రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణం, చార్మినార్‌లను తొలగిస్తే ఊరుకునేది లేదు
మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఈ అంశంపై స్పందించాలి
ఈ తొలగింపు అంశం కేబినెట్ ముందుకు తీసుకొస్తే మంత్రులు సమ్మతి తెలుపొద్దు
కాకతీయుల కాలంలో త్రికుట ఆలయాలు,కట్టడాలు చేశారు
కాకతీయులు నిరుపేద ప్రజల కోసం పని చేసిన వారు
రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణం,చార్మినార్ తొలగింపును ప్రభుత్వం విరమించుకోకుంటే ఉద్యమానికి సిద్ధమవుతాం
కరీంనగర్ మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం మారుస్తామని సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం దేనికి సంకేతమని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈ అంశంపై కేబినెట్‌లో చర్చిస్తామని,కాకతీయ కళాతోరణం, చార్మినార్ రెండూ రాజకీయ వ్యవస్థ చిహ్నాలని సిఎం హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడారని పేర్కొన్నారు. ఎనిమిది వందల ఏళ్ల కాకతీయుల చరిత్రకు నిదర్శమైన కాకతీయ కళాతోరణం, చార్మినార్‌లను రాష్ట్రం చిహ్నం నుంచి తొలగిస్తామని సిఎం రేవంత్ రెడ్డి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
కాకతీయులు 11, 12వ దతాబ్దాల్లో యావత్తు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారని, కాకతీయులు రాచరిక వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు కాదని, పేదల కోసం పని చేసిన వారని అన్నారు. కాకతీయుల కాలంలో తెలంగాణలో గొలుసుకట్టు చెరువులతో పాటు రామప్ప, పాకాల, లక్నవరం, ఘనపూర్, సింగసముద్రం, నల్లగొండ జిల్లాలో పానగల్ ఉదయసముద్రం రిజర్వాయర్‌లతో పాటు వేలాది చెరువులు, కుంటలను నిర్మాణం చేయడంతోనే ఈ రోజు తెలంగాణ రైతాంగం బ్రతికి బట్టగలుగుతుందని చెప్పారు. తెలంగాణ వచ్చాక పదేళ్ళలో తెలంగాణ ఉద్యమ నేత కెసిఆర్ చెరువులు, కుంటలను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.
తెలంగాణ భవన్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్ సింగ్ నాయక్, టిఎస్‌టిఎస్‌సి మాజీ చైర్మన్ చిరుమల్ల రాజేష్‌లతో కలిసి వినోద్‌కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సారనాథ్ స్థూపంపై ఉన్న మూడు సింహాలు, అశోక చక్రం చిహ్నాలు భారతదేశ చిహ్నంలో ఉన్నాయని..మరి అది రాచరిక వ్యవస్థకు సంకేతం కాదా? అని ప్రశ్నించారు. భారత ప్రభుత్వం గుర్తించి జాతీయ చిహ్నాలుగా గుర్తించారని పేర్కొన్నారు. కాకతీయ తోరణం, చార్మినార్ చిహ్నాలను మారిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఆంధ్రోళ్లు తెలంగాణ వ్యవసాయాన్ని, తెలంగాణ భాషను, యాసను, తెలంగాణ చరిత్రను తుడిచివేయాలని అనుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి చేస్తున్న తీరును చూస్తుంటే తెలంగాణ చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తుందని చెప్పారు. ఇంకా రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన లక్షణాలు పోయినట్లు అనిపించడం లేదని విమర్శించారు.
కాకతీయులు అణగారిన బిసి కులానికి చెందిన వారు
వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయంతో పాటు కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లితో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో త్రికుట ఆలయాలు, కట్టడాలు చేశారని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కాకతీయులు అణగారిన బిసి కులానికి చెందిన వారుగా చరిత్రకారులు చెబుతుంటారని చెప్పారు. సిఎం రేవంత్ రెడ్డి హుందాగా ఉండాలి కానీ ఎవరో చెప్పిన వాటిని నమ్మి ఇలా ప్రవర్తించడం ఏంటని అన్నారు. టిఎస్‌ను టిజి అని పేరును కూడా మారుస్తామని సిఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతన్నారో తెలియదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టిజి అనే పేరును రాయడం జరిగిందని, తమిళనాడు, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో టిజి అనే పేరు ఉండటంతో టిఎస్‌గా మార్చినట్లు వివరించారు. కాకతీయులు పాలించిన వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ ఎంఎల్‌ఎగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఇదే పూర్వపు వరంగల్ జిల్లా నుంచి మరో మంత్రి సీతక్క ఉన్నారని…కాకతీయ కళాతోరణంను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు స్పందించాలని కోరారు. ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గకుంటే ప్రజలను, యువకులలను ఏకం చేసి ఉద్యమిస్తామని అన్నారు.
తెలంగాణ చరిత్రను మరిపించాలని అనుకుంటున్నారు
తెలంగాణ విడిపోవడం ఆంధ్ర మేధావి వర్గం తట్టుకోవడం లేదని వినోద్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల డైరెక్షన్‌లో సిఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. గత పదేళ్లలో కెసిఆర్ హయాంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవు అని…రెండు రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించి తెలంగాణ చరిత్రను మరిపించాలని అనుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు సిఎంగా ఉన్న సమయంలో ప్రణయ్ భాస్కర్ అనే వరంగల్ ఎంఎల్‌ఎ ఉన్నారని,అసెంబ్లీలో జై తెలంగాణ అంటే అనొద్దని అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు బెదిరించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తొలగించవద్దని కోరారు. ఒక వేళ కేబినెట్ ముందుకు ఈ అంశం వస్తే మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మలనాగేశ్వర్ రావు,, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రతిపాదనను వ్యతిరేకించాలని సూచించారు.