Monday, December 23, 2024

అన్నం పెట్టే రైతన్నలపై కాంగ్రెస్‌కు ఎందుకింత కక్ష…?

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్ముతోందని, రైతులపై మీకు ఎందుకింత వివక్ష అని జగిత్యాల జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ దావ వసంత ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, కేవలం 3 గంటలు ఇస్తే సరిపోతుందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం జగిత్యాల ఆర్‌డిఓ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్‌పి చైర్‌పర్సన్ వసంత మాట్లాడుతూ, సాగునీటి సమస్యలు, కరెంట్ కష్టాలను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తోందన్నారు. సిఎం కెసిఆర్ ముందు చూపుతో వ్యవహరించడం వల్ల నేడు తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో పాటు వరి ధాన్యం దిగుబడిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్ గా నిలిచిందన్నారు.

గత పాలకులు వ్యవసాయం దండగ అంటూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్షం చేస్తే వ్యవసాయం దండగ కాదు… పండగ అని సిఎం కెసిఆర్ నిరూపించారని, ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్, బిజెపి పార్టీల నేతలు విషం చిమ్ముతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీరు పారలేదని అబద్దాలు మాట్లాడటం వారికే చెల్లిందన్నారు.

మండుటెండల్లో సైతం చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకున్నా వారికి కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమం కనిపించడం లేదని చెబుతున్న కాంగ్రెస్, బిజెపి నేతల కోసం కంటి పరీక్ష శిబిరాలను ఏర్పాటు కంటి చూపు ప్రసాదించేలా చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్ స్థానంలో మూడు గంటలే ఇస్తారని, రైతు బంధుతో వివిధ సంక్షేమ పథకాలను నిలిపివేస్తారన్నారు.

అలాగే బిజెపి అధికారంలోకి వస్తే బడా పారిశ్రామికవేత్తలు అంబానీ, అదానీలకు దోచిపెడుతారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నల కోసం వినూత్న పథకాలు తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నట్లుగా కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇస్తున్నారా అని ఆమె ప్రశ్నించారు.

మీ 40 ఏళ్ల పాలనలో రైతులకు ఏమి చేశారో చెప్పాలని కాంగ్రెస్ నేతలను వసంత డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బిజెపిల దొంగ వేషాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News