కర్ణాటక చిత్రదుర్గలో ఓ భర్త క్రికెట్ బెట్టింగ్ వ్యసనానికి అతడి భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇంజనీర్ అయిన దర్శన్ బాబుకు 2020లో రంజితతో వివాహం జరిగింది. దర్శన్ హోసదుర్గలోని మైనర్ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేశాడు. అతడికి 2021 నుంచి క్రికెట్ బెట్టింగ్ అలవాటయింది. బెట్టింగ్ వలలో చిక్కుకున్న అతడు రూ. 1.5 కోట్లకు పైగా అప్పు చేశాడు. అప్పు వడ్డీ చెల్లించలేక వడ్డీ వ్యాపారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
దర్శన్ తీసుకున్న అప్పులో కోటి రూపాయాల వరకు తిరిగి ఇవ్వగలిగాడు. కానీ ఇంకా 13 మందికి చెల్లించాల్సిన రూ. 18 లక్షల అప్పు మిగిలిపోయింది. అప్పులిచ్చిన వారి వేధింపుల కారణంగా దర్శన్ భార్య మార్చి 18న ఆత్మహత్య చేసుకుంది. రంజిత ఆత్మహత్య లేఖ రాసి మరీ చనిపోయింది. మృతురాలి తండ్రి వెంకటేశ్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పు ఇచ్చిన వారే తన అల్లుడిని బెట్టింగ్ కు ప్రోత్సహించారని వెంకటేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.