Sunday, January 19, 2025

భార్యను హతమార్చి ఆర్‌ఎంపి వైద్యుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

శంకర్‌పల్లి: మానవత్వం మరిచి సహధర్మచారిని గొంతు కోసి హత్య చేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్న హృదయ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండల పరిధిలోని జన్వాడ గ్రామంలో శనివారం జరిగింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కాశంపూర్ గ్రామానికి చెందిన నాగరాజు జన్వాడ రెవెన్యూ గ్రామమైన మియాఖాన్ గడ్డలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఆయన తన కుటుంబంతో కలిసి జన్వాడ గ్రామంలో గత కొన్ని రోజులుగా నివాసం ఉంటున్నాడు. శని వారం ఉదయం దాదాపు నాలుగు గంటల సమయంలో తన భార్య సుధను నిద్రిస్తున్న సమయంలో అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. ప్రత్యక్షంగా గమనిస్తున్న తొమ్మిది సంవత్సరాల కుమారుడిని కూడా హత్య చేసే క్రమంలో దిండు ఊపిరాడకుండా ముఖంపై ఒత్తి పట్టాడు.

అనంతరం అప్పటికే సిద్ధం చేసుకున్న విషాన్ని తాగి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడు బలవంతంగా తప్పించుకొని చీపురుతో గది టవర్ బోల్టు తీసి బయటి వెళ్లి ఇరుగుపొరుగు వారికి తెలుపగా సంఘటన బయటపడింది. బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ ఆ బాలుడు జరిగిన సంఘటనను తెలుపుతూ ఉంటే గ్రామస్తులు విలవిలలాడిపోయారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. హత్యలకు గల కారణాలపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల జీవితం అగమ్య గోచరంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News