04 రాష్ట్ర జనాభాలో 90శాతం మంది
బిసి,ఎస్‌సి,ఎస్‌టిలే మొత్తం జనాభాలో
సగానికిపైగా బిసిలు దేశవ్యాప్తంగా
కులగణన చేపట్టాలి దేశాభివృద్ధి
నమూనాలకు కులగణనే ప్రాతిపదిక
కావాలి లోక్‌సభలో రాహుల్
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా కులగణన ఎందుకు చేపట్టడం లేదని, దేశ జనాభాలో 90 శాతం బిసి, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిపిన కులగణనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయని రాహుల్‌గాంధీ తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2025,-26పై చర్చ సందర్భంగా సోమవారం లోక్‌సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ కులగణనతోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
దేశంలో కులగణన ఎందుకు చేయడం లేదని, దేశంలో సగానికి పైగా మంది బిసిలే ఉన్నారని ఆయన అన్నారు. దేశ అభివృద్ధి కోసం కొత్త నమూనాలు ఏదీ తీసుకువచ్చినా అది కులగణన ఫలితాలతోనే సాధ్యం అవుతాయని ఆయన పేర్కొన్నారు. బిజెపిలో బిసి, ఎస్సీ ఎస్టీ, ఓబిసి ఎంపిలు దేశ జనాభాలో 50 శాతం ఉన్నా వారికి అధికారం లేదని ఈ విషయాన్ని వారు గుర్తు పెట్టుకోవాలని రాహుల్‌గాంధీ సూచించారు. మీరు అధికార పక్షంలో కూర్చున్నా, మీరు కనీసం నోరు మెదపని పరిస్థితి ఉందని, ఇది దేశంలో జరుగుతున్న నిజమని రాహుల్ చెప్పారు.
నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లేదు
దేశంలోని నిరుద్యోగ సమస్యకు బిజెపి ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపించలేకపోయాయని రాహుల్ గాంధీ అన్నారు. ఉత్పత్తి ఆధారిత దేశంలో మనం విఫలమై దానిని చైనాకు అప్పగించామని, ఇకనైనా ఉత్పత్తిపైనే పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. రాష్ట్రపతి ప్రసంగంలో కొత్త విషయాలు ఏమీ లేవని మేకిన్ ఇండియా వల్ల దేశంలో ఎలాంటిమార్పు రాలేదని రాహుల్ పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు ఇక్కడే తయారవుతున్నా అవి మేడిన్ ఇండియా కాదన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య వెంటాడుతోందని ఆయన తెలిపారు.