మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే నెపంతో భార్యను కట్టెతో కొట్టి చంపిన భర్త ఉదంతం మెదక్ జిల్లా, తూప్రాన్ మండల పరిధి పోతరాజుపల్లిలో చోటుచేసుకుంది. సిఐ రంగ కృష్ణ, తూప్రాన్ ఎస్‌ఐ శివానందం, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు నెలల క్రితం మధ్యప్రదేశ్‌కు చెందిన ఆదివాసి అశోక్, భార్య శివకాళీ పోతరాజుపల్లిలో సాద సత్తయ్య ఇంటి ముందు పాత ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. రోజు కూలి పనులు చేసుకుంటూ ఎవరి డబ్బులు
వారి వద్దనే ఉంచుకుంటూ బతుకుతున్నారు. అశోక్ తాగడానికి డబ్బులు ఇవ్వమని భార్యతో (35) రోజూ గొడవపెట్టుకునేవాడు. అదే క్రమంలో డబ్బులు ఇవ్వలేదని కోపంతో ఆవేశంతో ఆదివారం రాత్రి అశోక్ ఆమె తల, కాళ్లు, చేతులపై కట్టెతో గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. వారి ఇంటి ముందు ఉన్న సాద ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.