న్యూఢిల్లీ: ఇండియా-చైనా సరిహద్దు ఘర్షణ వాతావరణంపై కేంద్ర ప్రభుత్వం చర్చ జరపకుండా తప్పించుకుంటోందని కాంగ్రెస్ గురువారం నిందించింది. చైనా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకని మౌనంగా ఉంటున్నారని ఎఐసిసి మీడియా, పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్ హెడ్ పవన్ ఖేరా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
ప్రపంచ బ్యాంకు, అమెరికా, యూరొప్ బ్లాక్‌లిస్ట్ చేసిన కంపెనీకే జమ్మూకశ్మీర్ సరిహద్దుజిల్లాలో స్మార్ట్ మీటర్లు పెట్టే కాంట్రాక్ట్ ఇచ్చారని అన్నారు. “చైనా విషయంలో ప్రతిపక్షాలు, మీడియా చూసిచూడనట్లు ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది. పార్లమెంటులో సరిహద్దు చిచ్చుపై చర్చ జరపకుండా ప్రభుత్వం తప్పించుకుంటోంది. ప్రధాని అసలు నోరెత్తడం లేదు. పైగా ఆయన చైనాకు క్లీన్‌చిట్ ఇస్తున్నాడు” అని ఖేరా విమర్శించారు. “మన జవానులు చాలా సాహసవీరులు. వారు చైనా సైనికులను వెనక్కు తరిమేశారు. మన సైన్యంపట్ల మనకు గర్వంగా ఉంది. కానీ ప్రధాని చైనాకు క్లీన్‌చిట్ ఇస్తుంటే, మన సరిహద్దులు సురక్షితంగా ఎలా ఉంటాయి?” అని ఆయన ప్రశ్నించారు. “చైనాతో మీకున్న సంబంధాలు ఏమిటి? మీకున్న తప్పని స్థితి(కంపల్షన్స్) ఏమిటి? మాకైతే తెలియదు, కాకపోతే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. యావత్ దేశం తెలుసుకోవాలనుకుంటోంది. స్థానిక ఎంఎస్‌ఎంఈ యూనిట్లను కాదని గుజరాత్‌లోని డొలేరాలో చైనా కంపెనీలకు భూమిని ప్రభుత్వం కేటాయించింది” అని తెలిపారు. చైనా కంపెనీలు పిఎం కేర్స్ ఫండ్‌కు నిధులు ఇచ్చాయని ఆయన ఆరోపించారు. దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ప్రభుత్వం వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.
“ అరుణాచల్‌ప్రదేశ్‌లో 15 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టింది. ఓ గ్రామాన్ని కూడా ఏర్పాటుచేసుకుంది అని మిటిటరీ నిపుణులు హెచ్చరించారు. అయినప్పటికీ ప్రభుత్వం మౌనంగా ఉంటోంది. కారణం ఏమిటి?”అని ప్రశ్నించారు.
“1962లో ఇండియాచైనా యుద్ధం జరిగినప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి పార్లమెంటులో చర్చ జరగాలని కోరారు. దానికి నెహ్రూ ఆమోదించారు. ఇప్పుడేమో పార్లమెంటులో చర్చ జరపాలని కోరుతుంటే సమస్యలు సృష్టిస్తున్నారు” అని ఖేరా చెప్పుకొచ్చారు. “ఓ ఎంపీ చర్చ రహస్యంగా జరగాలని, అది మీడియాలో ప్రచురణ కాకుండా చూడాలని సూచించినప్పుడు నాటి ప్రధాని నెహ్రూ దానికి నిరాకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ చరిత్ర నుంచి చాలా నేర్చుకోవాలి” అని పవన్ ఖేరా అన్నారు.