Sunday, January 19, 2025

ఈవిఎంల ద్వారా ఓటు వేసే విధానంపై విస్తృత ప్రచారం

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పిస్తామని, అందుకోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ఓటర్లకు అవగహన కల్పించేందుకు నియోజకవర్గాల వారీగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ఓటరు ఈవిఎంల ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవగాహన కల్పించడం కోసం రెండు ప్రచార వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఈ వాహనాల ద్వారా ఈవిఎంల ద్వారా ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో స్పష్టంగా తెలియపరుస్తారన్నారు. ఈ రోజు నుంచి ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు ఈవిఎల వాడకంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో చేర్చేందుకు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాగార్జున, డిపిఆర్‌ఓ భీంకుమార్, అదనపు పిడి డాక్టర్ నరేశ్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News