బెంగళూరు: రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన పక్షంలో బజరంగ్ దళ్, ఆర్‌ఎస్‌ఎస్‌లను నిషేధించడానికి తమ ప్రభుత్వం వెనుకడబోదని, ఇది ఆమోదయోగ్యం కాకపోతే బిజెపి పాకిస్తాన్‌కు వెళ్లిపోవచ్చని కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే బుధవారం పునరుద్ఘాటించారు.
కర్నాటకను స్వర్గధామంగా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన పక్షంలో బజరంగ్ దళ్ అయినా ఆర్‌ఎస్‌ఎస్ అయినా తాము సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. చట్టానికి ఎవరు చేతుల్లోకి తీసుకున్నా ఆ సంస్థలపై నిషేధం విధిస్తామని ఆయన హెచ్చరించారు. బిజెపి నాయకులకు ఇది నచ్చకపోతే పాకిస్తాన్ వెళ్లిపోవచ్చని విలేకరులతో మాట్లాడుతూ ఖర్గే వ్యాఖ్యానించారు.
హి౪జబ్, హలాల్, గోవధ చట్టాలపై ఉన్న నిషేధాన్ని తమ ప్రభుత్వం ఉపసంహరిస్తుందని ఆయన తెలిపారు. పోలీసులన్నా, చట్టాలన్నా భయం లేకుండా కొన్ని శక్తులు సమాజంలో స్వైరవిహారం చేస్తున్నాయని, గత మూడేళ్లుగా ఈ తంతు కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తమను ప్రతిపక్షంలో ప్రజలు ఎందుకు కూర్చోపెట్టారో బిజెపి అర్థం చేసుకోవాలని ఖర్గే హితవు చెప్పారు. కాషాయీకరణ తప్పని తాము మొదటినుంచి చెబుతున్నామని కాంగ్రెస్ పాటించే బసవన్న సిద్ధాంతాలను ప్రజలంఅనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు.