Wednesday, January 22, 2025

ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం

- Advertisement -
- Advertisement -

జోగిపేటః ప్రియుడి మోజులో భర్త హత్యకు పథకం పన్నిన భార్య…హత్యకు రూ.50 వేలు సుపారీ చెల్లించేందుకు ప్రియుడు అంగీకారం..భార్య ఫోన్‌కాల్ డేటా ద్వారా బయటపడ్డ హత్యోదంతం. ఒకే గ్రామానికి చెందిన వారు ఇరువురు ఇష్టపడ్డారు. కానీ మరొకరితో వివాహం జరిగింది. సుమారు ఎనిమిదేళ్లు గడుస్తోంది. అయినా వారి మధ్య ప్రేమ తగ్గలేదు. చివరికి భర్తను అడ్డు తొలగించుకునేందుకు పథకం పన్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా, జోగిపేటలో చోటుచేసుకుంది. శుక్రవారం కనిపించకుండా పోయిన మల్లేశం రాత్రికి రామాయంపేట సమీపంలో చెరువు వద్ద శవమై కనిపించాడు. దీనికి సంబంధించిన వివరాలు.. సంగారెడ్డి డిఎస్‌పి రమేష్ శనివారం జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో విలేకర్లకు వివరించారు.

జోగిపేటకు చెందిన పాపన్నపేట మల్లేశం చాకలి వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2015లో ఇదే మండలంలోని మన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన మేనమామ కూతురు కల్పనతో వివాహమైంది. కొంతకాలం పాటు వారి సంసారం సాఫీగానే సాగింది. ఆ తర్వాత అక్రమ సంబంధం బయటపడింది. ఇదే గ్రామానికి చెందిన మచుకూరి మహేష్‌తో ఆమెకు చిన్ననాటి నుంచి పరిచయం ఉంది. వారిరువురు ప్రేమించుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వారి అక్రమ సంబంధం కొనసాగింది. ఈ విషయంలో భర్తతో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం కల్పన ప్రియుడికి వివరించింది. చివరికి భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ఱయానికి వచ్చారు.

భర్త హత్యకు స్కెచ్..
భర్తను హత్య చేసేందుకు భార్య కల్పన, ప్రియుడు మచుకూరి మహేష్‌చివరి నిర్ణయానికి వచ్చారు. ఈ విషయం మచుకూరి మహేష్ తన బావ అంబాజీకి (రంగంపేట)కు చెప్పాడు. అతనికి పరిచమున్న పాత నేరస్థుడైన రంగంపేటకు చెందిన తలారి మహేష్, గంగారంనకు చెందిన వజ్జరి మహేష్‌లను పరిచయం చేశాడు. 20 రోజుల క్రితం మల్లేశంను హత్య చేసేందుకు వారితో రూ.50వేలకు ఓప్పందం కుదిరింది. అందుకు అడ్వాన్స్‌గా రూ.5 వేలు చెల్లించాడు. ఈ మేరకు ఈనెల 19న హత్య చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. అంతకు ముందు రోజు 18న మచుకూరి మహేష్ స్నేహితుడు టేక్మాల్ చెందిన వ్యక్తి వద్ద కారు అద్దెకు తీసుకున్నారు. అదేరోజు జోగిపేకు చేరుకొని ఇండియన్ పెట్రోల్ బంక్‌లో ముగ్గురు బస చేశారు.

ఉదయం 4.30 గంటలకు మచుకూరి మహేష్ కల్పనకు ఫోన్ చేసి వాకబు చేసి తాము అనుకున్న ప్రాంతానికి చేరుకున్నారు. కల్పన చెప్పిన ప్రకారం శుక్రవారం ఉదయం 6 గంటలకు ముగ్గురు దారి కాచి మల్లేశం వచ్చిన వెంటనే బండరాయితో తలపై కొట్టారు. దీంతో స్పృహ కోల్పోవడంతో అతన్ని కారులోకి ఎక్కించుకున్న తర్వాత కాళ్లతో గొంతు నొక్కుతూ, తీవ్రంగా కొట్టడంతో మార్గమధ్యలో మృతి చెందాడు. కారులోనే శవంతో మెదక్ అక్కడి నుంచి రామాయంపేట వెళ్లారు. అటు నుంచి మరో 4 కిలోమీటర్లు ముందుకు వెళ్లారు. అక్కడ చెరువు ప్రాంతంలో ఎవరూ లేని ప్రాంతం కావడంతో శవాన్ని నీటిలో పడేసి వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిమీద పోసి తగులబెట్టి పారిపోయారు.

ఐదుగురిపై కేసు,,
హత్యకు సంబంధించి మచుకూరి మహేష్‌తో పాటు మల్లేశం భార్య కల్పన, తలారి మహేష్, వజ్జెరి మహేష్, సహకరించిన అంబాజీలపై కేసు నమోదు చేసినట్లు డిఎస్‌పి వివరించారు. హత్యను ఛేదించేందుకు నాలుగు టీమ్‌లు పనిచేసినట్లు చెప్పారు. 21 గంటల వ్యవధిలో కేసును ఛేదించినందుకు సిఐలు నాగరాజు, సుధీర్, సీసీహెచ్ మహేష్‌గౌడ్, ఎస్.ఐలు అరుణ్‌కుమార్, క్రాంతికుమార్, కోటేశ్వర్‌రావులను అభినందించినట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News