Monday, December 23, 2024

కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు చేయాలి?

- Advertisement -
- Advertisement -

నిత్యం ప్రతి ఇంట్లో దేవుని చెంత దీపారాధన చేయడం పరిపాటే. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం వల్ల కోటి రెట్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాల సారాంశం. శైవ, వైష్ణవ తారతమ్యాలు లేకుండా ఏ ఆలయంలోనైనా ప్రతి నిత్యం ఉదయం లేదా సాయంత్రం (కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి  పౌర్ణమి వంటి పర్వదినాల్లో సమయం లేదు) ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం శ్రేష్ఠం. కొబ్బరినూనెతో కూడా దీపాలు వెలిగించవచ్చు. అయితే ఆవునెయ్యి, నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల సర్వ పాపాలు తొలగి, పుణ్యగతులు సిద్ధిస్తాయని నమ్మకం. మట్టి ప్రమిదలు, ఉసిరికాయలలో రెండు వత్తులు వేసి వెలిగిస్తే పుణ్యఫలం రెట్టింపు ఉంటుంది.

ఇక  క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసిమొక్క (బృందావనం) వద్ద సాయంత్రం వేళ దీపాలు వెలిగించి పూజలు చేసి నివేదనలు సమర్పిస్తారు. ఇది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం. శివవిష్ణువులను పూజించే ఏకైక మాసం కార్తీకం. అంత ప్రశస్తమైన ఈ మాసంలో నాగుల చవితి,  సోమవారాలు, శుక్ల ఏకాదశి, పౌర్ణమి రోజున ఉపవాసదీక్షలు ఉండి దీపాలు వెలిగిస్తే ఉత్తమ గతులు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

కార్తీక మాసమంతా ఆలయాల్లో సాయంత్రం వేళ నక్షత్రం మాలలు పేరుతో దీపోత్సవాలు నిర్వహిస్తుంటారు. సూర్యోదయం కంటే ముందే మేల్కొని స్నానాదికాలు పూర్తి చేసి నదులు, చెరువులు, ఆలయాలు, లేదా ఇళ్లలో దీపాలు వెలిగించడం పరిపాటి. పౌర్ణమి రోజు అయితే 365 వత్తులు (ఒకే కట్ట) వెలిగిస్తారు. దీనిని సాధారణంగా కొబ్బరిచిప్పలో ఆవునేతితో వెలిగిస్తారు. ప్రతిరోజూ దీపం వెలిగించనివారు ఇలా ఒకేసారి 365 వత్తులు వెలిగిస్తే దైవానుగ్రహం కలుగుతుందని చెబుతారు.

ఇక దీపదానం కూడా సత్ఫలితాలనిస్తుంది. ఉసిరి, మట్టి ప్రమిదలు ఇలా ఎవరి తాహతును బట్టి వారు దీపాలు వెలిగించి దానం ఇవ్వవచ్చు. ఇలా నెలంతా గడిచిన తరువాత అమావాస్య మర్నాడు పోలిస్వర్గం అంటారు. ఆరోజు ఉదయం స్నానాదులు ముగించి దీపాలు నదులు, లేదా చెరువులు, కాల్వలలో విడిచిపెట్టడంతో కార్తీక మాసం ముగుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News