Monday, December 23, 2024

బిసి డిమాండ్లు పరిష్కరించని పార్టీలను ఓడిస్తాం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో లక్ష మందితో బిసిల జంగు సైరన్ సభ
బిసి ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మారుస్తాం
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బస్సు యాత్ర
బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
బలం, బలగం,ద్వారా రాజకీయ పార్టీల పై ఒత్తిడి పెంచాలి:  డాక్టర్ కేశవరావు
బిసి డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం విఫలం : ఎంపి లింగయ్య యాదవ్

మన తెలంగాణ / హైదరాబాద్ : జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బిసిలను కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల పాలనలో పట్టించుకోకుండా అనాధలుగా చూసిందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బిసి డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిసి వ్యతిరేక పార్టీలను, ప్రభుత్వాలను రాజకీయంగా బొంద పెడతామని ఆయన హెచ్చరించారు. మార్చిలో ‘లక్ష మందితో‘ ఢిల్లీలో బహిరంగ సభ పెట్టి బిసిల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజకీయ యాత్ర చేపట్టనున్నట్లు జాజుల వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో బిసి కుల సంఘాల జెఎసి చైర్మన్ కుందారం గణేష్ చారి అధ్యక్షతన ‘ జాతీయ ఓబిసి సెమినార్ ‘ జరిగింది. ఈ సెమినార్‌కు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వం వహించగా సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా, బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ కే కేశవరావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఆంధ్రప్రదేశ్ బిసి సంఘం అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందరభంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఓబిసిల తరఫున పార్లమెంట్లో అడగాల్సిన వాళ్లు అడగడం లేదని, చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వాలు చేయడం లేదని అడగాల్సిన వాళ్లు ఈడీ భయంతో పెదవులు మూసుకుంటే, చేయాల్సిన వాళ్లు ఆర్‌ఎస్‌ఎస్ భయంతో చేయడం లేదని ఆరోపించారు, ఓబిసిల అభివృద్ధిని గత 76 సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలు అడ్డుకున్నాయన్నారు. పార్లమెంట్లో ఓబిసి సమస్యలపై చర్చించకుండా మెజార్టీ ప్రజలను అవమానించాయని మండిపడ్డారు. బిసి డిమాండ్లను పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా బిసి ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా చేపడతామని అందులో భాగంగానే దేశంలో ఉన్న రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచడానికి మార్చి నెలలో ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ‘బిసిల జంగు సైరన్‘ పేరుతో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఆ తర్వాత దేశంలోని 3,500 బిసి కులాలను ఏకం చేస్తూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బిసిల రాజకీయ బస్సు యాత్రను చేపడతామని జాజుల ప్రకటించారు. బిజెపి కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో బిసి డిమాండ్లను చేర్చాలని, అలాంటి పార్టీకె బిసిల ఓట్లు అడిగే నైతిక హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.
బిసి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు : డి రాజా
సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న బిసి ఉద్యమానికి తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. బిసి డిమాండ్ల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచుతామన్నారు.
బలం, బలగం ద్వారా ఒత్తిడి : కె కేశవ రావు
బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్ష నేత డాక్టర్ కేశవ రావు మాట్లాడుతూ ఏ బలం, బలగం లేని అతి తక్కువ శాతం ఉన్నోడు ధైర్యంగా ం అధికారం చేపడుతుంటే, బలం బలగం ఉండి 60 శాతం ఉన్న బిసిలు ఎందుకు వెనుకబడి ఉండాలని ప్రశ్నించారు. బిసి డిమాండ్లు పరిష్కారం కావాలంటే ధర్నాలు దరఖాస్తులతో జరుగవని ఐక్యతతో ఒక జట్టుగా ఏర్పడి రాజకీయంగా ఏకతాటిపై కొచ్చి ఓట్ల విప్లవాన్ని తేవాలని, బిసిలు సునామి సృష్టిస్తే ఢిల్లీ పాలకులు భయపడి పరిష్కరిస్తారని అన్నారు. బిసిల పోరాటం ఎన్నో సంవత్సరాలుగా ముందుకు నడిపామని ఆ వారసత్వాన్ని జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని బిసి సంఘాల నేతలు ముందుకు తీసుకుపోవాలని సూచించారు తన 85 ఏళ్ల జీవితంలో బిసిల హక్కుల కోసం పోరాడానని ఇంకా పోరాడుతూనే ఉంటానని ఎవరికి ఎక్కడ తలొగ్గేది లేదని అన్నారు. ప్రధానులను నిలదీసి బిసి డిమాండ్లు సాధిస్తామమన్న విశ్వాసం తమకుందని కెకె అన్నారు.
కేంద్రం వైఫల్యం : బడుగుల లింగయ్య యాదవ్
బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, బిసి కులగణన, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం ఎన్నో మార్లు పార్లమెంట్లో మాట్లాడినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెవిటి వాని ముందు శంఖం వదిన చందంగా వ్యవహరించిందని బిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బిసిల విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తన ఆరేళ్ళ పదవీ కాలంలో ఎక్కువగా బిసిల విషయంలోనే పోరాటం చేశానన్నారు. మార్చిలో పదవీ విరమణ చేస్తున్న బడుగుల లింగయ్య యాదవ్ ను ఈ సభలో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో తెలంగాణ నుండి బాలగోని బాలరాజు గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకల శాం కుర్మా, శేఖర సగర, మని మంజరి, ఎపి నుండి సంచార జాతుల సంఘం అధ్యక్షులు రవికుమార్, సింగం నగేష్, ఈడిగ శ్రీనివాస్, తన్నీరు రాంప్రభు ,జాతీయ నేతలు దేవిక ,తారకేశ్వరి, వరికుప్పల మధు, నరసింహ నాయక్, గూడూరు భాస్కర్, సంజీవ్, కొత్త నరసింహస్వామి, శ్రీధర్ రాజు తోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాదిమంది పాల్గొన్నారు.

BC2

BC 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News