Thursday, January 23, 2025

రూపాయిని కాపాడలేమా?

- Advertisement -
- Advertisement -

Corona again in india అనుకున్నంతా జరిగింది. డాలర్‌తో రూపాయి విలువ భారీగా పతనమైంది. 80 రూపాయిలకు చేరుకొన్నది. అంచెలంచెలుగా పడిపోతూ మంగళవారం నాడు యీ స్థాయికి దిగజారిపోయింది. 2022 సంవత్సరం ఆరంభంలో డాలర్‌కు 74 వద్ద గల మన కరెన్సీ ఆరు మాసాల్లో ఆరు శాతం పడిపోయి 80 రూపాయల వద్దకు మునిగిపోయింది. చరిత్రలో యెన్నడూ లేని తరుగుదలకు గురయింది. పతనాన్ని అరికట్టడానికి రిజర్వు బ్యాంకు తీసుకొంటున్న చర్యలన్నీ నిష్ఫలంగా నిరూపణ అయిపోతున్నాయి. వడగళ్ల వానకు చిరుగుల గొడుగు పట్టినట్టు వృథా అవుతున్నాయి. రూపాయికి అంతర్జాతీయ మారకపు కరెన్సీ హోదా కల్పించినా ప్రయోజనం శూన్యమేనని రుజువైపోయింది. ప్రధాని మోడీ 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా, బిజెపి తరపు ప్రధాని అభ్యర్థిగా ఉన్నప్పుడు రూపాయా, యుపిఎ ప్రభుత్వమా యేది ముందుగా పతనమవుతుందో చూడాలి అంటూ విసుర్లు చిత్తగించారు.

అప్పుడు డాలర్‌తో రూపాయి 64 వద్ద వుంది. రూపాయి పడిపోకుండా కాపాడడానికి యుపిఎ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతున్నదని, దిక్కు తోచని దుస్థితిలో చిక్కుకొన్నదని మోడీ నిశిత విమర్శన బాణాలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే డాలర్ విలువను 45 రూపాయలకు దించుతామని బిజెపి వాగ్దానం చేసింది. ఇప్పుడు 80 రూపాయలకు చేరుకొని యింకా పతనమవుతున్నా మోడీ ప్రభుత్వం అయోమయావస్థలో చిక్కుకొని వుండడం గమనించవలసిన విషయం. డాలర్‌తో రూపాయి యింత భారీగా పడిపోడానికి, కర్ణుడి చావుకి మాదిరిగా అనేక కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది మన దిగుమతుల ఖర్చు విపరీతంగా పెరిగిపోడం, యెగుమతులు విశేషంగా పెరగకపోడం కాగా అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడంతో డాలర్ బలపడడం మరో కారణం. మన దిగుమతుల్లో ముఖ్యమయినది క్రూడాయిల్. పెట్రోల్, డీజెల్‌లకు మూలమైన ఆయిల్ కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడి వున్నాము. 85 శాతం ఆయిల్‌ను యితర దేశాల వద్ద అంతర్జాతీయ రేటుకు విదేశీ మారక ద్రవ్యంతో కొనుగోలు చేసి దిగుమతి చేసుకొంటున్నాము. దాని రేటు పెరిగే కొద్దీ విదేశీ మారక ద్రవ్యాన్ని అమితంగా చెల్లించవలసి వస్తున్నది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం తదితర కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర 110 డాలర్‌లు మించిపోయింది. దీనితో మనం దిగుమతి చేసుకొనే క్రూడ్ కోసం చెల్లించాల్సిన డాలర్‌ల భారం అధికమై ఆ మేరకు రూపాయి విలువ పడిపోతున్నది.

డాలర్‌తో రూపాయి పతనానికి మరో కారణం మన షేర్ మార్కెట్ నుంచి డాలర్ పెట్టుబడులు అమితంగా ఉపసంహరణకు గురి కావడం. అవి యెక్కడ గిట్టుబాటుగా వుంటుందో అక్కడికి తరలిపోతాయి. మన మార్కెట్లలో మంచి ఆదాయం వస్తున్నంత కాలం యిక్కడ ఉంటాయి. వేరొక చోట బాగుంటే అక్కడకు పోతాయి.మన స్టాక్ మార్కెట్ నుంచి యీ యేడాది యింత వరకు 30 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయి. ఇది యెన్నడూ లేనంత యెక్కువ ఉపసంహరణ. అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడంతో యీ తరలిపోవడం యిటీవల బాగా పెరిగింది. డాలర్‌తో రూపాయి విలువను నిలబెట్టడానికి రిజర్వు బ్యాంకు తన వద్ద గల డాలర్లను కొంత మేరకు విడుదల చేస్తుంది. రిజర్వు బ్యాంకు వద్ద ప్రస్తుతం 600 బిలియన్ల డాలర్ నిల్వలున్నాయి. కాని అడుగు వూడిపోయిన ఆర్ధిక వ్యవస్థను కాపాడడడం వీటి వల్ల సాధ్యం కాదు. బంగారం దిగుమతుల పైనా సుంకాలను భారత ప్రభుత్వం పెంచింది బంగారం దిగుమతుల కింద ఖర్చు అవుతున్న డాలర్లను పొదుపు చేస్తే కొంతయినా ప్రయోజనం కలుగుతుందని ఆశించింది. అయినా ఫలితం లేకపోయింది. బయటినుంచి డాలర్‌లు విశేషంగా వచ్చేలా చర్యలు తీసుకోవడమే రూపాయిని కాపాడగలుగుతుంది.

అది మన యెగుమతులను పెంచడం వల్లనే సాధ్యం. కాని ఆ స్థాయిలో మన యెగుమతులు పెరిగే అవకాశాలు లేవు. దేశంలో తయారీ రంగం నాణ్యతను విశేషంగా, అంతర్జాతీయ పోటీని తట్టుకొని గెలిచే స్థాయికి పెంచాలి. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా ఘోరంగా విఫలమయింది. పాలక పక్షమే వుద్దేశపూర్వకంగా, పని కట్టుకొని పెంచుతున్న మత వైషమ్యాలు దేశంలో శాంతిని బలిగొంటున్నాయి. ఇందుకు భయపడిన విదేశీ పెట్టుబడులు ఇండియా వైపు చూడ్డం మానుకొన్నాయి. చైనా నుంచి తరలిపోయి వస్తాయనుకొన్న పెట్టుబడులు కూడా రాలేదు.

అందుచేత రూపాయి పతనం యిలాగే కొనసాగుతుందని భావించాలి. డాలరు బలహీనపడినప్పుడు కూడా రూపాయికి నిమ్మళం కలుగుతుంది. మన వద్ద డాలర్ నిల్వలు ఈ మేరకైనా వున్నాయంటే అది మన ఎగుమతుల గొప్పతనం వల్లనే కాదు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ షరతులకు లొంగి స్వీయ ప్రయోజనాలను త్యాగం చేస్తున్నందు వల్ల, దేశ దేశాలకు వెళ్లి భారతీయులు పంపిస్తున్న డాలర్ ద్రవ్యం వల్లనే మన వద్ద నిల్వలు పెరుగుతున్నాయి. ప్రధాని మోడీ ప్రభుత్వం దేశాన్ని మరో శ్రీలంక చేస్తున్నదన్న విమర్శ నుంచి తనను తాను కాపాడుకోవాలనుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలపడేలా చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News