Sunday, March 2, 2025

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే చంపించింది

- Advertisement -
- Advertisement -

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను తన శారీరక సుఖం కోసం చంపాలని భార్య వేసిన పథకంలో భాగంగా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న డాక్టర్ సుమంత్ రెడ్డి శనివారం మృతి చెందాడు.
పక్కా ప్లాన్‌తో భర్త పై దాడి….
గతనెల 20వ తేదీన వరంగల్‌కు చెందిన డాక్టర్ సుమంత్ రెడ్డి కాజీపేట లోని తన క్లినిక్‌లో డ్యూటీ ముగించుకొని తన ఇంటికి వెళ్తున్న క్రమంలో కాజీపేట శివారు బట్టుపల్లి శివారులో ఎస్సార్ స్కూల్ దాటిన తరువాత గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే చంపించింది..
హన్మకొండ హంటర్ రోడ్డుకు చెందిన డాక్టర్ సుమంత్ రెడ్డి, వరంగల్ షిరిడి సాయినగర్‌కు చెందిన ఫ్లోరా 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సంగారెడ్డిలో సుమంత్ రెడ్డి బంధువుల విద్యాసంస్థలు ఉండగా వాటిని చూసుకోవడం కోసం భార్యతో సహా డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డికి షిఫ్ట్ అయ్యాడు. సంగారెడ్డి పిహెచ్‌సిలో కాంట్రాక్టు పద్ధతిన మెడికల్ ఆఫీసర్‌గా సుమంత్ రెడ్డి పనిచేస్తుండగా, అతని భార్య ఫ్లోరా స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుండేది. బరువు తగ్గడానికి ఆమె సంగారెడ్డిలోని సిద్దు జిమ్ సెంటర్‌కి వెళ్తుండేది. ఆక్రమంలో జిమ్ సెంటర్లో కోచ్ పనిచేస్తున్న, సంగారెడ్డి జిల్లా, కొండాపూర్ ఆదర్శ కాలనీకి చెందిన ఏర్రోల్ల శామ్యూల్ అనిల్ కుమార్‌తో పరిచయమై వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలియడంతో భార్యాభర్తలకు గొడవలు జరిగాయి. అనంతరం డాక్టర్ సుమంత్ రెడ్డి అక్కడి నుండి తన ఫ్యామిలీని వరంగల్‌కి షిఫ్ట్ చేశాడు. తరువాత 2019లో అతని భార్య జనగాం జిల్లా, పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం రావడంతో అక్కడే ఉండేవారు.

తర్వాత ఆ కాలేజీ వరంగల్‌లోని రంగశాయిపేట్ మారడంతో డాక్టర్ సుమంత్ రెడ్డి వరంగల్‌లోని వాసవి కాలనీలో ఉంటూ కాజీపేటలో ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటూ ఉదయం వెళ్లి రాత్రి తన ఇంటికి వస్తుండేవాడు. అతని భార్య ఫ్లోరా మాత్రం సంగారెడ్డిలో పరిచయమై వివాహేతర సంబంధం పెట్టుకున్న శామ్యూల్ తో తరచుగా ఫోన్లు మాట్లాడడం, వీడియో కాల్స్ మాట్లాడడం, డాక్టర్ సుమంత్ రెడ్డి లేని సమయంలో సదరు శామ్యూల్‌ని ఇంటికి పిలిపించుకొని అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండేది. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ సుమంత్ రెడ్డి ఆమెను మందలించేవాడు. ఈ విషయంలో వారిద్దరికీ తరుచుగా గొడవలు జరుగుతుండేవి. దానితో ఫ్లోరా, శామ్యూల్‌లు డాక్టర్ సుమంత్ రెడ్డిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. తరువాత శామ్యూల్ ఈ విషయాన్ని తన స్నేహితుడైన రాజ్ కుమార్ అనే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌కి చెప్పి డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యకి సహకరిస్తే సంగారెడ్డిలో ఇంటిని నిర్మించి ఇస్తానని చెప్పగా దానికి  ఒప్పుకొన్నాడు. తరువాత 15 రోజుల క్రితం లక్ష రూపాయలు ఫ్లోరా మరియా శామ్యూల్‌కి ట్రాన్స్ఫర్ చేసింది.

ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం సంగారెడ్డిలో సుత్తి కొనుగోలు చేసి రాజకుమార్ మోటార్ సైకిల్‌పై కాజీపేటకు చేరుకున్నారు. ఇద్దరు ముందుగా అనుకున్న ప్రకారం సిసి కెమెరాలు, జనసంచారం లేని చీకటి ప్రదేశాన్ని ఎంచుకొని, రెక్కీ నిర్వహించారు. డాక్టర్ సుమంత్ రెడ్డి రాత్రి తన క్లినిక్‌ను ముగించుకొని కారులో బట్టుపల్లి రోడ్డు నుండి రంగాశాయపేట వెళ్తున్న క్రమంలో అతని వెనుక ఫాలో అయ్యి బట్టుపల్లి శివారులో ఎస్సార్ స్కూల్ దాటిన తరువాత ఉన్న చిన్న బ్రిడ్జి వద్ద డాక్టర్ తన కారు వేగాన్ని తగ్గించగా ఆ చీకటి ప్రదేశంలో అదే అదునుగా భావించిన శామ్యూల్ సుత్తితో కారు వెనుక ఇండికేటర్ ను కొట్టగా ఆ శబ్దానికి డాక్టర్ సుమంత్ రెడ్డి కారును పక్కకు ఆపి ఇండికేటర్ వద్దకు వచ్చి చూస్తుండగా శామ్యూల్, రాజకుమార్ అతనిని విచక్షణారహితంగా కొట్టి, తీవ్రంగా గాయపర్చారు. ఆ తర్వాత అతడు చనిపోయాడని భావించి అక్కడి నుండి పారిపోయారు. మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్ అధికారులు విచారణ చేసి ఈ కేసులోని నిందితులైన ఏ1 ఏర్రోల్ల శామ్యూల్ , ఏ2 గాదే ఫ్లోరా మరియా, మంచుకురి రాజ్ కుమార్ (ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్) ను పట్టుకొని రిమాండ్ కు తరలించారు.

డాక్టర్ సుమంత్ మృతి…
గత 8 రోజులుగా వరంగల్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుమంత్ శనివారం ఉదయం మృతి చెందాడు. ఆయన మృత దేహానికి కాజీపేటలో అంత్యక్రియలు నిర్వహించారు. గతంలో హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి చెందడంతో హత్య కేసుగా సెక్షన్ మార్చనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News