సెప్టెంబర్ 30 తర్వాత మార్పిడి చేసుకోకపోతే ఏమవుతుంది?
ఒక రోజు 10 నోట్లకే అవకాశమిచ్చారెందుకు?
న్యూఢిల్లీ : రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్‌బిఐ) చేసిన ప్రకటనతో ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ నోట్లను మే 23 నుంచి సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆర్‌బిఐ సూచించింది. 2016 సంవత్సరంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రవేశపెట్టిన ఈ రూ.2 వేల నోట్లను ఇప్పుడు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. గడువు తర్వాత వాటి చెలామణి ఉండదు. రిజర్వు బ్యాంక్ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంపై ఉన్న సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం.
రూ.2 వేల నోట్ల ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారు?
ఆరు సంవత్సరాల క్రితం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత ఆర్‌బిఐ 1934 చట్టం సెక్షన్(1) కింద రూ.2000 నోటును ప్రవేశపెట్టింది. ఇతర చిన్న నోట్లు తగినంతగా అందుబాటులోకి రావడంతో అనుకున్న లక్షం నెరవేరింది. దీంతో రూ.2000 నోట్ల ముద్రణను 201819 సంవత్సరంలో నిలిపివేశారు.2017 మార్చికి ముందు ఆర్‌బిఐ పెద్దమొత్తంలో రూ.2 వేల నోట్లను జారీ చేసింది. నాలుగైదు ఏళ్ల తర్వాత ఈ పెద్ద నోట్లను లావాదేవీల్లో సాధాణంగా వినియోగించడం తగ్గిపోయింది. ఇతర నోట్ల చలామణి పెరిగింది. ‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా రిజర్వు బ్యాంక్ ఈ నోటును రద్దు చేయాలని నిర్ణయించింది.
క్లీన్ నోట్ పాలసీ ఏమిటి?
క్లీన్ నోట్ పాలసీ అంటే మెరుగైన భద్రతా ప్రమాణాలతో మంచి నాణ్యత కల్గిన కరెన్సీ నోట్లు, నాణేలను ప్రజలకు ఇవ్వడం, అదే సమయంలో తడిసిన, మురికిపట్టిన నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవడం అన్నమాట. గతంలో 2005 ముందు ఆర్‌బిఐ ఇలా బ్యాంక్ నోట్లను ఉపసంహరించుకుని, తర్వాత ముద్రించిన నోట్లకు కొన్ని భద్రత ప్రమాణాలను జోడించింది.
సెప్టెంబర్ 30 తర్వాత ఏమవుతుంది?
సెప్టెంబర్ 30 తర్వాత 2000 రూపాయల నోట్ల పరిస్థితి ఏమిటనేది ఆర్‌బిఐ వివరణ ఇవ్వలేదు. అయితే రిజర్వు బ్యాంక్ సూచనలు ఇచ్చిన గడువు వరకు అమలవుతాయి.
డిపాజిట్‌కు ఏమైనా పరిమితి ఉందా?
మీరు రూ.2 వేల నోట్లు ఒక రోజు రూ.20 వేలు మాత్రమే మార్పిడి చేసుకోవాలి. మీ సొంత బ్యాంక్ బ్రాంచ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు, ఇతర ఏ బ్యాంక్ బ్రాంచ్‌లోనైనా రూ.2 వేల నోట్లను (10 నోట్లు) మార్పిడి చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) స్పష్టం చేసింది. ఈ నోట్లను ఇప్పటికీ లావాదేవీల్లో ఉపయోగించవచ్చని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
ఎప్పటి నుంచి నోట్లను మార్పి చేసుకోవాలి?
సిద్ధమయ్యేందుకు బ్యాంకులకు ఆర్‌బిఐ సమయం ఇచ్చింది. ప్రజలు తమ దగ్గర ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు మే 23 నుంచి బ్యాంక్ బ్రాంచ్‌లు లేదా ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లాలని ఆర్‌బిఐ సూచించింది.
రూ.2 వేల నోట్లు ఎక్కువగా ఉంటే ఏం చేయాలి?
సాంకేతికంగా ఒక వ్యక్తి అనేకసార్లు రూ.20 వేల చొప్పున నోట్లను మార్పి చేసుకోవచ్చు. అయితే పరిమితికి మించి నోట్లను డిపాజిట్ చేస్తే ఆదాయం పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో రూ.2000 నోట్లను కల్గివుంటే వాటి మార్పిడి కష్టమే అవుతుంది.
ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల విలువ ఎంత?
రూ.2 వేల నోట్లలో 89 శాతం 2017 మార్చికి ముందు జారీ చేయగా, వాటి అంచనా జీవితకాలం 45 ఏళ్లు ముగిసింది. చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ రూ.6.73 లక్షల కోట్ల నుంచి రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది. అంటే 2023 మార్చి 31 నాటికి రూ. 2 వేల నోట్లు మాత్రమే చలామణి 10.8 శాతం మాత్రమే ఉంది.