తేలిగ్గా గన్స్ రైఫిల్స్ కొనొచ్చు వాడొచ్చు
న్యూయార్క్ : అమెరికాలో ఎందుకు విచ్చలవిడిగా గన్స్ రైఫిల్స్ ప్రవేశిస్తున్నాయి? ప్రతి ఒక్కరూ వీటిని తేలిగ్గా ఏ విధంగా దక్కించుకోగల్గుతున్నారు? అనే ప్రశ్నలు తిరిగి ఇప్పుడు తలెత్తాయి. అమెరికా రాజ్యాంగంలోని చట్టాల మేరకు ప్రతి పౌరుడు ఆయుధాన్ని పొంది , దానిని వాడుకునే కనీస హక్కు సంతరించుకుని ఉన్నారు. బిల్ ఆఫ్ రైట్స్‌లో 1791లోనే ఇది ఆమోదం పొంది. పౌరులు తమ ఆత్మరక్షణకు మారణాయుధాలను సంతరించుకుని ఉండొచ్చునని ఇందులో చట్టపరమైన తప్పిదం ఏదీ లేదని ఈ విధంగా నిర్ధేశించారు. 200 ఏళ్లు దాటినా దేశంలో శాంతిభద్రతల పరిస్థితి చాలా మెరుగుపడ్డా, ఆత్మరక్షణకు గన్ పొందాల్సిన అవసరం అత్యవసరం కాని స్థితి ఏర్పడ్డా, పాత చట్టం పదిలంగా ఉంది. ప్రాధమిక ఆలోచన విధానంలో మార్పు తలెత్తలేదు.దేశంలో అత్యంత శక్తివంతమైన సంపన్న వర్గం ఒకటి లాబీగా ఏర్పడి గన్స్ అవసరం అని, దీనిని తేలిగ్గా పొందే వీలు కలిగి ఉండాల్సిందేనని, ఆత్మరక్షణకు ఇది అత్యవసరం అని వాదిస్తూ వచ్చింది. దీని ముందు ఇతరుల మాటలు గాలిలో కలిశాయి. ఇక్కడి గన్ సంస్కృతికి తరాల మూలాలు ఉన్నాయి.
బ్రిటిష్ కాలనీలుగా ఉన్న దశలో జరిగిన స్వాతంత్ర పోరాటం లేదా , విప్లవపోరు నాటి నుంచి ఈ విధమైన తుపాకీ విధానం సంతరించుకుంది. అప్పటి పోరులో అత్యధికంగా స్థానిక పౌరులతో కూడిన దళాలతో గెరిల్లా యుద్ధంగా సాగింది. వారు తమ అవసరాలకు ఎటువంటి నిబంధనలు లేకుండా మారణాయుధాలు పొంది వాటిని ధరించి తిరగడం పరిపాటి అయింది. ఇది చివరికి అమెరికా స్వాతంత్రం తరువాత రాజ్యాంగంలో గన్ రైట్‌గా మారింది. నిర్మానుష్యత ఎక్కువగా ఉండే అమెరికాలో పాడి వ్యవసాయాలపై ఆధారపడి ఉండే కుటుంబాలు తమను తాము రక్షించుకునేందుకు గన్స్ వాడుతున్నాయి. భూ వివాదాలు నల్ల తెల్లజాతీయుల మధ్య ఘర్షణలు వారిలోని అభద్రతా భావం వంటివి గన్ కల్చర్‌ను పెంచి పోషించాయి. అయితే వీటి వినియోగం అత్యవసరం అయినప్పుడు ఘర్షణల దశల్లోనే జరుగుతూ వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు సామూహిక మారణకాండకు దారితీస్తూ ఉన్మాదానికి ప్రతీక అవుతున్నాయి.
గన్ లాబీ ఆధిపత్యాలు..పార్టీలకు నిధులు
దేశంలో ఇప్పుడు గన్‌లాబీ ఆధిపత్యం తీవ్రస్థాయికి చేరుకుంది. బ్రిటిష్ వారి ముప్పు తప్పిన తరువాత స్వేచ్ఛ పొందిన దశలో అమెరికా స్థానికులు వలస వచ్చిన వారు కలిసి జీవించే పరిస్థితి ఉన్నప్పుడు ఈ గన్స్ ఎందుకు అనే ప్రశ్న తలెత్తినా ప్రయోజనం లేకుండా పోయింది. టెక్సాస్‌లో ఇప్పుడు టీనేజర్ తుపాకీతో లోపలికి చొరబడి కాల్పులకు దిగాడు. ఓ సూపర్ మార్కెట్‌లో కాల్పులు జరిగిన ఘటనలు వంటివి జరిగిన తరువాత దర్యాప్తు క్రమంలో వారు తుపాకులు ఎంత తేలిగ్గా సంపాదించుకున్నారనేది తేటతెల్లం అయింది. ఓ దుకాణంలోకి వెళ్లి తమకు కావల్సిన గన్స్, రైఫిల్సు, పేలుడు పదార్థాలు , దాడి సామాగ్రిలు దండిగా పొందుతున్నారని స్పష్టం అయింది. నిమిషాలలోనే ముగించే తంతుతో ఆయుధాలు దక్కుతున్నాయి. సరైన నిర్థారణ లేకుండానే గన్స్ సమీకరణలు జరిగినట్లు తేటతెల్లం అయింది. దేశంలో ఏర్పడ్డ గన్‌లాబీ చివరికి అధ్యక్ష ఎన్నికలలో పార్టీలకు నిధుల చేరవేతకు దిగుతున్నాయి. 2020 ఎన్నికలలో అత్యధికంగా రిపబ్లికన్లు ఈ లాబీ నుంచి సాయం పొందినట్లు వెల్లడైంది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ నేరుగా రాజకీయ నాయకులకు పార్టీలకు 61,6000 డాలర్లను సమకూర్చింది. వీటిలో 98 శాతానికి పైగా రిపబ్లికన్లకే అందినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ తెలిపింది.