ఎన్‌జిటికి సుప్రీంకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: ప్రజాప్రతినిధులు దాఖలు చేస్తున్న లేఖలను పిటిషన్లుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జిటి) ఎందుకు స్వీకరించవలసి వస్తోందో తమకు అర్థం కావడం లేదని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. న్యాయస్థానాలకు వెళ్లలేని వారి కోసమే ఎన్‌జిటి అందుబాటులో ఉంటుందని తాము ఇప్పటివరకు భావిస్తున్నామని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్‌కు చెందిన న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ హిమా కోహ్లి తెలిపారు. పార్లమెంట్ సభ్యుల నుంచి కూడా లేఖలను ఎన్‌జిటి విచారణకు స్వీకరించడం ఏమిటని బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
పేదలకు, కోర్టులకు వెళ్లలేని వారి కోసమే ఎన్‌జిటి న్యాయపరిధి ఉంటుందని తాము భావిస్తున్నామని, సామాన్య ప్రజలకే తప్ప పార్లమెంట్ సభ్యుల కోసం ఎన్‌జిటి పనిచేస్తుందని తాము అనుకోలేదని బెంచ్ వ్యాఖ్యానించింది. విశాఖపట్నంలోని రుషికొండ హిల్స్‌పై నిర్మాణ పనులను నిలిపివేస్తూ ఎన్‌జిటి జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. రుషికొండ ప్రాజెక్టు కోసం సిఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ నరసాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌జిటి గతంలో స్టే ఉత్తర్వులు ఇచ్చింది.