చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయన్నది ఆర్యోక్తి. చెట్ల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను అలా ఉంచితే, ప్రాణవాయువును అందించి, మనిషికి జవజీవాలను ప్రసాదిస్తున్నది ఈ వృక్ష సంపదే. నాలుగేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి మృత్యుపాశం విసిరినప్పుడు ప్రాణవాయువు దొరక్క లక్షలాదిమంది కన్నుమూశారు. ఆక్సిజన్ కొరత ఎంత భయానకంగా ఉంటుందో సగటు మనిషికి అప్పుడే పూర్తిగా అవగతమైందనడంలో అతిశయోక్తి లేదు. యాభై సెంటీమీటర్ల వ్యాసం, నలభై మీటర్ల ఎత్తు ఉన్న ఒక వృక్షం సగటున రోజుకు 123 గ్రాములు లేదా 92 లీటర్ల స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తుందన్నది ఒక అంచనా.
ఇందులో ఒక మనిషికి రోజుకు కావలసింది 14 శాతం ప్రాణవాయువు మాత్రమే. దానిని బట్టి భూమండలంపై జీవజాలం మనుగడలో వృక్షాలు ఎంతటి కీలకపాత్ర పోషిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ చెట్ల నరికివేత నిర్నిరోధంగా కొనసాగుతూ ఉండటమే ఆశ్చర్యం గొలిపే విషయం. ఇటీవల వెలుగుచూసిన రెండు ముఖ్యమైన పరిణామాలు మన దేశంలో చెట్ల నరికివేత ఎంత ఉధృతంగా కొనసాగుతోందో కళ్లకు కడుతున్నాయి. దక్షిణ ఢిల్లీ రిడ్జ్ ప్రాంతంలో 11 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం పది రోజుల్లో 640 చెట్లను నరికివేశారన్న వార్త సంచలనం సృష్టించింది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందన్న విషయాన్ని అలా ఉంచితే, ఇంతటి విధ్వంసానికి పాల్పడేందుకు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీకి చేతులెలా వచ్చాయన్నది ప్రశ్న.
ఇక రెండో విషయానికి వస్తే, భారత దేశంలోని అటవీయేతర ప్రాంతాల్లో నాలుగేళ్ల వ్యవధిలో సుమారు 50 లక్షల వృక్షాలు నేలమట్టమయ్యాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. కోపెన్ హాగన్ యూనివర్శిటీ పరిశోధకుల బృందం ఎన్నో కష్టనష్టాలకోర్చి నిర్వహించిన సర్వేలో తేలిన వాస్తవమిది. పంటపొలాల్లో ఉండే భారీ వృక్షాలను తమ సాగుకు అడ్డం వస్తున్నాయనే నెపంతో రైతులే తొలగిస్తున్నారనేది కలవరం కలిగించే అంశమే. ఇలా 2018- 2022 మధ్యకాలంలో వృక్షహననం సాగిందనేది ఈ సర్వే సారాంశం. చేల గట్లపై ఉన్న 60 కోట్లకు పైగా చెట్లను 2010లో మ్యాపింగ్ చేసి, 2018లో లెక్కిస్తే, వాటిలో 11 శాతం వృక్షాలు మాయమయ్యాయట. భూతాపం పెరిగిపోవడానికి ప్రధాన కారణాల్లో చెట్ల నరికివేత ఒకటని పర్యావరణవేత్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా వినేవారు కరవయ్యారు. నగరీకరణ పేరిట అడ్డొచ్చిన చెట్టునల్లా నరుక్కుంటూపోవడం, ప్రభుత్వాలు చోద్యం చూస్తూ ఊరుకోవడం సహజ ప్రవృత్తిగా మారింది.
భాగ్య నగరం రానురాను నిప్పుల కుంపటిలా మారడానికి చెట్ల నరికివేతే కారణమని హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ గతంలోనే హెచ్చరించింది. అటవీ ప్రాంతాల్లో చెట్ల నరికివేతను నిరోధిస్తూ అటవీ పరిరక్షణ చట్టం రూపొందినా, ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనందున ఈ చట్టం నామమాత్రంగా మారుతోంది. చెట్ల నరికివేతను అడ్డుకోలేని ప్రభుత్వాలు సామాజిక వనాల పెంపకాన్ని మాత్రం ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఇది భారీ వృక్షాలకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు సరికదా ఎదిగిన చెట్లను నరికి మళ్లీ మొక్కల పెంపకం చేపట్టడం వల్ల వృక్షజాతుల వైవిధ్యం కూడా తగ్గిపోతుంది. మొక్కలు నాటే క్రమంలో ఆ ప్రాంతంలోని సహజ జీవావరణానికి ప్రాధాన్యం ఇవ్వట్లేదంటూ పర్యావరణవేత్తలు చేస్తున్న ఆందోళనలో అర్థం ఉంది. మన దేశంలో రోడ్లు వేయడం, వేసినవాటిని వెడల్పు చేయడం అనే బృహత్తర కార్యక్రమంలో భాగంగానే అత్యధికంగా చెట్లను నరికివేస్తున్నారు. చెట్లను కొట్టేయకుండా పనులు చేపట్టేందుకు ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ చెట్లను కొట్టడం సులభం కాబట్టి ప్రభుత్వాలు కూడా కిమ్మనడం లేదు.
రోడ్లు, ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు ఇంజనీరింగ్ నిపుణుల సహాయ సహకారాలతో సదరు పనులు పూర్తి చేసే పాలకులు, చెట్లను తొలగించేటప్పుడు పర్యావరణవేత్తలకు మాటమాత్రం చెప్పకుండా స్వీయ నిర్ణయం తీసుకుంటున్నారు. గతంలో సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్ ఒక చెట్టు వయసును బట్టి ఒక సంవత్సరానికి దాని విలువను రూ. 74,500 గా అంచనా కట్టింది. అలా చూస్తే వందేళ్ల వయసున్న చెట్టు విలువ 75 లక్షల రూపాయలకు పైనే ఉంటుంది. మానవ శరీరంలాగే చెట్టు కూడా ఎంతో విలువైనదనే స్పృహ సగటు మనిషిలో పెరగాలి. పాలకులు చెట్ల ప్రాముఖ్యతను గుర్తెరిగి పాలన సాగించాలి. అప్పుడే ఈ వృక్షహననం ఆగేదీ, ప్రపంచమంతటా పచ్చదనం పరిఢవిల్లేదీనూ!