Monday, December 23, 2024

మణిపూర్ సిఎంను మార్చరెందుకు?

- Advertisement -
- Advertisement -

మణిపూర్ రాష్ర్టం చాలా చిన్నది. అక్కడ జరిగిన హింస మాత్రం చాలా భయంకరమైంది! దీని వల్ల ప్రజలు ఎంత ఇబ్బందిపడ్డారో! అగ్నికి ఆజ్యం పోసేలా వ్యవహరించిన ముఖ్యమంత్రిని ఆ పదవిలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు? స్వాతంత్య్ర భారత దేశ చరిత్ర లో కక్షలు కార్పణ్యాల వల్ల ఘర్షణలు జరిగి, హింస చేలరేగడం కొత్త కాదు.ఈ హింసను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. భారత దేశం నుంచి విడిపోవాలని, స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటూ అనేక సాయుధ తిరుగుబాట్లు జరిగినవి మొదటి రకం.ఆ తిరుగుబాట్లు 1950, 1960లలో నాగా, మిజో కొండలలో జరగగా, పంజాబ్‌లో, కశ్మీర్ లోయలో 1980, 1990లలో జరిగాయి. అధిక సంఖ్యాకుల హింస రెండవ రకానికి చెందినది. ఇది కొన్ని రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగింది.

సిక్కులకు వ్యతిరేకంగా 1984లో, ముస్లింలకు వ్యతిరేకంగా 2002లో గుజరాత్‌లో హింస జరిగింది. ఈ రెండు హత్యాకాండలు హిందూ ముఠాలు చేసినవే. కశ్మీర్‌లో పండిట్‌లపై 1989 90లో ఇస్లామిక్ జిహాదీలు హత్యాకాండకు దిగాయి. మణిపూర్‌లో మెయితీలు గతం లో స్వతంత్ర దేశం కావాలని తొలిసారిగా సాయుధ తిరుగుబాటు చేశారు. తమనొక ప్రత్యేక జాతిగా గుర్తించాలని నాగాలాండ్‌లో సాయుధ నాగాలు తిరుగుబాటు చేశారు. మణిపూర్‌లో ఇప్పుడు జరుగుతున్నది మెయితీలు, కుకీలనే రెండు జాతుల మధ్య జరుగుతున్న ఘర్షణ.ఈ ఘర్షణలో భారత దేశం నుంచి విడివడాలని ఎవరూ కోరుకోవడం లేదు. మణిపూర్‌లో ప్రస్తుతం అంతర్గతంగా జరుగుతున్న మత ఘర్షణల వంటివే గతంలో ఇతర రాష్ట్రాలలో కూడా జరిగిన గుణపాఠం మనకుంది. ఒక స్థాయిలో చెప్పుకోదగ్గ తేడాలు మాత్రం ఉన్నాయి. మణిపూర్‌లో పోరాట యోధులైన ఇరు పక్షాలకు మారణాయుధాలు లభించడంలో నైష్పత్తిక తేడా అయితే ఉంది.

మధ్య భారతదేశంలో నక్సలైట్లు కానీ, ఉత్తర భారతదేశంలో దోపిడీ ముఠాలు కానీ అప్పుడప్పుడూ పోలీస్ స్టేషన్‌లపై దాడులు చేశాయి. కానీ, తాజాగా మణిపూర్‌లో పోలీస్ స్టేషన్లపైన పెద్దఎత్తున దాడులు చేసి, పెద్ద మొత్తంలో ఆయుధాలు ఎత్తుకుపోవడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. కశ్మీర్‌లో పాకిస్థాన్‌కు చెందిన సాయుధ జిహాదీలు దాడి చేసి ఉండవచ్చేమో కానీ, హిందువులు గుజరాత్‌లో ముస్లింలపైన, ఢిల్లీలో సిక్కులపైన కత్తులు, బాంబులతో దాడులు చేసిన సంఘటనలను భారతదేశం చవిచూసింది. ఏదేమైనప్పటికీ, ఈ రోజు మణిపూర్‌లో ఘర్షణపడే ఇరు వర్గాలు మారణాయుధాలతో దాడులు చేసుకుంటున్నాయి. ఇక్కడ రెండవ తేడా ఏమిటంటే, ఉభయులూ భౌగోళిగంగా విడివిడిగా ఉండాలనే కోర్కె నుంచే ఈ ఘర్షణ పుట్టుకొచ్చింది. మే 2023కు ముందు కొండ ప్రాంతాల్లో మెయితీలు కానీ, రాజధాని ఇంఫాల్ ప్రాంతంలో కుకీలు కానీ చెప్పుకోదగ్గ సంఖ్యలో లేరు.

ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న అధిక సంఖ్యాకులు అక్కడున్న అల్పసంఖ్యాకులను తగ్గించేసి, మనుగడలో లేని రాష్ట్రానికి పరిమితం చేయాలనుకుంటున్నారు. ఒక వాస్తవం ఏమిటంటే అహ్మదాబాదు లాంటి ప్రాంతాల్లో హిందువులు, ముస్లింల నివాసాలు విడివిడిగా ఉన్నాయి. మణిపూర్‌లో భౌగోళికంగానే కాకుండా సామాజికంగా కూడా విభజన పెద్ద దూరంలో లేదు. గుజరాత్‌లో హిందూ తీవ్రవాదులు ముస్లింలను ఒక ప్రత్యేక రాష్ర్ట ప్రాంతానికి పరిమితం చేయాలనుకున్నారు. మణిపూర్‌లో మెయితీలు, కుకీలు మాత్రం ఇక ఎన్నడూ ఒకరినొకరు చూసుకోకుండా ఉండాలనుకుంటున్నారు. ఇంకా మరికొన్ని సారూప్యతలు కూడా ఉన్నాయి.

గుజరాత్‌లో మహిళలపై 2002లో హింస జరిగిన విధంగానే, 2023లో మణిపూర్‌లో కూడా మహిళలపై హింస జరిగింది. రెండవ సారూప్యత ఏమిటంటే రెండు రాష్ట్రాలలో కూడా రాజకీయ నిర్మాణ వ్యవస్థే ఈ హింసకు పాల్పడింది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి ఒక వర్గం వైపు అంటే అధికసంఖ్యాకుల వైపు ఉండిపోయారు.మణిపూర్‌లో మెయితీలు 53% ఉండగా, నాగాలు 24% ఉన్నారు. మూడవ అతిపెద్ద వర్గంగా కుకీలు 16 శాతంతో ఉండిపోయారు. గుజరాత్ జనాభాలో హిందువులు 88 శాతం ఉండగా, ముస్లింలు పది శాతం మాత్రమే ఉన్నారు. మణిపూర్‌లో ఘర్షణ జరిగే రెండు వర్గాల నిష్పత్తి 3.3:1 ఉండగా, గుజరాత్‌లో 8.8:1గా ఉంది.

గుజరాత్‌లో ఏకపక్షంగా ఉన్న హింస మణిపూర్‌లో అలా లేకపోవడానికి రెండు వర్గాల మధ్య జనాభా నిష్పత్తిలో గుజరాత్ కున్నంత తేడా లేకపోవడమే కారణం. బడి పిల్లల మధ్య ఏదైనా కొట్లాట జరిగిందనుకోండి, గుజరాత్‌లో అయితే ఒక వర్గం పిల్లలు ఒక్కొక్కరు మరొక వర్గం వారికి చెందిన ఎనిమిది మందితో తలపడాల్సి వస్తుంది. అదే మణిపూర్‌లో అయితే ఒక్కొక్కరు ముగ్గురితో తలపడాలి. ఇదే ప్రత్యర్థి ముఠాలతో, ప్రత్యర్థి పార్టీలతో, ప్రత్యర్థి జాతితో జరుగుతుంది. కీలకమైనది ఏమిటంటే, మణిపూర్‌లో జనాభా రీత్యా ఆధిపత్యంలో ఉన్న మెయితీల బలం రాజకీయంగా కూడా బలపడింది. సహజంగానే మెయితీ జాతికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు.

మంత్రివర్గంలో కూడా కుకీలు, నాగాల కంటే మెయితీ వర్గం వారే ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యమైన శాఖలు కూడా మెయితీ వారికే దక్కాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి మెయితీకి చెందిన వారు. తనను తాను మెయితీకి చెందిన వాడిగా చెప్పుకోవడానికి ఆయనేమీ సిగ్గుపడడం లేదు. ఘర్షణలు మొదలైనప్పటి నుంచి ఆయన స్పష్టంగా ఏకపక్ష ప్రకటనలు చేస్తున్నారు. మెయితీలు అధికంగా ఉన్న లోయలోకి కుకీలు ప్రవేశించకూడదని, అలాగే కుకీలు ఉండే కొండ ప్రాంతాలకు మెయితీలు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి చాలా ఎత్తుగడగా విభజనను ఆమోదిస్తున్నారు. శాంతి భద్రతలు రాష్ర్ట జాబితా కిందకు వస్తాయి. ప్రభుత్వ ఆయుధాగారాన్ని దోచుకుంటున్నప్పుడు కానీ, అమాయకులను చంపేస్తున్నప్పుడు కానీ, మహిళలపై అత్యాచారం చేస్తున్నప్పుడు కానీ దాన్ని నిలువరించడం కానీ, నిలువరించడానికి ప్రయత్నించడం కానీ ముఖ్యమంత్రికి ఇష్టం లేనట్టుంది. మణిపూర్ తుఫాన్ అలలు పొరుగునున్న మిజోరాంను కూడా తాకాయి.

