రష్యా నుంచి చౌక ధరకు చమురు ఎందుకు కొనరాదు?
న్యూఢిల్లీ: జాతి ప్రయోజనాల దృష్టా చౌక ధరకు(డిస్కౌంట్ రేటులో) రష్యా చమురును భారత్ కొంటూ ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘ఇంధన భద్రత ముఖ్యం. ఒకవేళ డిస్కౌంట్ ధరకు చమురు లభిస్తుంటే ఎందుకు కొనకూడదు?’ అని ముంబయిలో సిఎన్‌బిసిటివి18 ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్ 2022 ఎడిషన్‌లో చెప్పారు. ‘మేము రష్యా నుంచి అనేక బ్యారెళ్ల చమురును కొంటున్నాము. దాదాపు 3 నుంచి 4 రోజుల సప్లయ్‌కు సరిపడేంత కొన్నాము. భారత్ ప్రయోజనాల దృష్టా మున్ముందు కూడా కొంటుంటాము’ అని ఆమె తెలిపారు. పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ దీర్ఘ కాలికంగా వాణిజ్య భాగస్వామిగా ఉన్న రష్యా నుంచి చమురు కొంటామని ఆమె పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇదివరకే 1 శాతం కన్నా తక్కువ క్రూడాయిల్‌ను రష్యా నుంచి కొనుగోలు చేయడాన్ని సమర్థించారు. వాస్తవానికి రష్యా నుంచి ఎక్కువ చమురు, గ్యాస్ కొనే దేశాలు యూరొప్‌కు చెందినవే. ‘చమురు ధరలు పెరిగినప్పుడు తమ ప్రజలకు ఏదీ మేలో ఆ డీల్‌ను ఏ దేశమైనా చేసుకుంటుంది’ అని ఆయన వివరించారు.
అందిన సమాచారం ప్రకారం రష్యా హైగ్రేడ్ చమురును బ్యారెల్‌కు 35 డాలర్ల చొప్పున అమ్మాలనుకుంటోంది. అయితే తొలి డీల్‌లో భాగంగా భారత్ 15 మిలియన్ బ్యారెళ్లను కొనుగోలు చేయాలనుకుంటోంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్, ప్రధాని నరేంద్ర మోడీని కలిసి భారత్ ఏదీ కొనాలనుకుంటే దానిని రష్యా అందించగలదని హామీ ఇచ్చారు. రష్యా భారత్ కరెన్సీలోనే వాణిజ్యం చేసేందుకు సుముఖంగా ఉంది. రష్యాతో ఇతర దేశాలు కూడా వాణిజ్యం చేసుకునేందుకు అవకాశం ఉందని సెర్గీ లావ్‌రోవ్ ఈ సందర్భంగా తెలిపారు.