్షాలు ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానం సంఖ్యాపరంగా వీగిపోనున్నప్పటికీ మణిపూర్ హింసాకాండపై లోక్‌సభలో చర్చ జరిగి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే అవకాశం ఉందని, ఆ విషయంలో తాము విజయం సాధించినట్లేనని వారు తెలిపారు. మణిపూర్ పరిస్థితిపై చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానమిస్తారని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఈ కీలక సమస్యపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడాల్సిన తప్పనిసరి పరిస్థితిని కల్పించడమే తమ వ్యూహమని ఇండియా కూటమికి చెందిన నాయకులు చెప్పారు.

గతంలో 27 సార్లు అవిశ్వాస తీర్మానాలు ఆమోదం పొందగా ఒక్క ఇందిరా గాంధీనే 15 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు ముగ్గురు ప్రధాన మంత్రులు మాత్రమే అవిశ్వాస తీర్మానంలో ఓటమిపాలై ప్రభుత్వాన్ని కోల్పోయారు.

విశ్వనాథ్ ప్రతాప్ సింగ్(విపి సింగ్):
జనతా దళ్ పార్టీ సభ్యుడైన విపి సింగ్ 1989 నుంచి 1990 వరకు ప్రధానిగా బిజెపి మద్దతుతో నేషనల్ ఫ్రంట్ పేరిట సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు. బిజెపి రామ మందిరం అంశంపై బిజెపి మద్దతును ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అనివార్యమైంది. సంఖ్యాబలం లేకపోవడంతో ప్రభుత్వం కూలిపోయింది.

హెచ్‌డి దేవెగౌడ:
జనతా దళ్ సభ్యుడైన దేవెగౌడ 1996లో కాంగ్రెస్ మద్దతుతో ప్రధానిగా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో దేవెగౌడ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. 1997 ఏప్రిల్ 11న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగగా 158 ఓట్లు మాత్రమే పొంది ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోయింది.

అటల్ బిహారీ వాజ్‌పేయి:
బిజెపి అగ్రనాయకుడైన వాజ్‌పేయి 1996లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రెండుసార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. జయలలిత నాయకత్వంలోని ఎఐఎడిఎంకె మద్దతు ఉపసంహరించుకోవడంతో 1999లో ప్రవేశపెట్టిన మొదటి అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వం ఓటమిపాలైంది. 2003లో రెండవసారి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో వాజూయి ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీతో నెగ్గింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News