బ్యాంకు అకౌంట్ అడగకపోవడంతో ప్రజల సందేహం
అకౌంట్ నంబర్ లేకుండా లబ్ధిదారులకు ఎలా డబ్బులు చెల్లిస్తారు
అకౌంట్ నెంబర్ల కోసం మళ్లీ గ్రామసభలు నిర్వహిస్తారేమో?
మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్
మన తెలంగాణ / హైదరాబాద్/ కరీంనగర్ : ఆరు గ్యారెంటీల దరఖాస్తులో బ్యాంకు అకౌంట్ అడగకపోవడంలో ఆంతర్యమేమిటని మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారేంటీల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అభయహస్తం, ఇందిరమ్మ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీల సంక్షేమ పథకాల కోసం ప్రజలు దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు, రేషకార్డు జతపరుస్తున్నా దరఖాస్తు ఫారంలో బ్యాంకు అకౌంట్ నెంబర్ కోసం ఎలాంటి సమాచారం అడగకపోవడంలో ఆంత్యర్యమేమిటని ఆయన నిలదీశారు.
కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వం దరఖాస్తు ఫారంలో బ్యాంకు అకౌంట్ గురించి ఎందుకు అడగడంలేదని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బ్యాంకు అకౌంట్ కోసం మళ్లీ గ్రామాసభలు నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం బ్యాంకు అకౌంట్ లేకుండా లబ్ధిదారులకు ఎలా సంక్షేమ పథకాల డబ్బులు చెల్లిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుతో ప్రజలు ఆగమవుతున్నారని, ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి, బిఆర్‌ఎస్‌వి రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు, బిఆర్‌ఎస్ నాయకులు బైరం పద్మయ్య, టిఎన్‌జిఓ మాజీ అధ్యక్షుడు అహమద్, దూలం సంపత్ గౌడ్, సాయికృష్ణ , వినోద్ తదితరులు పాల్గొన్నారు.