Wednesday, January 22, 2025

అవసరమయితే రెబల్స్‌గా పోటీ ?

- Advertisement -
- Advertisement -

ఏఐసిసి ఎదుట బిసి నాయకుల ధిక్కార స్వరం!
అనుకున్న విధంగా సీట్లు ఇవ్వకపోతే పార్టీకి ఇబ్బందే..
బిసి నాయకుల డిమాండ్స్‌పై ఏఐసిసి సీరియస్
సర్వేల ఆధారంగానే టికెట్‌లను కేటాయిస్తాం
ప్రతిసారి ఢిల్లీ రావొద్దు!

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో బిసి లీడర్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. తాము అడిగిన సీట్లు ఇవ్వకపోతే రెబల్స్ గా పోటీకి దిగాలని భావిస్తున్నట్టు సమాచారం. జనాభా దామాషా ప్రకారం కాకపోయినా పార్టీ ఇప్పటికే హామీ ఇచ్చిన ప్రతి పార్లమెంట్‌లో రెండు చొప్పున 34 స్థానాలు ఇవ్వాల్సిందేనని బిసి నేతలు పట్టుబడుతున్నారు. అంతకంటే తక్కువ ఇస్తే ఊరుకోమని వారు హెచ్చరిస్తున్నారు. ఏళ్ల తరబడి నుంచి పార్టీ కోసం శ్రమిస్తుంటే పారాచూట్ నేతలకు సీట్లు ఇవ్వడం ఏమిటనీ వారు ప్రశ్నిస్తున్నారు ? ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి చేరుతున్న వారికి అంతప్రాధాన్యత ఎందుకివ్వాలని వారు అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, ఏఐసిసి రాష్ట్ర ఇన్‌చార్జీ ఠాక్రేల ఎదుట బిసి నాయకులు ప్రస్తావించారు. అయితే బిసి నాయకుల డిమాండ్‌పై ఏఐసిసి నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది.

లభించని మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్
రెబల్స్‌గా బరిలోకి దిగుతామని బిసి నాయకులు చేసిన హెచ్చరికపై ఏఐసిసి నాయకులు ఘాటుగా స్పందించినట్టుగా సమాచారం. అయితే బిసి నాయకులు పట్టువదలని విక్రమార్కుల్లాగ ఏఐసిసిఅధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీల అపాయింట్ మెంట్ కోరారు. కానీ, ఇప్పటివరకు వారి అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదని తెలుస్తోంది. నాలుగు రోజులుగా బిసి నాయకులు ఢిల్లీలోనే పార్టీకి చెందిన వివిధ జాతీయ స్థాయి నేతలను కలిసి టిక్కెట్ల కోసం విజ్ఞప్తులు చేస్తున్నారు. అయినా వారి విజ్ఞప్తులను ఏఐసిసి నాయకులు పట్టించుకోవడం లేదని, తాము ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, ప్రతిసారి ఇలా ఢిల్లీ వచ్చి ఇబ్బందులు పెట్టవద్దని బిసి నాయకులకు ఏఐసిసి నాయకులు క్లాస్ పీకినట్టుగా తెలిసింది.

అధికారంలోకి రావడమే ముఖ్యం
కులాల వారీగా టిక్కెట్లు ఇవ్వడం కంటే అధికారంలోకి రావడమే ముఖ్యమని బిసి నాయకుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఖరాఖండిగా చెప్పినట్టుగా తెలిసింది. సర్వేల్లో ఎవరు ముందు ఉంటారో వాళ్లకే టిక్కెట్లు కేటాయిస్తామని కూడా బిసి నాయకులతో ఏఐసిసి నాయకులు పేర్కొన్నట్టుగా తెలిసింది. అధికారంలోకి వస్తే సీనియర్‌లకు కచ్చితంగా పదవులు ఇస్తామని బిసి నాయకులతో ఏఐసిసి నాయకులు పేర్కొన్నట్టుగా సమాచారం. తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 15 రోజులకు ఒకసారి వేర్వేరుగా సర్వేలు చేపడుతున్నామని, వాటిలో బెస్ట్ వచ్చినవాళ్లకే టిక్కెట్లు ఇస్తామని ఏఐసిసి నాయకులు బిసి నాయకులతో పేర్కొన్నట్టుగా తెలిసింది. ఏఐసిసి నాయకులతో మాట్లాడుతున్న సమయంలో ఢిల్లీకి వెళ్లిన బిసి నాయకులకు అభ్యర్థుల సర్వే ఫలితాలను పేర్ల వారీగా వినిపించడంతో బిసి నాయకులు కొంత వెనక్కి తగ్గినట్టుగా సమాచారం. బిసిలకు సీట్ల కేటాయింపులో ఏవైనా అనుమానాలు ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలని ఏఐసిసి నాయకులు సూచించినట్టు తెలిసింది. అలా కాకుండా మీడియా ముందుకెళ్లడం, పత్రికల్లో వ్యాసాలు రాయడం తదితర అంశాలపై బిసి నాయకులను ఏఐసిసి తీవ్రంగా మందలించినట్లుగా తెలుస్తోంది.

స్ట్రాటజిస్టు సంస్థ ఓసిలకు అనుకూలం
కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం బిసి నేతలు కేవలం 25 నుంచి 30 స్థానాల్లోనే గెలిచే అవకాశం ఉందని హైకమాండ్ అందిన నివేదికలో తేలింది. దీనిని పరిగణలోకి తీసుకుని ఆ సంఖ్యలోనే సీట్లు ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న బిసి నేతలు ఎక్కువ సంఖ్యలో టిక్కెట్లు కావాలని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్టు సంస్థ కేవలం ఓసిలకు అనుకూలంగా రిపోర్టులు ఇస్తుందని, బిసిలపై వివక్ష చూపే ప్రయత్నం చేస్తుందని బిసి నేతలు ఫైర్ అవుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News