Tuesday, September 17, 2024

బంగ్లా మరో పాకిస్తాన్ కానుందా?

- Advertisement -
- Advertisement -

హసీనా జీవితం పూల పాన్పు కాదు. తండ్రి షేక్ ముజిబర్ రెహమాన్ బంగ్లా జాతి పితగా, బంగ్లాదేశ్ ప్రభుత్వ నేతగా పని చేస్తూ ఆర్మీ చేతిలో దారుణంగా హతుడైనాడు. తండ్రి మరణం హసీనాలో పట్టుదల పెంచింది. పోరాట పటిమ చూపింది. కష్టకాలంలో హసీనాకు అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆశ్రయమిచ్చింది. అలుపెరుగని పోరాట పటిమతో బంగ్లాదేశ్‌కు ఐదు పర్యాయాలు ప్రధానిగా పని చేసి, ప్రజాస్వా మ్య వ్యవస్థలో మిలిటరీ ప్రమేయం తగదని చాటి చెప్పిన హసీనాను గద్దె దించి, తరిమేయడం తాత్కాలిక ఆవేశం నుండి పుట్టిన ఆగ్రహమే. హసీనా బంగ్లాదేశ్ ప్రజాజీవితాలను మెరుగుపరి చారు. ఏ ప్రజల కోసమైతే పోరాడారో, ఏ గడ్డ కోసమైతే శ్రమించారో ఆ గడ్డ పైనే అవమానపడి, ఇండియాకు శరణార్ధిగా వచ్చారు. తండ్రి ముజి బర్ రెహమాన్ కూడా ప్రజల కోసం పని చేసి ఆత్మబలిదానం చేశారు.

అధికార దాహంతో అల్లాడుతున్న బంగ్లాదేశ్ సైన్యానికి విద్యార్థుల ఉద్యమం అయాచిత వరంలా మారింది. ప్రజాస్వామ్యం విధ్వంసమైనది. గోటితో పోయే వ్యవహారం గొడ్డలి వరకు వచ్చింది. అనాలోచితమైన నిర్ణయాలతో బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ లా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిత్వం నెలకొన్నది. బంగ్లాదేశ్ ఇప్పుడు సైన్యం కనుసన్నల్లోకి జారిపోయింది. త్రివిధ దళాలు రంగ ప్రవేశం చేసి, అధ్యక్ష భవనాన్ని ఆక్రమించడం, ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ లో ఆశ్రయం పొందడం, ఖలీదాజియా జైలు నుండి విడుదల కావడం వంటి సంఘటనలు చకచకా జరిగిపోయాయి. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనాకు అమెరికా వీసా రద్దుచేసింది.

లండన్‌లో స్థిరపడాలన్న ఆమె ఆశ నెరవేరలేదు. ఉద్యమం చేసిన విద్యార్థుల కోసం పని చేస్తానని తాత్కాలిక ప్రభుత్వ నేత చెబుతున్నారు. ఆర్మీ చీఫ్ పైకి ఎన్ని కబుర్లు చెబుతున్నా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహ్మద్ యూనస్‌ను నియమించినా, సైనిక పాలన వైపే ఆర్మీ మొగ్గు చూపుతున్నదనే నిజాన్ని ఏమార్చలేరు. బంగ్లాదేశ్‌లో సైనిక జోక్యం ప్రజాస్వామ్యాన్ని పాతరేసి మరో పాకిస్తాన్‌లా మార్చడమే అవుతుంది. అవినీతి కేసులో 13 సంవత్సరాల జైలు శిక్షపడి గత రెండేళ్లగా జైలు జీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు, మాజీ ప్రధాని ఖలీదాజియా విడుదల వెనుక ఆంతర్యమేమిటి? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన హసీనా గద్దె దిగడం వెనుక రిజర్వేషన్ల ఉద్యమమే కారణమా? లేక విదేశీ హస్తమున్నదా? హసీనాకు వీసా నిరాకరించిన అమెరికాకు ఈ కుట్రలో భాగస్వామ్యమున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాదేశ్‌లో మైనారిటీల ఇళ్లను తగలబెట్టడం, దుకాణాలను ధ్వంసం చేయడం, పోలీసు స్టేషన్లను ముట్టడించి తుపాకులను ఎత్తుకు పోవడం, వాహనాలను దొంగిలించడం అమాయకులను హత్య చేయడం, కొందరిని సజీవదహనం చేయడం మానవత్వానికి మాయని మచ్చ.

విద్యార్ధులు ఏ లక్ష్యంతో హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించారో, అదే విద్యార్ధులపై మతం పేరుతో దౌర్జన్యాలు చేయడం దారుణం. ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లయింది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా అది త్వరలో సైనికుల చేతుల్లోకి వెళ్ళక తప్పదు. ఒక్కసారి ప్రభుత్వం సైనిక పాలకుల చేతికి చిక్కితే ఇక బంగ్లాదేశ్‌లో నియంతృత్వం ఏర్పడుతుంది. ఇదే గనుక జరిగితే ఇది విద్యార్థులు కావాలని కొనితెచ్చుకున్న సంకట పరిస్థితిగా మారుతుంది. ఈ సందర్భంలో షేక్ హసీనా గురించి, ఆమె రాజకీయ నేపథ్యాన్ని, పరిపాలనను విశ్లేషించడం సముచితం, సందర్భోచితం.
రాజకీయ కక్షలతో అల్లకల్లోలమైన బంగ్లాదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ధీరవనిత, అత్యధిక కాలం బంగ్లాదేశ్‌ను పాలించిన అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా.

