హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకున్న ప్రియుడి మోజులో పడి భర్త హత్య చేయాలనే కుట్రను పోలీసులు బహిర్గతం చేసిన సంఘటన రంగారెడ్డి ఎల్‌బి నగర్ మండలం నాగోల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నల్లగొండ జిల్లాకు చెందిన భాస్కర్ గౌడ్, హరిత ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి మన్సూరాబాద్ ప్రాంతం మధురానగర్‌లోని వెంకటేష్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. భాస్కర్ గౌడ్ ఇసుక వ్యాపారం చేసేవాడు.
వెంకటేష్ కూడా ఇసుక వ్యాపారం చేయడంతో ఇద్దరు స్నేహితులుగా మరారు. హరితతో వెంకటేష్‌కు పరిచయం ఉండడంతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నారు. వెంకటేష్ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో వారిని హరితను ఇల్లు ఖాలీ చేయించారు. వీరు చింతలకుంటకు మారినప్పటికి ఇద్దరు మధ్య సంబంధం కొనసాగుతూనే ఉంది. భాస్కర్ కారుకు జిపిఎస్ పరికరం ఏర్పాటు చేసి అతడి కదలికలను వెంకటేష్ తెలుసుకునేవాడు. తన సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని వెంకటేష్ సహాయం భర్తను హత్య చేయాలని ప్రణాలిక రచించింది. నల్లగొండ జిల్లాకు చెందిన రౌడీషీటర్‌కు 5 లక్షల రూపాయలు చెల్లించారు. మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి భర్తకు ఇచ్చిన అనంతరం నిద్రలోకి జారుకోవడంతో అక్కడి నుంచి ప్రియుడితో కలిసి తిరుపతికి పారిపోయింది.
భర్తకు మెలుకువ వచ్చిన తరువాత భార్య కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వెంకటేష్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని పోలీసులకు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రౌడీషీటర్‌తో మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.