రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట ఈనెల 24న విచారణకు హాజరవుతానని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో శనివారం కెటిఆర్ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అన్ని ఘటనల వివరాలు కమిషన్‌కు తెలియజేస్తానని చెప్పారు. తాను బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చారని తెలిపారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని అని పేర్కొన్నారు.
బిఆర్‌ఎస్ పార్టీ మహిళా ఎంఎల్‌ఎలను సిఎం, కాంగ్రెస్ నేతలు అన్న మాటలను కూడా మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న తెలంగాణ మహిళా కమిషన్ శుక్రవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా కమిషన్ ముందు అటెండ్ అవ్వాలని సూచించింది. ఈ మేరకు కమిషన్ ఎక్స్ ద్వారా వెల్లడించింది.