Wednesday, January 22, 2025

అమెరికన్ల మీద మోడీ మౌనం?

- Advertisement -
- Advertisement -

ఏదైనా ఉంటే మన దేశంలో విమర్శించుకోవాలి, దెబ్బలాడుకోవాలి, విదేశీ గడ్డమీద పరువు తీసుకుంటామా, ఎవరైనా మన దేశాన్ని ఏమైనా అంటే రాజకీయ విభేదాలతో నిమిత్తం లేకుండా అందరం ఒకటై ఖండించాలి. రాహుల్ గాంధీ విదేశాల్లో నరేంద్రమోడీ సర్కార్ మీద చేసిన విమర్శల సందర్భం గా కాషాయ మార్కు దేశభక్తి ప్రబోధకులు చెప్పిన అంశాల సారమది. నిజమే కదా అంటే నిజమే అని అనేక మంది అనుకుంటున్నారు. కశ్మీరు వివాదంలో మధ్యవర్తిత్వం వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ తనను కోరినట్లు నాలుగు సంవత్సరాలనాడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నపుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఖండించేందుకు నరేంద్రమోడీకి నోరు రాలేదు. అలాంటిదేమీ లేదని మన విదేశీ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. కరోనా వైరస్ చికిత్సకు పనికి వస్తుందో లేదో నిర్ధారణగాని మలేరియా నిరోధక హైడ్రోక్సీక్లోరోక్విన్ ఔషధాన్ని తక్షణమే తమకు పంపకపోతే డొక్క చించుతామని అదే ట్రంప్ మన దేశాన్ని 2020 ఏప్రిల్‌లో బెదిరించాడు. కొద్ది గంటల్లోనే మన దేశం అంతకు ముందు ఎగుమతులపై విధించిన నిషేధాన్ని సడలించి గుజరాత్‌లోని మూడు ఫ్యాక్టరీల నుంచి అడిగినంతా పంపింది. దాంతో మోడీ గొప్ప అంటూ ఆకాశానికి ఎత్తాడు ట్రంప్. మనది ఒక సర్వసత్తాక దేశం. ఒక దేశాధినేతతో మరొక దేశం అనుసరించాల్సిన కనీస మర్యాదను పాటించకున్నా నరేంద్ర మోడీ నోరు మెదపలేదు. మన ఇరుగు పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్ అడిగినా వెంటనే స్పందించని మోడీ అమెరికా బెదిరింపుతో వెంటనే పంపారు. ఇవి గతానికి చెందినవి. ఒక సినిమాలో నీ ఊరు వస్తా, నీ ఇంటి కొస్తా అన్నట్లుగా మన గడ్డమీద ఉండి ఒక విదేశీయుడు మన అంతర్గత అంశం గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ గురించి రచ్చ చేసిన వారు నోటికి తాళం వేసుకున్న తాజా ఉదంతాన్ని చూద్దాం.
