Saturday, November 23, 2024

హుజూరాబాద్ గడ్డపై ఏ జెండా ఎగిరేను?

- Advertisement -
- Advertisement -

Who will win in Huzurabad byelection

 

హుజూరాబాద్ నియోజకవర్గం కరీంగనగర్ జిల్లాలో వుంది. ఇందులో 2,26,182 మంది ఓటర్లు ఉన్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీతో పాటు జమ్మికుంట, వీణవంక, కలమలాపూర్, ఇల్లందు కుంట మండలాలున్నాయి. 1957 నుండి 2018 వరకు ఈ నియోజకవర్గానికి 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 4 సార్లు, ఇండిపెండెంట్లు 3 సార్లు, తెలుగుదేశం పార్టీ 3 సార్లు, టిఆర్‌ఎస్ 6 సార్లు గెలిచాయి. టిఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో గెలుస్తూ మంచి పటు ్టసాధించుకుంది. ఈ పార్టీ తరపున ఈటెల రాజేంద్ర 6 సార్లు గెలిచారు.నియోజకవర్గంలో 64 శాతానికిపైగా వెనుకబడిన వర్గా లు, 20 శాతానికిపైగా షెడ్యూల్డ్ కులాల వారు ఉన్నారు. బిసిల తర్వాత షెడ్యూల్డ్ కులాలవారే ఎక్కువగా ఉన్నారు. వీరి జనాభా 35 వేలకుపైగా ఉంది. వెనుకబడిన వర్గాల్లో మున్నూరు కాపులు, పద్మశాలీలు, గౌడలు, ముదిరాజ్, గొల్ల కులాలు అత్యధికంగా ఉన్నారు. రెడ్లు కూడా 23 వేలకుపైగా ఉన్నారు. మహిళలు పురుషుల కన్నా స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. 2018లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డిపై 43 వేల ఓట్లుకుపైగా ఆధిక్యత సాధించారు. భారతీయ జనతాపార్టీ అభ్యర్థికి కేవలం 1,683 అనగా 1.009 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇవి నోటా కంటే తక్కువ.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని 101, 104, 105 పోలింగ్ స్టేషన్లలో మాత్రమే కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యత కనబరిచింది. ఏది ఏమైనా గతచాలా కాలంగా ఇది టిఆర్‌ఎస్ కంచుకోటగా వుంది. మరి ఈ ఉపఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు? ఎవరు జెండా ఎగురవేస్తారో..! మొదట బిజెపి పరిస్థితుల్ని చూద్దాం. గతంలో ఎప్పుడూ ఈ పార్టీ ఇక్కడి నుంచి గెలవలేదు. కాకుంటే బిజెపి తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నుండి 90 వేల ఓట్లకుపైగా మెజారిటీతో టిఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను ఓడించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో కూడా బిజెపికి 27 వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం హుజూరాబాద్‌కు కూడా బండి సంజయ్ పార్లమెంటు పరిధిలోదే. ఎలాగైనా ఈ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న పట్టుదలతో వ్యూహాల్ని రచిస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుండి కూడా సంజయ్ ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమాలతో హడావుడిగా వుంటున్నారు.

కేంద్రాన్ని ఎవరు పల్తెత్తు మాట విమర్శించినా అంతెత్తున కాలుదువ్వుతుంటారు. మంచి వక్త. కార్యకర్తల్ని రెచ్చగొట్టడంలో అందెవేసిన చేయి. టిఆర్‌ఎస్ నుండి ఈటెలను వెలివేయగానే పక్కా వ్యూహంతో తమ పార్టీ గూటికి రప్పించి కాషాయ కండువా కప్పేసిన చాణక్యుడు సంజయ్. కాంగ్రెస్‌లో చేరుతాడని అప్పటిదాకా వున్న ఊహాగానాలకు తెరదించేశారు. ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 2 వరకు హైద్రాబాద్ నుంచి హుజూరాబాద్‌కు పాదయాత్ర ప్రకటించి అందరికన్నా ముందే సంచలనం రేపారు. 55 రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర 750 కిలోమీటర్ల దూరం వుంటుంది. ఈ యాత్ర జయప్రదం కావడానికి ఎక్కడికక్కడ స్థానిక కమిటీల్ని ప్రకటించారు. తొలి విడతలో 6 జిల్లాలు, మలి విడతలో 4 ఉమ్మడి జిల్లాల్ని ఈయన కవర్ చేయబోతున్నారు. అదేవిధంగా ఈటెల రాజేంద్ర చేత కూడా ప్రజా ఆశీర్వాద పాదయాత్ర పేరున జులై 19న పాయయాత్ర ఆరంభించేశారు. ప్రచారపర్వంలో బిజెపి ముందంజలోనే వుందని చెప్పవచ్చు.ఈటెల రాజేంద్ర వ్యక్తిత్వానికీ ఇది అగ్నిపరీక్షలాంటిది. గతంలో కారు ఎక్కి, అపజయం అన్నది ఎరుగక గెలుస్తున్నారు.

