Tuesday, December 24, 2024

చలించే మనసు

- Advertisement -
- Advertisement -

ఏ మాత్రం అనుకోని సంఘటన అది. ఇన్నేళ్ళకి రవి రావటమే ఓ మురిపెం. దానికి తోడు, అతనితో భర్త ఎలా వుంటాడో అని అనుమానపడుతుంటే ఎంతో స్నేహంగా మెలగటం శైలజకి తబ్బిబ్బుగా వుంది.
పిల్లాడు స్కూలుకి వెళ్ళిపోయాడు. భర్త అప్పుడే ఆఫీసుకి వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేరు. వెంటనే శైలజ వీధి తలుపు వేసేసి, బోల్టు పెట్టేసింది. ఇంచుమించు పరుగు లాంటి నడకతో రవి దగ్గరకొచ్చి, అతని రెండు చేతులు పట్టుకుంది. పట్టుకుని..‘ఎన్నేళ్ళు అయింది రవి మనం ఇంత దగ్గరగా వుండి” అంది. “అవును” అన్నాడు రవి.
“చదువుకునే రోజుల్లో ఎంత పచ్చిగా వుండే వాళ్ళం.. అసలు జీవితంలో మళ్ళీ ఇటువంటి అవకాశం వస్తుందనుకోలేదు” అంది శైలజ, రవి చేతుల్ని మరింత గట్టిగా పట్టుకుంటూ.
మళ్ళీ “అవును” అన్నాడు రవి నెమ్మదిగా.
“అంత చనువుగా, దగ్గరగా మెలిగే దాన్ని కదా, ఏనాడేనా నువ్వు కొంచెం చొరవ చేసి ధైర్యంగా ముందు కొస్తే, అప్పుడే ఈ శరీరం నీకిచ్చేసేదాన్ని, ఎందుకలా చెయ్యలేదు” అంది కొంచెం నిష్టూరంగా. రవేం మాట్లాడలేదు.
“ఏం మాట్లాడవేం”? అంది.
“ఎప్పుడేనా నా అంతగా నేనేమేనా చేశానా? నువ్వు చెప్పింది చెయ్యటం తప్ప” అన్నాడు.
అదే నెమ్మది. అదే మంచితనం శైలజకి చిత్రమైన పులకరింతగా వుంది.
“అదే. ఎందుకలా?” అని తిరిగి అడిగింది.
“నువ్వు దేనికి, ఏం నొచ్చుకుంటావోనని బెదురు. అప్పుడే కాదు శైలజా, ఇప్పుడు కూడా నువ్వు దేనికీ ఏ మాత్రం ఇబ్బంది పడకూడదు. నీ సుఖమే నాకు ముఖ్యం. దాని కోసం దేనికైనా సిద్ధం.” అన్నాడు.
ఒక్కసారిగా రవిని కౌగలించేసుకుంది శైలజ. ఇద్దరి శరీరాలు కొద్దిగా వణుకుతున్నాయి. ఉద్వేగం, వేడి ఇద్దర్నీ కమ్ముకుంటోంది. “మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటారా?” అనడిగాడు రవి.
దానికి సమాధానం చెప్పలేకపోయింది. చెప్పలేక… “నిన్ను మీ ఆవిడ బాగా చూస్తుందా?” అనడిగింది.
“బాగా చూస్తుంది. పిల్లల్ని, ఇంటిని ఇంకా బాగా చూస్తుంది. ఏ ఇబ్బందులూ లేవు. మరి నీ సంగతి చెప్పలేదు” అనడిగాడు.
“చాలా బాగా చూసుకుంటారు. ఎటొచ్చీ ఆయనదో విచిత్ర ధోరణి. మనిషి బతికేది, బతకాల్సింది సుఖ పట్టానికే అని ఆయన ఉద్దేశం. దానికి ఏం చేసినా తప్పు లేదన్న థియరీ. నేనున్న ఈ స్థితిలో, ఆయన ధోరణి అగ్నికి ఆజ్యం పోసినట్టుంది. అసలు మనిద్దరికీ పెళ్లయి వుంటే ఏ గొడవా లేకపోను. అలా జరక్క చాలా పోగొట్టుకున్నాం”. అంది. ఇద్దరూ కొంచెం కదులుతున్నా కౌగిలిలోనే వున్నారు.
“అవును” అన్నాడు రవి.
“పోనీలే. ఇప్పుడు అవకాశం దొరికిందిగా, ఆలోటు తీర్చేసుకుందాం. బెడ్‌రూంకి వెడదామా?” అంది.
“సరే” అన్నాడు.