ఎరిక్ గార్సెటీ అనే పెద్ద మనిషి మన దేశంలో అమెరికా రాయబారి. భారత్ కోరితే మణిపూర్ మంటలను ఆర్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. అది మన అంతర్గత అంశం, మరొకరు ఎవరూ జోక్యం చేసుకోకూడదు. కానీ గార్సెటీ వేలు దూర్చాడు. కోల్‌కతాలో జూలై 6 తేదీన విలేకర్ల మాట్లాడుతూ ‘మణిపూర్‌లో జరుగుతున్న హింస వ్యూహాత్మక సంబంధమైనది కాదని నేను అనుకుంటున్నాను. ఇది మానవ సంబంధమైనది. ఇలాంటి హింసలో పిల్లలు లేదా ఇతరులు మరణిస్తున్నపుడు ఒక భారతీయుడిగా మీరు రక్షించేందుకు చూడరా. అనేక మంచి పరిణామాలు జరగాలంటే ముందు శాంతి నెలకొనాలని మనకు తెలుసు. ఈశాన్యం, తూర్పు భారతాల్లో ఎంతో పురోగతి ఉంది. కోరితే ఏవిధంగానైనా సాయపడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇది భారత్‌కు చెందిన అంశమని మాకు తెలుసు, అక్కడ తక్షణమే శాంతి నెలకానాలని మేము ప్రార్ధిస్తాము. ఆ శాంతి నెలకొంటే మేము మరింత భాగస్వామ్యం, మరిన్ని ప్రాజెక్టులు, మరింత పెట్టుబడి తెస్తాము’ అన్నాడు. ఏ విధంగా చూసినప్పటికీ ఏ విదేశీ రాయబారి నోటి వెంటా ఇలాంటి మాటలు రాకూడదు. మరొక దేశమైతే తక్షణమే అతగాడిని పిలిపించి హద్దుల్లో ఉండాలని మందలించి పంపేది. ఎవరికీ తలొగ్గం అని చెబుతున్న మన విదేశంగా శాఖ మంత్రికి, అధికారగణానికి ఇదేమీ పట్టలేదు. ఎందుకంటే అది అపర దేశభక్త ప్రధాని నరేంద్ర మోడీకి ఇష్టం ఉండదు అని వారికి తెలుసు. ఆఫ్రో అమెరికన్ల మీద జరిగే దాడుల గురించి లోకానికంతటికీ తెలుసు. ఏ రోజు ఎవడు తుపాకులు తీసుకొని ఉత్తి పుణ్యానికి ఎంత మందిని కాల్చి చంపుతాడో తెలియదు. అలాంటి వాటి నివారణలో సహకరిస్తామని మన దేశంతో సహా ఎవరైనా ప్రకటిస్తే అమెరికా ఊరుకుంటుందా? ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు మన దేశమే అని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ దీని గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. విశ్వగురువులు లేదా బాస్‌లు ఇలాంటి చిన్నచిన్న అంశాల మీద మాట్లాడరని అనుకోవాలి, అంతే! నాడు జైలు నుంచి విడుదల చేస్తే బ్రిటీషు వారికి సేవ చేసుకుంటానని, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనను అని రాసిచ్చిన సావర్కర్ తరువాత దానికి కట్టుబడి ఉన్న అపర దేశభక్తుడు. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా అమెరికాకు ఖాళీ కాగితం మీద సంతకాలు చేసి ఇచ్చారా? ఏమిటీ మౌనం, ఎందుకీ బలహీనత, రాయబారిని మందలిస్తే అమెరికాకు ఆగ్రహం వస్తుందని భయపడుతున్నారా? ప్రపంచంలోనే చక్రం తిప్పుతున్నారని మురిసిపోతున్న భక్తులేం అవుతారో అన్నది ఆలోచించాలి కదా!