చాలాకాలం టిఆర్‌ఎస్‌లో చక్రం తిప్పుతూ వచ్చారు. ఒకసారి ముఖ్యమంత్రి ప్రోగ్రాంకు వెళ్తూ ఈటెల ఇంటికి స్వయంగా వెళ్లి ఈటెలను తన కారులో ఎక్కించుకుని వెళ్లారంటే ఆయన ఎంతగా వెలిగారో అర్థం చేసుకోవచ్చు. మరిప్పుడు ఈటెల రాజేంద్ర పరిస్థితి ఏమవుతుందో? నెగ్గుతారో లేదో? వెనుకబడిన ముదిరాజ్‌లకు చెందిన తన కులంవారి 24 వేల ఓట్లు గంపగుత్తుగా తనకు పడతాయా! భూకబ్జా ఆరోపణల్ని ఎదుర్కొంటున్న ఈటెల రాజేంద్రను హూజూరాబాద్ ఓటర్లు క్షమిస్తారా? దెబ్బతీస్తారా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితాలు ఆయన్ని దోషిగా చూపి ఓడిస్తే ఈటెల భవిష్యత్తు ఏమిటి? ఇప్పుడు ఆనాడు తనవెంట నడిచిన టిఆర్‌ఎస్ కార్యకర్తలు అందరూ ఓట్లు వేస్తారా? పార్టీ అభ్యర్థికి పట్టం కడుతారా! ఈటెల ఆర్థికంగా బాగానే ఉన్నారు. ఈటెల ఈనెల 14న ఢిల్ల్లీ వెళ్లి అమిత్‌షాను కలిసి ప్రచారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.ఎన్నికల తేదీ ప్రకటించాక బిజెపిలోని హేమాహేమీలంతా ప్రచారానికి రావచ్చు.ఇక్కడే తిష్టవేయచ్చు.

కాంగ్రెస్ పార్టీకైతే విజయ మార్గాలు చాలా తక్కువే. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎదురుదెబ్బలు, ఓటములే. తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్ వారంతా దాదాపు అధికార టిఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నవారు మాత్రం ఇంకా అందులో కొనసాగుతున్నారు. అధిష్టానం చిట్టచివరికి మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు, యువకుడు అయిన రేవంత్ రెడ్డిని తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్‌గా నియమించారు. అంతకు ముందున్న ప్రెసిడెంట్ ఉత్తం కుమార్ రెడ్డి కూడా పార్లమెంటు సభ్యులే.ఈ నెల 7న పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి హుజూరాబాద్ ఎన్నిక నిజంగా ఓ సవాలే అని చెప్పవచ్చు. రేవంత్ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని సర్వశక్తులూ వొడ్డి పథకాల్ని రూపొందించుకుంటున్నారు.

