జాబిల్లి దక్షిణ ధ్రువంలో గణనీయమైన పరిమాణంలో మంచు ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడ ల్యాండింగ్ సవ్యంగా జరిగితే ఆక్సిజన్, ఇంధనం, నీరు వంటి వనరులపై సమాచారం సేకరించే అవకాశం లభిస్తుంది. ఈ క్రమం లోనే దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23 కంటే ముందే లునా 25 ల్యాండర్ దిగితే అక్కడ అడుగుపెట్టిన తొలి దేశంగా రష్యా చరిత్ర సృష్టించనుంది. అయితే చంద్రయాన్ 3 , లునా 25 రెండూ దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయితే అవి ఢీకొనే ప్రమాదం ఉందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
దీనిపై రష్యా స్పష్టతనిచ్చింది. ఈ రెండు అంతరిక్ష సంస్థలు ల్యాండింగ్ చేయాలనుకున్న ప్రాంతాలు వేర్వేరని పేర్కొంది. అందువల్ల అవి ఢీకొనే ప్రమాదం లేదని వెల్లడించింది. ఇక చంద్రయాన్ 3 లో ల్యాండర్, రోవర్ ప్రొపల్సన్ మాడ్యూల్స్ ఉన్నాయి. గతంలో చంద్రయాన్ 2 ప్రయోగం సందర్భంగా ఇస్రో పంపించిన ఆర్బిటర్ ఇంకా కక్షలో తిరుగుతోంది. చంద్రయాన్ 3 కి కూడా ఇదే ఆర్బిటర్‌ను వినియోగించుకోనున్నారు. ఇక చంద్రయాన్ ౩ పంపే ల్యాండర్ జాబిల్లిపై 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. రష్యా పంపే లునా 25 ఏడాదిపాటు జాబిల్లి ఉపరితలంపై పనిచేయనుంది.