చిత్రం ఏమిటంటే రాహుల్ గాంధీ విదేశాల్లో మన కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని విమర్శిస్తే అది దేశద్రోహం. కానీ అమెరికా రాయబారి మన గడ్డమీద మణిపూర్ మంటలను మీరు ఆర్పలేకపోయారు, మీరు కోరితే ఆర్పటంలో సాయం చేస్తామని చెప్పటం కంటే మన కేంద్ర ప్రభుత్వానికి అవమానం మరొకటి ఉండదు.అయినప్పటికీ దున్నపోతు మీద వాన కురిసినట్లు ఉంది. అరిందవ్‌ు బాగ్చీ అని మన విదేశాంగశాఖ ప్రతినిధి ఉన్నారు. దాదాపు రోజూ ఏదో ఒక అంశం మీద విలేకర్లతో మాట్లాడుతూ ఉంటారు. ఎరిక్ గార్సెటీ మాట్లాడిన అంశాల గురించి తనకు తెలియదని అన్నారు. అంతటితో ఊరుకుంటే వేరు. విదేశీ దౌత్యవేత్తలు మన అంతర్గత అంశాల గురించి మాట్లాడటం అసాధారణం.అతను ఏం మాట్లాడిందీ కచ్చితంగా తెలుసుకొనేంత వరకు తానేమీ వ్యాఖ్యానించలేనని కూడా అరిందవ్‌ు చెప్పారు. మణిపూర్‌లో శాంతి కోసం భారత ప్రభుత్వం, భద్రతా దళాలు పని చేస్తున్నట్లు చెప్పారు. పదకొండవ తేదీ వరకు విదేశాంగ ప్రతినిధి నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఏ మాట్లాడిందీ ముఖతా తెలుసుకొనేందుకు అమెరికా రాయబారిని పిలిచారన్న వార్తలు కూడా లేవు. నాకు సరిగ్గా తెలియదు అని చెప్పటం అరిందవ్‌ు బాగ్చీకి కొత్తకాదు. భారత్ తమ వ్యూహాత్మక భాగస్వామి అని ప్రకటనలు గుప్పించటంలో అమెరికా గద్దె మీద ఎవరున్నా తక్కువ తినలేదు.ఇరవై నెలల పాటు ఖాళీగా ఉన్న తరువాత ఎరిక్ గార్సెటీని మన దేశంలో రాయబారిగా జో బైడెన్ ఖరారు చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆ మేరకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది.
పౌరసత్వ చట్ట సవరణ గురించి, భారత్‌లో మానవ హక్కుల గురించి గార్సెటీ గతంలో విమర్శలు చేశాడు. రాయబారిగా ఖరారు చేసిన తరువాత వాటి గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందవ్‌ు బాగ్చీ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? ఇటీవల అతను ఏం మాట్లాడాడో తెలియదు, సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఉన్నాయి, అవి చాలా పాతవి, వాటి మీద మన వైఖరి ఏమిటో మీకు బాగా తెలిసిందే అన్నారు. “తప్పుడు అభిప్రాయాలతో మన అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొనేందుకు రాజకీయ అజెండాతో అతన్ని పంపుతున్నారు. అతనికేమీ తెలియదు, అహంకారి, అతన్ని ఆమోదించకూడదు” అని బిజెపి మాజీ ఎంపి తరుణ్ విజయ్ ట్వీట్ చేశారు. అతని నియామకం పశ్చిమ దేశాల వ్యతిరేక మనోభావాలను రగిలిస్తుందని బిజెపి యువమోర్చా ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాష్ అన్నారు. కేరళలో కమ్యూనిస్టులంటే గిట్టని త్యదీపం అనే పత్రిక ప్రధాని నరేంద్ర మోడీకి ఉక్రెయిన్ పోరు గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడటానికి సమయం ఉంటుంది గానీ మణిపూర్ గురించి మాత్రం పట్టదు అని విమర్శించింది. మోడీ మన్‌కీ బాత్‌లో అడవుల్లో పెరిగే గడ్డి గురించి కూడా మాట్లాడుతారు గానీ మణిపూర్‌లో ఇబ్బందులు పడుతున్నవారి గురించి పట్టించుకోరు.ఈశాన్య రాష్ట్రాలలో 30సార్లకు పైగా పర్యటించి ఉంటారు. మణిపూర్‌కు మాత్రం కావాలనే వెళ్లటం లేదు అని సంపాదకీయంలో పేర్కొన్నది. ఈ పత్రికను అంగామలీ సిరోమలబార్ చర్చ్ నడుపుతుంది. ఆ పత్రిక చర్చి నేతలను కూడా వదల్లేదు. తొలి రోజుల్లో మణిపూర్ హింసాకాండను చర్చి నేతలు విస్మరించారన్నది నిజం. ప్రకటనలు చేయటం తప్ప వారు ఇప్పటికీ హింసాకాండ జరిగిన ప్రాంతాలను సందర్శించేందుకు లేదా రాష్ర్టపతి దృష్టికి తీసుకు వెళ్లేందుకు సిద్ధంగా లేరు, కనీసం ఢిల్లీలో పత్రికా విలేకర్ల సమావేశం పెట్టే ప్రయత్నం కూడా లేదు అని పేర్కొన్నది. మండుతున్న మణిపూర్ గురించి అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన తరువాత కూడా ప్రధాని మోడీలో చలనం లేదు. ఎవరేమనుకుంటే నాకేం అన్నట్లుగా ఉన్నారు. ఇంత హింసాకాండ, రచ్చకు కారణం మణిపూర్‌లో మెజారిటీగా ఉన్న మెయితీ తెగవారిని షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని సిఫార్సు చేయాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశించటమే. అలాంటి అధికారం హైకోర్టుకు లేదని సుప్రీంకోర్టు చెప్పిన తరువాత కూడా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తమ వైఖరులను వెల్లడించలేదు.