ఇటీవల పార్టీకి దూరంగా ఉంటున్న కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తున్నారు. చివరికి తనును తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ వచ్చిన వి.హనుమంతరావును కూడా హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. కొంతమంది ఇతర పార్టీల్లోని నాయకుల్ని కూడా కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ పిపిసి ప్రెసిడెంట్, ప్రస్తుత టిఆర్‌ఎస్ పార్లమెంటు సభ్యుడైన డి.శ్రీనివాస్ కుమారుడు సంజయ్‌ను, బిజెపిలో ఉన్న మాజీ శాసన సభ్యులు ఎర్రశేఖర్‌ను, మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి మొదలగువారిని కూడా కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి తెలుగుదేశం పార్టీకి చెందిన దేవేందర్ గౌడ్ కుటుంబాన్ని కూడా కలిసి ఆయన కుమారుల్ని పార్టీలోకి ఆహ్వానించారు. కెసిఆర్‌పై దూషణల పర్వం కూడా పెంచారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం ఎన్నికల కన్వీనర్‌గా దామోదర రాజనర్సింహను నియమించారు.ఇంకా ఎంఎల్‌సి జీవన్ రెడ్డిని, ఎంఎల్‌ఎ శ్రీధర్ బాబును, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ను ఇన్‌ఛార్జిలుగానూ, ప్రతి మండలానికి ఓ ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నాయకుల్ని ఇన్‌ఛార్జీలుగా నియమించి ఎన్నికల్లో గెలుపు కోసం పావులు కదుపుతున్నారు.

రేవంత్‌కు హుజూరాబాద్ నియోజకవర్గంలోని తన కులంవారు కొంత తోడ్పడవచ్చు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా ఉందని చూపించేందుకు ఈనెల 16న ఛలో రాజ్‌భవన్ పిలుపునిచ్చి పోరాటాలకు బీజం నాటారు. పెగాసస్‌పై అధిష్టానం పిలుపు మేరకు ఈనెల 22న మరోసారి ఛలో రాజ్‌భవన్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఇందిరా పార్కు దగ్గర భారీ ఎత్తున జన సమీకరణ చేసి ధర్నా నిర్వహించారు. ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో తను కూడా పాదయాత్ర చేసే ప్రయత్నంలో వున్నారు. మరి హుజూరాబాద్ బరిలో నిలిచి 2018లో మంచి ఓట్లు సాధించిన కౌశిక్ రెడ్డి హస్తాన్ని వదిలేసి కారెక్కారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే ఎన్నికల సన్నాహాల్ని పూర్తిచేకుకొని కాలుదువ్వుతున్నది. కెసిఆర్ అన్ని విధాలా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. అభ్యర్థి ఇంకా ఖరారు కావాల్సివుంది. పార్టీలో నాయకులకు కొదవలేదు.

కెసిఆర్, హరీష్ ఇద్దరూ ఎన్నికల రంగంలో సింహాల్లా పోరాడగలరు. ఎదుటివాళ్లు ఎన్ని విమర్శలు చేసినా తిప్పికొట్టే ఇది వీళ్లకుంది. ఇతర పార్టీల్లోని బలమైన నాయకుల్ని కూడా కెసిఆర్ తన పార్టీలోకి లాగేసుకుంటున్నారు. అసలు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన రమణనే లాగేసుకున్నారు. రమణ చేనేత వర్గానికి చెందిన బిసి కులస్థుడు. కొద్దోగొప్పో ఆయన ప్రభావం కూడా టిఆర్‌ఎస్ గెలుపునకు దోహదపడుతుంది. కాంగ్రెస్ నేత కౌసిక్ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడం ఆ పార్టీ విజయానికి చాలా దోహదం చేస్తుంది. ఇక నియోజకవర్గంలోని దళితుల్ని ప్రభావితం చేసేందుకు కెసిఆర్ ‘దళిత బంధు’ పథకాన్ని కొత్త గా పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజవకర్గాన్నే ఎంపిక చేయడం జరిగింది. 10 లక్షల నిధి ప్రతి దళిత కుటుంబాన్ని కచ్చితంగా ఆకర్షిస్తుంది. కౌశిక్ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరే సందర్భంగా కెసిఆర్ ప్రసంగించిన తీరు అద్భుతం. జనాల్లో సెంటిమెంట్స్‌ను రెచ్చగొట్టే భావోద్వేగ ప్రసంగం అది. దుబ్బాక ఓటమి తరువాత తెలంగాణ శ్రేణులు జాగరూకతతోనే వుంటారు. తెలంగాణ భావాలు, కెసిఆర్‌పై ఉన్న అభిమానం ఇంకా జన హృదయాల్లో దాగేవుంది.

