కర్నాటక సిఎం బసవరాజ్ బొమ్మై ధీమా
హుబ్లి: కర్నాటక అసెంబ్లీకి 2023లో జరిగే ఎన్నికల్లో తాను, ఇతర నాయకులు సమష్టిగా బిజెపిని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగవచ్చని ఊహాగానాలు సాగిన దరిమిలా కర్నాటక బిజెపి కార్యవర్గం, పార్టీ జాతీయ నాయకత్వం ఇచ్చిన భరోసాతో ముఖ్యమంత్రి బొమ్మై బుధవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో తన నాయకత్వంలోనే పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటుందని ధీమా వ్యక్తం చేశారు. తన ప్రభుత్వంపై విశ్వాసం ఉంచినందుకు ఆయన బిజెపి నాయకత్వానికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి, కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య మరింత సమన్వయం తీసుకురావడం, రానున్న ఎన్నికలను సమష్టిగా ఎదుర్కోవడం వంటి విషయాలలో పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
పార్టీలోని కొంతమంది తనపై అసమ్మతిని వ్యక్తం చేసినప్పటికీ పార్టీ నాయకత్వం మాత్రం మొదటి నుంచి తన పట్ల సష్టమైన అభిప్రాయంతో ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నాయకత్వం మార్పు తథ్యమని, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందే బొమ్మై పదవీచ్యుతి ఖాయమంటూ కొన్ని వదంతులు ఇటీవల కాలంలో చక్కర్లు కొట్టాయి. అంతేగాక కీళ్ల వ్యాధితో బాధపడుతున్న బొమ్మై ఎన్నికల ప్రచారంతో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించలేరంటూ కూడా ఊహాగానాలు సాగాయి. వీటన్నిటినీ బొమ్మై తోసిపుచ్చారు. అవిశ్రాంతంగా 365 రోజులు తాను పనిచేయగలనని ఆయన తేల్చిచెప్పారు. రోజుకు 15 గంటలు పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా ఆయన తెలిపారు. 2021 జూలై 28న ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై తన రాజకీయ గురువు బిఎస్ ఎడియూరప్ప స్థానంలో పదవీ బాధ్యతలు చేపట్టారు.