జనాభాలో హిందువులైన మెయితీలు 53 శాతం ఉండగా, క్రైస్తవులుగా ఉన్న గిరిజనులు 40 శాతం.అరవై మంది ఉన్న అసెంబ్లీలో నలభై మంది మెయితీలు ఉన్నారు. వారు బిజెపి ఓటు బ్యాంకుగా ఉన్నారు. జరుగుతున్న హింసాకాండలో మెయితీలకు పోలీసులే ఆయుధాలు ఇచ్చారని, పోలీస్ స్టేషన్ల నుంచి అపహరించినట్లు కేసులు నమోదు చేశారని వార్తలు వచ్చాయి. హింసాకాండ ప్రారంభమైన 70 రోజుల నుంచి ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ఎవరి మీద ఎవరికీ విశ్వాసం లేదు. 1960లో తెచ్చిన భూ సంస్కరణల చట్ట ప్రకారం కొండ ప్రాంతాల్లో గిరిజనేతరులు భూమి కొనుగోలు చేసేందుకు, అమ్మేందుకు అవకాశం లేదు. ఆ భూముల మీద కన్నేసిన మెయితీలు తమను గిరిజనులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టికల్ 371సి ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. మణిపూర్‌లో హింసాకాండ జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం తమాషా చూస్తున్నది. రాష్ర్ట ప్రభుత్వం మీద ఎలాంటి చర్యలూ లేవు. రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ఓటు బ్యాంకు దెబ్బతింటుంది, మౌనంగా ఉంటే ఏ రోజు ఏం జరుగుతుందో, ఎందరి ప్రాణాలు పోతాయో తెలియదు. అయినా ప్రధానికి పట్టదు. విస్తారమైన భూమిని ఏదో ఒక పద్ధతిలో స్వంతం చేసుకోవాలని ఈ సామాజిక తరగతి చూస్తున్నదనే ఆరోపణ ఉంది. అందుకు గాను అక్రమంగా పక్కనే ఉన్న మయన్మార్ నుంచి అక్రమంగా గిరిజనుల వలసలను ప్రోత్సహిస్తున్నట్లు ఆ తరగతి ఆరోపిస్తోంది. అక్రమ వలసలన్నది ఒక సాకు మాత్రమే అని గిరిజనులు అంటున్నారు. వాస్తవాలను వివరించి రెండు సామాజిక తరగతుల్లో ఉన్న అనుమానాలు, అపోహలను తొలగించటంలో గతంలో ఉన్న ప్రభుత్వాలతో పాటు వర్తమాన బిజెపి కూడా విఫలమైంది, మతం పేరుతో ఓటు బ్యాంకు ఏర్పాటుకు పూనుకుంది. తాజా పరిణామాలో మణిపూర్‌లో తిరిగి ఉగ్రవాదం తలెత్తితే బిజెపిదే బాధ్యత అవుతుంది.

-ఎం.కోటేశ్వర రావు, ఫోన్ : 8331013288.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News