Friday, November 15, 2024

‘కులగణన’ మాటెత్తితే భయపడుతున్న మోడీ : రాహుల్

- Advertisement -
- Advertisement -

జైపూర్ : దేశంలో కులగణన పేరెత్తితే ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు భయపడుతున్నారు? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.రాజస్థాన్ లోని జైపూర్‌లో శనివారం పార్టీ కార్యకర్తల సదస్సులో రాహుల్ మాట్లాడారు. ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి పిలుపు నిచ్చారని, కానీ దానికి బదులుగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఉభయసభల్లో ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. “ మొదట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి వాళ్లు మాట్లాడలేదు. ఇండియా వెర్సస్ భారత్ వివాదంపై చర్చించేందుకు ప్రత్యేక సదస్సు అని ప్రకటించారు. ప్రజలు ఈ అంశాన్ని ఏమాత్రం ఇష్టపడకపోవడం, అప్పటికే పార్లమెంట్ ప్రత్యేక సదస్సు గురించి ప్రకటించడంతో వాళ్లకు ఏం చేయాల్లో పాలుపోలేదు.

దాంతో మహిళా రిజర్వేషన్ బిల్లును తెరపైకి తెచ్చారు. బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. కానీ ఈ రిజర్వేషన్ బిల్లు కార్యరూపం దాల్చాలంటే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన అవసరమని బీజేపీ అంటోంది. తద్వారా కనీసం 10 ఏళ్లపాటు రిజర్వేషన్ల అమలును జాప్యం చేయాలనుకుంటోంది. తక్షణం రిజర్వేషన్లను అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఓబీసీ మహిళలకు కూడా లబ్ధి చేకూరాలని కోరుతున్నాం” అని రాహుల్ తెలిపారు. ఓబీసీల పట్ల తమకు గౌరవం ఉందని ప్రతిరోజూ మాట్లాడే ప్రధాని కులగణన పేరెత్తితే ఎందుకు భయపడుతున్నారని రాహుల్ ప్రశ్నించారు. ఈసారి జనాభా సేకరణ కులం ఆధారంగా చేపట్టాలని, ఓబీసీలను అవమానపర్చవద్దని , వారిని మోసగించవద్దని రాహుల్ సూచించారు. పార్లమెంట్‌లో తాను కులగణన అంశాన్ని ప్రస్తావించినప్పుడు బీజేపీ ఎంపీలు తన గొంతు వినపడకుండా చేయాలనే ప్రయత్నం చేశారని విమర్శించారు.

కొత్త పార్లమెంట్ భవన శంకుస్థాపనకు అప్పటి రాష్ట్రపతి కోవింద్‌ను పిలవలేదు : ఖర్గే
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఆనాడు నూతన పార్లమెంట్ భవన శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి రాష్ట్రపతి కోవింద్‌ను ఆహ్వానించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ విమర్శించారు. అంటరానితనం వల్లనే ఆయనను పిలవలేదని ఆరోపించారు. అదే విధంగా కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును పిలవలేదని, నటులు, ఇతర ప్రముఖులను అందర్నీ ఆహ్వానించి ఆమెను ఆహ్వానించకపోవడం , ఇది రాష్ట్రపతికి తీరని అవమానంగా ఖర్గే ఆరోపించారు. విపక్షాలన్నీ కలిసి ఇండియా బ్లాక్‌గా ఏర్పడడంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చారే తప్ప అమలు కోసం కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మోడీ నలుగురు అభ్యర్థులను ముందుకు తీసుకువచ్చారని వీరిలో బీజేపీ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), ఇంకమ్‌టాక్స్ డిపార్టుమెంట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నుంచి ఒక్కొక్క అభ్యర్థిని తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News