ఇద్దరూ ముందుకి కదులుదాం అనుకుంటుండగా డోర్ బెల్ మోగింది. ఉలిక్కిపడింది శైలజ. క్షణమాత్రంలో ఒళ్ళంతా భయం కమ్ముకుంది. భర్త ఏదైనా మర్చిపోయి వెనక్కి వచ్చాడా? తలుపు ఎందుకు వేసుకున్నారంటే ఏం చెప్పాలి? ఎర్రబడిన తమ ముఖాలు, వణుకుతున్న ఒళ్ళు చూసి అంతా గ్రహిస్తే దడదడలాడే గుండెలతో, గబగబా వెళ్ళి తలుపు తీసింది.
కొరియర్ కుర్రాడు. ‘హమ్మయ్య’ అనుకుంది. వణుకుతున్న చేతుల్తోటే కవర్ తీసుకుని, వణుకుతూనే సంతకం చేసి వెనక్కి వచ్చింది. కవర్ టేబుల్ మీద పారేసి గబగబా గ్లాసుడు నీళ్ళు తాగింది. ఎంత మాత్రం అనుకోని సంఘటన. ఒక షాక్‌లా వుంది. అయినా అప్పటికీ దడ తగ్గలేదు.
రవి దగ్గరగా వచ్చాడు. అలా వచ్చిన అతని చెండు చేతుల్ని పట్టుకుంది. అకస్మాత్తుగా ఏడుపొచ్చింది శైలజకి. ఎక్కి ఎక్కి ఏడ్చింది.
“ఏమిటి? శైలజా!’ అనడిగాడు.
“భయం రవీ, ఆయన వెనక్కి వచ్చారేమోనని. ఒక్క క్షణంలో మనసు పరిపరి విధాలపోయింది. ఇంత వరకూ మనం ఏ తప్పూ చెయ్యలేదు. తప్పు చెయ్యలేదన్న ధీమా, అది ఇచ్చే బలం ఎంతటిదో అర్థమైంది. నీకు ఈ దేహాన్ని అర్పించి, అదే శరీరంతో తిరిగి ఆయన దగ్గర ఇది వరకటిలా , మామూలుగా వుండగలనా? ఖచ్చితంగా వుండలేను. నన్ను క్షమించు రవీ!” అంది.
రవేం మాట్లాడలేదు. ‘అలాంటి దానివి, నన్నెందుకు ఇంతగా ఉద్రేక పరిచావు’ అని కోపగిస్తాడేమో అనుకుంది. తనున్న సంకట స్థితికి మళ్ళీ ఏడుపొచ్చింది శైలజకి. కళ్ళమ్మట నీళ్ళు కారుతున్నాయి.
రవి మృదువుగా శైలజ భుజాలు పట్టుకున్నాడు.
“ఇప్పుడేమైందని కన్నీళ్ళు ఊరుకో” అన్నాడు.
“మరి నీకేం కష్టంగా లేదా?” అంది.
“ముందే చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెపుతున్నాను. నీ సుఖమే నాకన్నింటికన్నా ముఖ్యం. నీ సుఖంలో నీ మనశ్శాంతీ భాగమే. నువ్వు అది లేకుండా అయితే నేను తట్టుకోగలనా. ఊరుకో” అన్నాడు.
రవి ఆ క్షణంలో దేవుడే అనిపించాడు శైలజకి. లేచి నెమ్మదిగా కౌగలించుకుంది. ఈ కౌగిలో ఉద్వేగం, వేడీ లేవు. చల్లగా ఉపశమనంగా వుంది.
“అయితే మనం ఈ జన్మకి ఇంతేనా? ఏం పొందలేమా” అనడిగింది.
“ఎందుకు పొందలేం. ఒకరంటే మరొకరికి ప్రేముంది. పరస్పరం సుఖం, శాంతి కోరుకుంటున్నాం. ఇలాగే అప్పుడప్పుడు వస్తుంటాను. ఒకళ్ళు గురించి ఒకళ్ళు తెలుసుకుంటూ వుంటాం. చూసుకుంటాం. జీవితాంతం అది చాలదా. ఆ తృప్తి చాలు” అన్నాడు.
“నిజమా?” తలెత్తి రవి వేపు చూస్తూ అంది.
“నిజం శైలజా! ప్రేమ నిండిన స్నేహం విలువేమిటో నీకే తెలుస్తుంది. మనసు చలిస్తుంది. అది దాని లక్షణం. దాన్ని స్థిరపరచుకుని సరైన దారికి మళ్ళటమే సరైన జీవితం” అన్నాడు ఆమె తల నిమురుతూ.
నిండైన స్నేహం వారిద్దరినీ సాంత్వనగా తనలోకి తీసుకుంది. ఇద్దరి మనసులూ స్థిరంగా వున్నాయి. నిశ్చింతగా వుంది.

వి. రాజారామమోహన రావు
9394738805

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News