కుకీలు ఆశ్రయం పొందుతున్న మిజోరాంలో మెయితీలను రాష్ర్టం విడిచి వెళ్ళి పొమ్మని చెప్పే స్థాయికి వెళ్ళాయి. చాలా చిన్నదైన మణిపూర్ రాష్ర్టంలో జరిగిన హింస ఎంత భయంకరమైంది! దీని వల్ల ప్రజలు ఎంత ఇబ్బందిపడ్డారు! అగ్నికి ఆజ్యం పోసేలా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఆపదవిలో ఇంకా ఎందుకు కొనసాగుతున్నారు? ఈ ప్రశ్న పార్లమెంటులో ఉన్న ప్రతిపక్ష నాయకులు వేయడం కాదు, ఈ నేలలో శాంతిని, సామరస్యాన్ని కోరుకునే ప్రతి పౌరుడు వేస్తున్న ప్రశ్నలు. కొన్ని వారాల క్రితమే ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి ఉండవలసింది. బిజెపిలో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తమ నాయకుల మద్దతుతోనే ఆ పదవిలో ఆయన ఇంకా కొనసాగుతున్నారు. నోట్లరద్దు వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టం, కోవిడ్ సమయంలో ఆలోచించకుండా ఉన్నట్టుండి లాక్‌డౌన్ విధించడం వల్ల ఏర్పడిన సామాజిక బాధలు, భారత దేశం తనదని ప్రకటించుకున్న భూభాగంలో వేలాది కిలోమీటర్లను చైనా ఆక్రమించుకోవడం వంటి దారుణమైన వైఫల్యాలు విధానాలలో కానీ, వ్యక్తిగతంగా కానీ ఎలాంటి మార్పును తీసుకురాలేక పోయాయి. అధికార బిజెపి ద్వయం అవసరం అనుకుంటే మధ్యలోనే ముఖ్యమంత్రిని మార్చేస్తాయి. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కానీ, అతని పార్టీ కానీ సంక్షోభాన్ని సరిగా పరిష్కరించలేనందుకు తొలగిస్తే ఆ పార్టీకి సరైన గుర్తింపు ఉండేది. బిజెపి కనుక కొత్త ముఖ్యమంత్రిని నియమించకపోయినట్టయితే, కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాల్సిన స్థితికి దారి తీస్తుంది. నా దృష్టిలో ఇది చాలా న్యాయమైన కోర్కె.

కేంద్ర హోం శాఖా మంత్రి మణిపూర్‌లో పర్యటించి వచ్చినప్పటికీ, అక్కడి పరిస్థితిపైన పట్టుసాధించలేకపోయారు. ఎలాగైనా ముఖ్యమంత్రిని కాపాడాలని ప్రధాన మంత్రికి అమిత్ షా నివేదించినట్టుంది. అన్నిటికంటే చివరగా, ముఖ్యంగా మణిపూర్ ముఖ్యమంత్రిని తొలగించినట్టయితే, 2002 గుజరాత్ అల్లర్లకు ఆనాటి ముఖ్యమంత్రిని ఎందుకు తొలగించలేదన్న వాదన ముందుకు వస్తుంది. నాటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పాయీ తన ‘రాజ ధర్మాన్ని’ అనుసరించి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని మార్చాలని భావించినప్పటికీ, అరుణ్ జైట్లీ, ఎల్.కె. అద్వానీ వంటి సీనియర్ మంత్రివర్గ సభ్యులు అలా చేయవద్దని ఆయన్ని ఒప్పించారు. ఈ విషయంలో గుజరాత్‌కు, మణిపూర్‌కు చాలా దగ్గర సారూప్యతలున్నాయి. గుజరాత్ అల్లర్ల గురించి తనను ఎత్తి చూపిస్తారని ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ ముఖ్యమంత్రిని మార్చాలని కోరుకోవడం లేదు. తన రాజధర్మాన్ని నిర్వర్తించమని కూడా ఆయన్ని కోరడం లేదు.

గుజరాత్‌లో 2002 నాటి పరిస్థితి కంటే, 1980లో పంజాబ్ పరిస్థితి కంటే, 1990లో జమ్ము కశ్మీర్ పరిస్థితి కంటే నేటి మణిపూర్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని నేను వాదించాను. ఒకరినొకరు ద్వేషించుకునే రెండు జాతుల మధ్య ఘర్షణలను నివారించడానికి మొదలుపెడితే, రాష్ర్ట ప్రభుత్వం వారిలో సామాజికంగా ఒక నమ్మకాన్ని కలిగించాలనుకుంటే, మొట్టమొదటగా ముఖ్యమంత్రిని వెంటనే మార్చాలి. నైతికత, వ్యావహారికత రెండూ బీరేన్ సింగ్‌ను తొలగించమనే కోరుతున్నాయి. విషాదం ఏమిటంటే ఈ పని చేయడానికి సిద్ధంగా లేరు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా అనే రెండు బలమైన శక్తుల వల్ల బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి పదవి చాలా భద్రంగా ఉంది.

మూలం : రామచంద్ర గుహ, 
అనువాదం : రాఘవశర్మ, 9493226180
(‘టెలిగ్రాఫ్’ సౌజన్యంతో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News