ఇప్పటి వరకు కెసిఆర్‌పై పెద్దగా ప్రజావ్యతిరేకత అయితే కనబడలేదు. ఏ కొంత వ్యతిరేకత ఉన్నా దానిని ఎగరేసుకుపోవడానికి బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతున్నాయి. చెరిసగం పంచుకుంటాయి. ఎన్నికల క్షేత్రంలో ముక్కోణపు పోటీలో టిఆర్‌ఎస్‌కే ఎక్కువ విజయవకాశాలు కన్పిస్తున్నాయి. గ్రీన్ కాన్పెప్ట్‌తో ఎంపి సంతోష్ కుమార్ కూడా చాలా పాపులర్ అవుతున్నారు. ఆయనకొస్తున్న అభిమానం కూడా టిఆర్‌ఎస్ ఖాతాలోకే వెళ్తుంది. బిజెపి, కాంగ్రెస్ పోటీ అంతా ద్వితీయ స్థానం కోసమేనని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. సెకెండ్ వేవ్ కరోనాలో బిజెపి పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. పెట్రోలు, గ్యాస్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయి. కెటిఆర్ అన్ని సమావేశాల్లో మోడీ ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని, తెలంగాణకు ద్రోహం చేస్తున్నదని ఘాటుగా విమర్శిస్తున్నారు. ఆ భావం జనాల్లో బిజెపిపై వ్యతిరేకతను కలిగిస్తుంది. సామాన్యంగా ఉప ఎన్నికల్లో జనాలు అధికార పార్టీనే ఎక్కువగా బలపరుస్తుంటారు.

కెసిఆర్‌పై ప్రజల్లో ద్వేషం, కోపం పెరిగితే తప్ప అధికార పార్టీనే గెలిపిస్తుంటారు. దుబ్బాక ఏమరుపాటులోని ఓటమి కెసిఆర్‌ని నిద్రలేపింది. కొంతకాలంగా చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కెసిఆర్ కరోనా ఉధృతంగా ఉన్న టైంలో గాంధీ ఉస్మానియా హాస్పిటల్స్, వరంగల్ హాస్పిటిల్స్‌ని సందర్శించడం అక్కడ పేషెంట్స్‌ని పరామర్శించడం అందరి అభిమానాన్ని చూరగొంది.డాక్టర్లే భయపడుతున్న కాలంలో కెసిఆర్ అంత ధైర్యం గా ఆస్పత్రులకు వెళ్లడం ఆయన ఇమేజ్‌ను జనాల్ని చాలా పెంచేసింది. ఈ మధ్య వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తూ ప్రజలకు మరింత చేరువవుతూ వారి అభిమానాన్ని అందుకుంటున్నారు. ఎప్పటికప్పుడు క్తొతకొత్త పథకాలు, వినూత్న ఆలోచనలు కెసిఆర్‌కు అలవాటే.రైతుబంధు లాంటి అనేక పథకాలు తెలంగాణ ప్రకటలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

ప్రముఖ దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు ఇతర పార్టీల్లోని ఇంకా చాలామంది నాయకులు కారు ఎక్కేలావున్నారు. నిరాటంకంగా కొనసాగుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు హుజూరాబాద్‌లో కారును గెలిపించవచ్చు. ఎన్నికలపుడు కెసిఆర్ హుజూరాబాద్‌లో పెద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. గతంలోలాగా మరోసారి వాగ్ధాటితో ఓటర్లను మంత్రముగ్ధులను చేస్తారు. ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా, ఉత్కంఠభరితంగా సాగుతాయి. వివిధ కోణాల్లో పరిశీలిస్తే చివరి విజయం కారుకే దక్కేలావుంది. ఈటెలో, రేవంతో ఎవరు ఎక్కువ అనేది ఎన్నికల్లో తేలుతుంది. టిఆర్‌ఎస్ శ్రేణులు అప్రమత్తంగా వుండకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మూడు పార్టీల మధ్య ముచ్చటైన పోరు సాగుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News