Friday, November 22, 2024

జాతీయ హోదా ఎందుకివ్వరు?

- Advertisement -
- Advertisement -

Why not give national status to Kaleshwar Project:KTR

కాళేశ్వరంపై ట్విట్టర్ ద్వారా కేంద్రాన్ని నిలదీసిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్షం కనబరుస్తున్న కేంద్ర వైఖరిని రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఎండగట్టారు. తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద బహుళదశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరానికి అన్ని అర్హతలున్నా జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు? అని కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి ట్విట్టర్ వేదికగా నిలదీశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్ష కాదా? కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్న రాష్ట్ర బిజెపి ఎంపిలు చోద్యం చూస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రాజెక్టు పనుల ప్రారంభానికి ముందే 2016 ఫిబ్రవరి 11న ప్రధానికి మోదీ సిఎం కెసిఆర్ లేఖ రాశారు. 2016 ఆగస్టు 7న మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడు లక్షల మంది సమక్షంలో ఇదే అంశంపై ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. 2018, ఆగస్టు 5న ప్రధాని మోడీకి మరో లేఖ రాశారు. కాళేశ్వరం పాజెక్టు నిర్మాణానికి కనీసం రూ.20 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. 2018, డిసెంబర్ 26న రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా వెళ్లి మోడీని సిఎం కెసిఆర్ కలిసిన సందర్భంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2018, జులై 18న అప్పుడు రాష్ట్ర సాగు నీటి పారుదల శాఖ మంత్రిగా వున్న హరీష్‌రావు జలశక్తిశాఖ మంత్రిని కలిసి ఇదే విషయమై వినతిపత్రం అందజేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం టిఆర్‌ఎస్ ఎంపీలు పలుమార్లు పార్లమెంట్ సాక్షిగా కేందాన్ని కోరారు.

వినోద్ కుమార్, కేశవరావు, నామా నాగేశ్వరరావు, కవిత ఎన్నోసార్లు ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించినా పట్టించుకోలేదు. టిఆర్‌ఎస్ ఎంపీలు పలుమార్లు ప్రశ్నించిన నేపథ్యంలో..అప్పటి జలశక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ ‘ఇకపై ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే విధానం ఉండబోదని, ఏప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇచ్చేది లేదని విస్పష్టంగా ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన కొంత కాలానికే కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన అప్పరభద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించడం గమనార్హం. అనునిత్యం తెలంగాణ ప్రభుత్వంపై ఒంటికాలితో లేచి ఆవకాలు, చవాకులు పేలుతున్న బిజెపి ఎంపీలు కేంద్రం ఇంతగా వివక్ష చూపుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్క ప్రాజెక్టుల విషయమే కాదు.. ప్రతి అంశంలోనూ అడుగడుగునా కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపుతున్న దాఖలాలు ఇటీవలి కాలంలో లెక్కకు మించి ఉండటం గమనార్హం. ఇటువంటి పరిస్థితుల్లో మంత్రి కెటిఆర్ బిజెపి ఎంపిలపై నేడు ట్విట్టర్ ద్వారా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News