కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశి థరూర్ వాగ్దానం
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఎఐసిసి) అధ్యక్షునిగా తాను ఎన్నికైతే పార్టీకి చెందిన ప్రస్తుత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేస్తానని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న శశి థరూర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్లుసి)కి ఎన్నికలు నిర్వహించడం, పాతికేళ్లుగా మూలనపడిన పార్లమెంటరీ బోర్డును మళ్లీ ఏర్పాటు చేయడం వంటివి పార్టీ రాజ్యాంగంలో ముఖ్యాంశాలు. పార్టీలోఅధికారాల వికేంద్రకీరణ, కింది స్థాయి పార్టీ కార్యవర్గ సభ్యులకు కూడా అధికారాలు కల్పించడం కాంగ్రెస్ నాయకత్వం చేయాల్సిన పనులని ఒక ఇంగ్లీష్ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో థరూర్ తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పార్టీ చింతన్ శిబిర్‌లో ఏకగ్రీవంగా ఆమోదించిన ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను తాను పూర్తిగా అమలు చేస్తానని తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న థరూర్ చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవికి మల్లికార్జున్ ఖర్గేతో పోటీ పడుతున్న మీరు ఎన్నికల్లో గెలిస్తే పార్టీలో తీసుకురానున్న మార్పులేమిటని ప్రశ్నించగా అంతర్గత పార్టీ ప్రజాస్వామ్యాన్ని మరింతత విస్తరించే చర్యలలో భాగంగా తొలుత సిడబ్లుసికి ఎన్నికలు నిర్వహిస్తానని థరూర్ తెలిపారు.
పిసిసి అధ్యక్షులు, బ్లాక్, మండల్, బూత్ అధ్యక్షులకు నిజమైన అధికారాలు కల్పించడం ద్వారా రాష్ట్రాలలో పార్టీని కాంగ్రెస్ బలోపేతం చేయాలన్న విషయాన్ని తాను తన మేనిఫెస్టోలో తెలిపానని ఆయన చెప్పారు. ఉదాహరణకు మన పిసిసి ప్రతినిధులకు అక్టోబర్ 17న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడం తప్పించి గత 22 సంవత్సరాలుగా ఎటువంటి పాత్ర లేదని ఆయన వ్యాఖ్యానించారు. వారి హోదాను గౌరవించాలన్నది తన ఆలోచనని, పార్టీ సీనియర్ నాయకుడు ఎవరైనా ఆయా ప్రాంతాన్ని సందర్శించినపుడు ఆహ్వానితుల జాబితాలో పిసిసి ప్రతినిధుల పేర్లు కూడా ఉండాలని, ఎన్నికల కోసం అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో పిసిసి ప్రతినిధులతో కూడా సంప్రదింపులు జరపాలని తాను కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. పార్టీ కార్యకలాపాలలో, పాలనా వ్యవహారాలలో కేంద్రీకృత అధికారాలను చెలాయిస్తున్న బిజెపికి దీటైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో పిసిసి ప్రతినిధుల మద్దతు కూడగట్టేందుకు వివిధ రాష్ట్రాలను విస్తృతంగా పర్యటిస్తున్న శశి థరూర్ సాధారణ పార్టీ కార్యకర్తలు..ముఖ్యంగా యువజన ప్రతినిధుల నుంచి తనకు లభిస్తున్న ఆదరణ అపూర్వంగా, ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు. 2024 ఎన్నికల్లో బిజెపిని దీటుగా ఎదుర్కొనేందుకు పార్టీని సంసిద్ధం చేయడానికి తీసుకురావలసిన సంస్కరణలు, మార్పులకు తానే సరైన అభ్యర్థినని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్నాయి. అక్టోబర్ 19న ఫలితాలు వెలువడతాయి.