బిజెపినేతలకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సూటి ప్రశ్న
ముంబై : స్పోర్ట్ కాంప్లెక్స్‌కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడంపై బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్త చేసిన నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. 2017 లో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ కర్ణాటక అసెంబ్లీలో టిప్పుసుల్తాన్‌ను చారిత్రక యోధుడని, స్వాతంత్య్ర పోరాట వీరుడని ప్రశంసించారని ఆయన రాజీనామాను కూడా బిజెపి డిమాండ్ చేస్తుందా ? అని సంజయ్ రౌత్ సూటిగా ప్రశ్నించారు. స్పోర్ట్ కాంప్లెక్స్‌కు 18 వ శతాబ్దం నాటి మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడాన్ని బిజెపి, భజరంగ్‌దళ్ తీవ్రంగా వ్యతిరేకించడాన్ని దృష్టిలో పెట్టుకుని సంజయ్ రౌత్ పై విధంగా బిజెపి ని ప్రశ్నించారు. దీనిపై బిజెపి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకే చరిత్ర అంతా తెలుసన్న భ్రమల్లో బీజేపీ ఉంటుందని, టిప్పు సుల్తాన్ గురించి తమకూ తెలుసని, బీజేపీ నుంచి చరిత్ర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని రౌత్ ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకునే పూర్లా స్వేచ్ఛ ఉందని, ఢిల్లీలో కూర్చుని చరిత్రను మార్చే ప్రయత్నాలు చేయవద్దని రౌత్ స్పష్టం చేశారు.