Tuesday, January 21, 2025

అనుమానంతో భార్యను చంపిన వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః అనుమానించి భార్యను హత్య చేసిన నిందితుడిని వనస్థలిపురం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం….ఎపిలోని ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, కొనిజేడు గ్రామానికి చెందిన తన్నీరు బాలకోటయ్య నగరంలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, ఇంజాపూర్ గ్రామంలో ఉంటున్నాడు. బాలకోటయ్యకు 2008లో తన్నీరు శాలినీ(32)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు శివకార్తీక్, ఈశ్వర్ ఉన్నారు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవలను ఇరువర్గాల పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ చేసి రాజీకుదిర్చారు. అయినా కూడా బాలకోటయ్య ప్రవర్తనలో మార్పు రాకుండా శాలినీ ప్రవర్తనను అనుమానించి విపరీతంగా కొట్టేవాడు. దీంతో శాలినీ బాలకోటయ్య సంపాదించిన ఆస్తులు మొత్తం తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకుంది. భర్త తనను వేధింపులకు గురిచేస్తుండడంతో జులైలో శాలినీ తన ఇద్దరు కుమారులను తీసుకుని వనస్థలిపురంలోని శతావాహననగర్‌లోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చి ఉంటోంది.

భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో శాలినీపై మరింత కోపం పెంచుకున్నాడు. బాలకోటయ్య ఎలాగైనా శాలినీని చంపివేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే శాలినీ తల్లిదండ్రులు పది రోజుల క్రితం సొంత గ్రామానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బాలకోటయ్య భార్యను హత్య చేయాలని నిర్ణయించుకుని 06.10.2023 సాయంత్రం శాలినీ స్కూటీపై అంజనాపురి కాలనీలోని ఇంటికి వెళ్లి ఇంటిని శుభ్రం చేసి తిరిగి వస్తుండగా, బాలకోటయ్య విజయపురికాలనీలోని సాయిబాబా గుడి వద్ద చేరుకోగానే ఆమెను అడ్డిగించి బైక్‌తో స్కూటీని ఢీకొట్టాడు. దీంతో శాలినీ కిందపడిపోయింది, వెంటనే నిందితుడు పక్కనే ఉన్న బండరాయిని తీసుకుని బాధితురాలి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావమైన బాధితురాలు అక్కడికక్కడే మృతిచెందింది. అక్కడి నుంచి బైక్‌పై పరారైన నిందితుడు విజయవాడ వైపు పారిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలించిన పోలీసులు సూర్యపేట బస్టాండ్‌లో పట్టుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News