కొలంబో: తీవ్ర ద్రవ్య సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను 2022లోని దివాలా స్థితి నుంచి ఒకింత సుస్థిరత దిశగా మళ్లించిన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె సెప్టెంబర్ 21న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని శనివారం ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికలను సెప్టెంబర్ 21న నిర్వహించనున్నట్లు శ్రీలంక ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది. దీనితో ఈ కీలక ఎన్నికలపై నెలల తరబడి సాగుతున్న ఊహాగానాలకు తెర పడింది.
75 ఏళ్ల విక్రమసింఘె దక్షిణాది పట్టణం గాలెలో శనివారం ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ.. ‘ఈ పట్టణానికి ఇప్పుడు నేను రావడం చెప్పుకోదగినది. ఇప్పటికే నా డిపాజిట్ చెల్లించడంతో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయగలనని ప్రకటిస్తున్నా’ అని చెప్పారు. ‘రెండు సంవత్సరాల క్రితం నేను చేపట్టిన సంక్లిష్ట బాధ్యతను పూర్తి చేయడంతో ప్రతి ఒక్కరి మద్దతు కోసం చూస్తున్నా’ అని విక్రమసింఘె తెలిపారు. ఆయన శ్రీలంక ఆర్థిక శాఖ మంత్రి కూడా.