అభివృద్ధికి అర్ధం తెలియని బంగ్లాదేశ్ ను ప్రగతి పథంలో ముందుకు నడిపారు. జిడిపిలో భారత్ ను అధిగమించారు. అక్షరాస్యతా శాతం పెంచారు. హసీనా జీవితం పూల పాన్పు కాదు. తండ్రి షేక్ ముజిబర్ రహమాన్ బంగ్లా జాతి పితగా, బంగ్లాదేశ్ ప్రభుత్వ నేతగా పని చేస్తూ ఆర్మీ చేతిలో దారుణంగా హతుడైనాడు. తండ్రి మరణం హసీనాలో పట్టుదల పెంచింది. పోరాట పటిమ చూపింది. కష్టకాలంలో హసీనాకు అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆశ్రయమిచ్చింది. అలుపెరుగని పోరాట పటిమతో బంగ్లాదేశ్‌కు ఐదు పర్యాయాలు ప్రధానిగా పని చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలో మిలిటరీ ప్రమేయం తగదని చాటి చెప్పిన హసీనాను గద్దె దించి, తరిమేయడం తాత్కాలిక ఆవేశం నుండి పుట్టిన ఆగ్రహమే. హసీనా బంగ్లాదేశ్ ప్రజా జీవితాలను మెరుగుపరిచారు. ఏ ప్రజల కోసమైతే పోరాడారో, ఏ గడ్డ కోసమైతే శ్రమించారో ఆ గడ్డ పైనే అవమానపడి, ఇండియాకు శరణార్ధిగా వచ్చారు. తండ్రి ముజిబర్ రహమాన్ కూడా ప్రజల కోసం పని చేసి ఆత్మబలిదానం చేశారు.

ఇప్పుడు కుమార్తె కూడా రిజర్వేషన్ల ఉద్యమానికి పదవి కోల్పోయి, దేశం విడిచిపెట్టారు. ఈ సందర్భంగా హసీనా తండ్రి ముజిబర్ రహమాన్ గురించి సంక్షిప్త విశ్లేషణ అవసరం. భారత దేశం ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో అదే రోజు 1975వ సంవత్సరంలో షేక్ ముజిబర్ రహమాన్‌ను ఆయన నివాసంలో బంగ్లా సైన్యం కాల్చి చంపడం జరిగింది. తిరిగి ఇదే ఆగస్ట్టు నెలలో షేక్ హసీనా గద్దె దిగి, భారత్‌ను ఆశ్రయించడం యాదృచ్ఛికమే కావచ్చు. కాని ఆలోచించదగ్గ విషయం. ఏదిఏమైనప్పటికీ బంగ్లాదేశ్‌లో ఏర్పడిన రాజకీయ అస్థిరత్వం భారత్‌కు ముప్పుగా మారే అవకాశముంది. భారత్‌కు చుట్టూ ఉన్న దేశాలన్నీ శత్రుదేశాలుగా మారడం ఆందోళనకరం. బంగ్లా దేశ్‌లో ఎవరు అధికారంలోకి వచ్చినా భారత్‌తో స్నేహ సంబంధాలు కొనసాగించడం అవసరం.

బంగ్లా విమోచనలో భారత్ నిర్వహించిన పాత్ర మరువలేము. బంగ్లాదేశ్ కు స్వాతంత్య్రం భారత్ వలనే సిద్ధించింది. జాతి ప్రయోజనాల కంటే మత ప్రయోజనాలే ముఖ్యం కావడం వలన బంగ్లాదేశ్ ఏనాడూ పూర్తిస్థాయిలో భారత్‌కు స్నేహ హస్తం అందించలేదు. ఏదిఏమైనప్పటికీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నియమితులు కావడం, ఆయన శాంతికాముకుడు కావడం విశేషం. అయితే బంగ్లాదేశ్ సైనికాధికారుల కనుసన్నల్లో ఆయన ఎంత కాలం అధికారంలో ఉంటారో తెలియదు. ఎన్నికలు జరిగినా ఇక మీదట బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యబద్ధమైన పాలన కొనసాగుతుందని ఆశించలేం. హసీనా బంగ్లాదేశ్‌లో లౌకిక వాదానికి కట్టు బడి మైనారిటీ సోదరుల అభిమానాన్ని సైతం చూరగొన్నారు. హసీనా త్యాగాలను సాంఘిక మాధ్యమాలు మసకబార్చాయి.

విద్యార్థుల ఆవేశం బంగ్లాదేశ్ భవితవ్యాన్ని వెనక్కునెట్టింది. బంగ్లాదేశ్‌కు మొదటి ప్రధానిగా పని చేసిన ఖలీదా జియా తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయవచ్చు. ఖలీదా జియా బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు దివంగత జియావుర్ రహ్మాన్ సతీమణి. ఖలీదా జియా హసీనాకు ఆమె చిరకాల రాజకీయ బద్ధ శత్రువు. హసీనా మాదిరి ఉదార స్వభావం ఖలీదాలో లేదు. భారత్ పట్ల కూడా ఆమె విశ్వసనీయత అంతంత మాత్రమే. బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరిగి ఖలీదా జియా కనుక ప్రధానిగా మరోసారి పగ్గాలు చేపడితే భారత్‌తో ఆమె సత్సంబంధాలు కొనసాగిస్తుందా? పాక్‌తో అంటకాగుతుందా? కాలమే సమాధానం చెప్పాలి. ఏదిఏమైనప్పటికీ బంగ్లాదేశ్‌లో సైనిక జోక్యానికి స్వస్తి చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే సత్వరమే ఎన్నికలు జరపాలి. హసీనాను దేశానికి రప్పించి, ఎన్నికల్లో ఆమె పాల్గొనేటట్టు చేయాలి. హసీనా లేని ఎన్నికలు బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీకి అయాచిత వరంగా మారతాయి.

సుంకవల్లి సత్తిరాజు
9704903463

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News