Sunday, December 22, 2024

భర్త వద్దు.. ప్రియుడు ముద్దు

- Advertisement -
- Advertisement -

రూ.8 కోట్ల భర్త ఆస్తి కోసం…
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
తెలంగాణలో చంపింది.. కర్ణాటకలో కాల్చింది

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి దారుణ హత్య ప్రస్తుతం కలకలం రేపుతోంది. భర్త వద్దు.. ప్రియుడు ముద్దు అని హత్యకు గురైన సదరు వ్యాపారి భార్య భావించింది. అంతేకాదు భర్త ఆస్తిపైనా కన్నేసింది. భర్తకు ఉన్న రూ.8 కోట్ల ఆస్తి కోసం ప్రియుడితో కలిసి తెలంగాణలో భర్తను భార్య కడతేర్చింది. అతని శవాన్ని కర్నాటకలో తగలబెట్టింది. తెలిసిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కి చెందిన వ్యాపార వేత్త రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఉప్పల్- భువనగిరి ప్రాంతంలో హత్య చేసి డెడ్ బాడీని కర్నాటకలోని కొడగు కాఫీ ఎస్టేట్‌లో తగుల బెట్టారు. రమేష్ హత్యకు అతని భార్య నీహారిక, అమె ప్రియుడు డాక్టర్ నిఖిల్ కారణమని పోలీసులు గుర్తించారు.

కాఫీ తోటల్లో సగం కాలిన మృతదేహాన్ని కర్ణాటక పోలీసులు గుర్తించారు. హత్యకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. భువనగిరి ప్రాంతంలో ప్రియుడితో కలిసి భర్తను భార్య నిహారిక హతమార్చింది. డెడ్‌బాడీని మెర్సిడెస్ బెంజ్ కార్‌లో హైదరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి తరలించింది. హర్యానాకు చెందిన రాణా అనే వ్యక్తి సాయంతో ఇద్దరూ కలిసి ఊటీ దగ్గర ఉన్న కాఫీ ఎస్టేట్‌కి తీసుకెళ్లారు. అక్కడ రమేష్ శవాన్ని తగలబెట్టారు.

సగం కాలిన శవాన్ని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విచారణలో దిమ్మతిరిగేలా వాస్తవాలు వెలుగుచూశాయి. 8 కోట్ల రూపాయల ఆస్తి కోసమే తన భర్తను నీహారిక చంపినట్లు విచారణలో కర్ణాటక పోలీసులు తేల్చారు. రమేష్ డెడ్ బాడీని తగులబెట్టిన రాణా అనే నిందితుడిని హర్యానాలోని ఓ డాబా దగ్గర టీ తాగుతుండగా కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపార వేత్త రమేష్‌ది హైదరాబాద్ కాగా, భార్య నిహారికది యాదాద్రి జిల్లా. ఆమె ప్రియుడు నిఖిల్ సొంతూరు కడప జిల్లాగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News